దేశ ప్రగతికి ఊపిరిపోస్తున్నా.. స్టీరింగ్ తిప్పేవారేరి..?
దేశవ్యాప్తంగా 50-60 లక్షల డ్రైవర్ల పోస్టులు ఖాళీ
సౌకర్యాలు లేక భద్రత కరువై.. వృత్తికి దూరమవుతున్న యువత
శిక్షణ లేదు.. రహదారులపై కనీస సౌకర్యాలు లేవు
‘సంక్షేమ బోర్డు’ ఏర్పాటు చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశ ప్రగతి చక్రాలను నడిపించే రోడ్డు రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. దేశ స్థూల జాతీయాదాయంలో(జీడీపీ) 11 శాతానికి పైగా వాటా కలిగి, సరుకు రవాణాలో 69.5 శాతంతో సింహభాగం వహిస్తున్న ఈ రంగం.. స్టీరింగ్ తిప్పే నాథుడు లేక చతికిలబడుతోంది. వాహనాలు ఉన్నాయి.. సరుకు ఉంది.. కానీ వాటిని నడిపే డ్రైవర్లు లేకపోవడంతో రవాణా వ్యవస్థ కుంటుపడుతోందని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొరవడిన శిక్షణ – యువత విముఖత
దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. డిగ్రీలు, పీజీలు చదివిన యువత ఉద్యోగాల కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. అయినా.. రవాణా రంగం వైపు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని గణాంకాలు చెబుతున్నాయి. సరైన డ్రైవింగ్ స్కూళ్లు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. తమిళనాడులోని నమక్కల్ తరహాలో మన దగ్గర శిక్షణా కేంద్రాలు లేవు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన స్కూల్ నిరుపయోగంగా మారింది.
హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వమే చొరవ తీసుకుని డ్రైవింగ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని, యువతకు ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పించి లైసెన్సులు అందజేస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు డ్రైవర్ల కొరత తీరనుందని లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ చెబుతోంది. వాహన తయారీ సంస్థలు సైతం ప్రతి ఏటా కొత్త వాహనాలను రోడ్లపైకి వదులుతున్నాయి కానీ, వాటిని నడిపే డ్రైవర్లను తయారు చేయడంపై దృష్టి పెట్టడం లేదు.
రోడ్లపై సౌకర్యాలు శూన్యం
అమెరికా, యూరప్ దేశాల్లో ట్రక్ డ్రైవర్లకు ఉన్న గౌరవం, సౌకర్యాలు మన దేశంలో మచ్చుకైనా లేవు. ప్రతి 60 కిలోమీటర్లకు టోల్ వసూలు చేస్తున్న ప్రభుత్వాలు, డ్రైవర్లకు కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, స్నానపు గదులు, విశ్రాంతి గదులు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో డ్రైవర్లు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వాస్తవానికి నెలలో ఎక్కువ రోజులు రోడ్లపైనే గడిపే డ్రైవర్లకు సరైన తిండి, నిద్ర ఉండదు. కంటి చూపు మందగించడం, ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.
ఓనర్ కమ్ డ్రైవర్ల కన్నీటి వ్యధ
రవాణా రంగంలో 50 శాతం మంది యజమానులే డ్రైవర్లుగా(ఓనర్ కమ్ డ్రైవర్స్) పనిచేస్తున్నారు. 50 ఏండ్లు దాటిన వీరు అనారోగ్యంతో బాధపడుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో వాహనాలు నడుపుతున్నారు. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడుతోంది. వీరికి ప్రభుత్వం నుంచి సామాజిక భద్రత లేదు. అందుకే వీరిని ‘అసంఘటిత కార్మికులు’గా గుర్తించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
ముఖ్యమంత్రికి విజ్ఞప్తి..
పెరిగిన డీజిల్ ధరలు, విడిభాగాల రేట్లు, పెరగని కిరాయిలతో సతమతమవుతున్న ఈ రంగాన్ని కాపాడుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని తెలంగాణ లారీ ఓనర్స్, డ్రైవర్లు కోరుతున్నారు. మానవ వనరుల కొరత వల్ల నెలలో పది రోజులు లారీలు నిలిచిపోతున్నాయని, ప్రభుత్వం ఆదుకోకపోతే కోట్లాది కుటుంబాలు ఆధారపడిన ఈ రంగం పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.
కేంద్ర విధానాలతో రవాణా రంగ సంక్షోభం
పుప్పాల శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్-సీఐటీయూ
దేశంలో నిరుద్యోగం పెరగడంతో విద్యావంతులైన యువత రవాణా రంగం వైపు ఆసక్తి చూపుతున్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాల(బీఎన్‌ఎస్) వల్ల వారు వెనకడుగు వేస్తున్నారు. డ్రైవర్లను నేరస్థులుగా చూస్తూ.. భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తుండటంతో వృత్తిని వదిలేస్తున్నారు. ఫలితంగా లక్షలాది గూడ్స్ వాహనాలు నిరుపయోగంగా మారుతున్నాయి. కొత్త టెక్నాలజీ వాహనాలను నడిపే నైపుణ్యం లేక ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రతి జిల్లాలో డ్రైవర్లకు ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటుతోపాటు వారికి జాతీయ స్థాయి గుర్తింపు కార్డులు అందించాలి. రవాణా, కార్మిక శాఖల్లో పేర్లు నమోదు చేసి సామాజిక భద్రత, ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి.
నమక్కల్, సిరిసిల్ల తరహాలో డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేయాలి
మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్
తమిళనాడు నమక్కల్, సిరిసిల్ల తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లో డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేయాలి. యువతకు వసతి, భోజనం, ప్రయాణ, డ్రైవింగ్, లైసెన్స్ ఖర్చు ప్రభుత్వం భరించడంతోపాటు గుర్తింపు పత్రం ఇవ్వాలి. డ్రైవర్లు, డ్రైవర్ కం ఓనర్స్‌కు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుతో పాటు సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి మండల, పట్టణ నగర కేంద్రాలలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి.



