హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహణ
హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ఫోకస్
50 దేశాల నుంచి హాజరుకానున్న 3 వేల మంది ప్రతినిధులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ సదస్సుగా ప్రత్యేక గుర్తింపు ఉన్న బయోఏషియా సదస్సు ఈనెల 17, 18 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగనుంది. ఆ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సంయుక్తంగా ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ కూడా హాజరుకానున్నారు. ”టెక్బయో అన్లీష్డ్: ఏఐ, ఆటోమేషన్ – బయాలజీ రివల్యూషన్” అనే థీమ్ మీద అది జరుగనున్నది. గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, ఆలోచనలకు రాష్ట్రాన్ని వేదిక చేసేందుకు హైదరాబాద్ లో ప్రజా ప్రభుత్వం ఏటా బయో ఏషియా సదస్సు నిర్వహిస్తోంది.
హెచ్ఐసీసీలో వరుసగా రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బయోటెక్నాలజీ ఔషధ రంగ సంస్థల అధిపతులు, సీఈఓలు, ప్రతినిధులు ఆరోగ్య రంగ నిపుణులు 50 దేశాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. వారు పలు ఆవిష్కరణలు, చర్చలు, సమావేశాల్లో పాలుపంచుకుంటారు. అమ్జెన్, సానోఫీ, ఎలీ లిల్లీ, మిల్టెనీ బయోటెక్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో కీలక ప్రసంగం చేయనున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన క్యాన్సర్ జీన్ థెరపీ నిపుణులు ప్రొఫెసర్ బ్రూస్ ఎల్. లెవిన్, అమ్జెన్ సంస్థ సీఎస్‌వో డా. హోవర్డ్ వై. చాంగ్, జర్మనీకి చెందిన మిల్టెనీ బయోటెక్ వ్యవస్థాపకులు డా. స్టెఫాన్ మిల్టెనీ, సానోఫీ సంస్థ ఈవీపీ మాడలీన్ రోచ్ వంటి ప్రముఖులు మాట్లాడనున్నారు.
ప్రతినిధులంతా హెల్త్ కేర్ రంగంలో ఏఐతో వచ్చిన మార్పులు, లైఫ్ సైన్సెస్ భవిష్యత్తును నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడం, ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ తదితర అంశాలను ఎజెండాగా ప్రతినిధులు చర్చించనున్నారు. బయో రంగంలో కొత్త ఆవిష్కరణలు, దేశ విదేశాల సహకారాలు, హెల్త్ కేర్ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ సదస్సు ప్రధానంగా తెలంగాణకు ఉపయోగపడనుంది. ఇప్పటికే ప్రపంచస్థాయిలో హెల్త్ కేర్ హబ్, ఇన్నోవేషన్ హబ్ గా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం విదితమే. వైద్య పరిశోధనలు, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఎక్సలెన్స్‌లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ నేపథ్యంలో బయో ఏషియా 2026 సదస్సు లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో మరో మైలురాయిగా నిలువనుంది. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా తెలంగాణ అందరి దష్టిని ఆకర్షించనుంది. భారత ప్రభుత్వ ప్రధాన సలహాదారు(సైన్స్) ప్రొఫెసర్ అజరు కుమార్ సూద్, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ ఈ బయో ఆసియాలో ప్రసంగించనున్నారు. ”ఫార్మా – బయోటెక్ భవిష్యత్తు” అంశంపై ఒక ప్రత్యేక సీఈఓ కాన్క్లేవ్ నిర్వహించనుండగా, అందులో డాక్టర్ రెడ్డీస్, జైడస్, బయోకాన్, సిప్లా వంటి భారతీయ ప్రముఖ సంస్థల సీఈఓలు పాల్గొననున్నారు.
నోవార్టిస్, రోష్, నోవో నార్డిస్క్, మెడ్‌ట్రానిక్, మెర్క్, అస్ట్రాజెనెకా వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ప్యానల్ చర్చలు జరుగుతాయి. ఇస్రో మాజీ చైర్మెన్ ఎస్.సోమనాథ్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ చైర్మెన్ సతీష్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎమ్డీ డాక్టర్ కృష్ణ ఎల్లా, లారస్ ల్యాబ్స్ సీఈవో డాక్టర్ సత్యనారాయణ చావా, నోవార్టిస్ ఏషియా పసిఫిక్ రీజియన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీజర్ కాన్సెప్షన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెల్ టక్కర్ కాంక్లేవ్ లో తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఆమ్జెన్ చైర్మెన్, సీఈవో రాబర్ట్ ఎ. బ్రాడ్వే, జీనోమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాట్రిక్ టాన్, మెడ్ ట్రానిక్ సీటీవో డాక్టర్ కెన్ వాషింగ్టన్ మిల్టెనీ, బయోటెక్ ఎండీ డాక్టర్ బోరిస్ స్టోఫెల్, తదితర ప్రముఖులు సదస్సులో జరిగే చర్చల్లో పాల్గొననున్నారు.



