హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ
వాషింగ్టన్ : అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థకు చెందిన కీలక మూల స్తంభాలపై దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాడి చేశారని అంతర్జాతీయ సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ తన తాజా నివేదికలో విమర్శించింది. ట్రంప్ అవలంబించిన అనేక విధానాలను ఆ నివేదిక తప్పుపట్టింది. వలసదారులను అణచివేశారని, ప్రజల ఓటింగ్ హక్కులకు భంగం కలిగించారని తెలిపింది. గతంలో ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులకు అమెరికా బాసటగా నిలిచిందని, కానీ ట్రంప్ ప్రభుత్వం ఆ విధానం నుంచి వైదొలిగిందని ధ్వజమెత్తింది. మానవ హక్కులకు విఘాతం కలిగిస్తున్న దేశాలకు అమెరికా కొమ్ముకాస్తోందని, నిరంకుశ పాలకులను ప్రశంసనలతో ముంచెత్తుతోందని హ్యూమన్ రైట్స్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫిలిప్ బొలోపియాన్ విమర్శించారు.
‘2026లో మానవ హక్కుల భవిష్యత్తు కోసం అమెరికాలో పోరాటం తీవ్రంగా సాగుతుంది. దాని పర్యవసానాలు ప్రపంచంలోని మిగిలిన దేశాలపై కూడా పడతాయి. అమెరికాలో ఓ రకమైన అత్యంత ప్రతికూల వాతావరణాన్ని, ప్రజాస్వామ్య నాణ్యతలో క్షీణతను చూస్తున్నాము’ అని ఆయన బుధవారం ఓ వీడియోలో తెలియజేశారు. ట్రంప్ ప్రభుత్వం జాత్యాహంకార దాడులపై ఆధారపడిందని, శ్వేత జాతీయతావాద భావజాలానికి అనుగుణంగా ఉండే విధానాలను అవలంబిస్తోందని అన్నారు. వలసదారులు, ఆశ్రయం కోరే వారి విషయంలో ట్రంప్ ప్రభుత్వం అవమానకరంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ మిన్నెపొలిస్‌లో ఇద్దరు వ్యక్తులను ఐసీఏ ఏజెంట్లు కాల్చి చంపడం, ఎల్‌సాల్వెడార్‌లోని మెగా జైలుకు వందలాది మంది వలసదారులను తరలించడం వంటి ఘటనలను ప్రస్తావించారు.
వలసదారుల అణచివేతకు సంబంధించిన ఇతర అంశాల గురించి కూడా బొలోపియాన్ మాట్లాడారు. రష్యాలో పుతిన్ పౌర సమాజంపై అణచివేతను తీవ్రతరం చేశారని ఆయన విమర్శించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై కూడా ఆయన ఆరోపణలు చేశారు. కాగా గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను హ్యూమన్ రైట్స్ వాచ్ తన నివేదికలో ప్రస్తావించింది. హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికపై అమెరికా అధ్యక్ష భవనం స్పందిస్తూ ఆ సంస్థ ‘ట్రంప్ డెరేంజ్‌మెంట్ సిండ్రోమ్’తో బాధపడుతోందని వ్యాఖ్యానించింది. దేశాధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టడానికి ముందే బొలోపియాన్ ఆయనపై విమర్శల దాడి చేశారని గుర్తు చేసింది.



