ఢిల్లీలో ఎస్ఎఫ్ఐ ప్రదర్శన
విద్యార్థులపై పోలీసుల జులుం
ఈడ్చుకెళ్లి వ్యాన్లల్లో కుక్కిన ఖాకీలు
పలువురికి గాయాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష నిర్మూలనకు జారీ చేసిన యూజీసీ నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఢిల్లీలో భారీ ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వద్దకు భారీ ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులపై పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. వారిని ఈడ్చుకెళ్లి వ్యాన్లల్లో పడేశారు. ఈ దౌర్జన్యకాండలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్ ఎం సాజి, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి ఐషే ఘోష్, అధ్యక్షులు సూరజ్ ఇలామోన్, కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఎల్ అభిజిత్‌కు గాయాలయ్యాయి. ప్రదర్శనను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులనూ పోలీసులు వదలకుండా బాదేశారు. ఈ ప్రదర్శనకు అనుమతి కోరుతూ ఎస్ఎఫ్ఐ పోలీసు అధికారులకు లేఖ రాసింది. ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించి మంత్రిత్వ శాఖ సమీపంలో భారీ బారికేడ్లతో భద్రతా ఏర్పాట్లు చేశారు.
ధర్నాకు ముందే అక్కడికి చేరుకున్న విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. సమీపంలోని సెంట్రల్ సెక్రెటేరియట్ మెట్రో స్టేషన్ నుంచి ఇతర పనుల నిమిత్తం వచ్చిన చాలా మందిని వారు వెనక్కి పంపారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో, వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు ప్లకార్డులతో మంత్రిత్వ శాఖ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న పోలీసు బలగాలు విద్యార్థులను చితకబాదారు. అనంతరం వారిని రోడ్డుపై ఈడ్చుకెళ్లి అరెస్టు చేసి, స్టేషన్లకు తరలించారు. మోడీ ప్రభుత్వంలో నిరసన తెలిపే హక్కు , భావ ప్రకటనా స్వేచ్ఛ లేకుండా చేశారని ఎస్ఎఫ్ఐ నేతలు విమర్శించారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, దేశవ్యాప్తంగా విద్యార్థులకు న్యాయం, సమానత్వం లభించే వరకు తమ ఆందోళనలను తీవ్రతరం చేస్తామని ఎస్ఎఫ్ఐ అఖిల భారత కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య ఒక ప్రకటనలో తెలిపారు.



