Saturday, February 7, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపట్టాలు తప్పిన బడ్జెట్‌ బండి

పట్టాలు తప్పిన బడ్జెట్‌ బండి

- Advertisement -

ఈసారి బడ్జెట్‌ తన ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌’ వేగాన్ని మరింత పెంచనున్నదని ప్రధాని మోడీ ప్రశంసించారు. కానీ మీడియా కేసీఆర్‌ మీద ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణకు ఇచ్చిన ప్రాధాన్యత బడ్జెట్‌కు ఇవ్వలేదు. బడ్జెట్‌ ప్రసంగంలో కూడా పద్దుల ప్రస్తావన లేదు. లోతుల్లోకి పోతే తప్ప అవి దొరకవు. పారదర్శకత గురించి పెద్ద మాటలు చెప్పే బీజేపీ ప్రభుత్వం, మీడియా చర్చల నుంచి తప్పించుకునేందుకు ఎందుకిన్ని జాగ్రత్తలు తీసుకున్నది? పైగా గత వంద సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత ఆర్థిక అసమానతలు ఇప్పుడు పెరిగాయి. సంక్షేమం కోసం చేసిన గత బడ్జెట్‌ కేటాయింపులకు సవరించిన బడ్జెట్‌లో కోతలు పెట్టారు. ఇంతకంటే మోసం ఏముంటుంది? పట్టణ గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సాంఘిక, మహిళల సంక్షేమం, గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా, పారిశుధ్యానికి చేసిన కేటాయింపులు తగ్గించారు.

యూనియన్‌ ప్రభుత్వం రాష్ట్రాలకు బదలాయించవలసిన నిధులలో రూ.2,03,802 కోట్లు చెల్లించలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజోపయోగ చర్యలకు ఖర్చుపెట్టే పరిస్థితి లేకుండా చేసింది. మొత్తమ్మీద భారాలు ప్రజల మీద తోసేసింది. ఫలాలు మాత్రం కార్పొరేట్‌ సంస్థలకు పంచింది. పెట్టుబడిదారుల కన్నా ఉద్యోగులు చెల్లించిన పన్నులు ఎక్కువ. ధరలు, ఉపాధి సమస్యలు పెరిగాయి. ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయి. ప్రజల కొనుగోలుశక్తి పడిపోయిందనీ, సరుకుల అమ్మకాలు మందగించాయనీ, కొనుగోలు శక్తి పెంచాలన్న గత ఆర్థిక సర్వే సూచనలు పెడచెవిన పెట్టిన ఫలితం. ఇది సరుకుల అమ్మకాలు మరింతగా తగ్గిపోయిన ఫలితంగా ప్రభుత్వం ఆశించిన ఆదాయానికి గండిపడ్డది. బడాబాబుల సంపద మాత్రం పెరిగింది. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినందువల్ల వీరికిచ్చిన రాయితీలేవీ ఆగ లేదు. కానీ, సాధారణ ప్రజలకోసం చేసిన కేటాయింపులను కోత పెట్టారు.

ఈ నెల ఒకటో తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఇవేవీ పరిగణనలోకి తీసుకోలేదు. ఎరువులు, ఆహార సబ్సిడీలకు కోత పెట్టారు. మహిళల అభివృద్ధికి తోడ్పడే రంగాల కేటాయింపులు గానీ, ధరల తగ్గింపుకు తోడ్పడే పెట్రోలియం రంగానికి కేటాయింపులు తగ్గించారు. సిటీ ఎకానమిక్‌ రీజియన్స్‌ పేరుతో పెద్దపెద్ద మాటలు చెప్పి పట్టణాభివృద్ధికి మాత్రం కేటాయింపులు తుస్సుమనిపించారు. గృహనిర్మాణం, పౌష్టికాహారం, తాగునీరు, ఉపాధి హామీ, ఆహార సరఫరా, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, సంక్షేమం వంటి పద్దులను ధరల పెరుగుదలకు అనుగుణంగా పెంచలేదు. అంటే ఆచరణలో నిజమైన కేటాయింపులు తగ్గిపోవడమే. పదహారవ ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా రాష్ట్రాలకు కేటాయించాల్సిన నిధులకు కోత పెట్టింది. పన్ను ఆదాయం 41శాతం రాష్ట్రాలకు బదలాయింపు కూడా నిజంకాదు. సెస్‌, సర్‌చార్జీలు తదితర ఆదాయం కలిపితే రాష్ట్రాలకు బదలాయిస్తున్నది 34 శాతానికి మించదు. ఉపాధి హామీ నిధుల ఖర్చులో రాష్ట్రాల మీద నలభై శాతం భారం మోపింది. రాష్ట్రాల వనరులను యూనియన్‌ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయిస్తూ కోఆపరేటీవ్‌ ఫెడరలిజం గురించి మాటలు చెబుతున్నది.

మొత్తం మీద ఈ బడ్జెట్‌లో ప్రజల మీద గత సంవత్సరం కన్నా సుమారు రూ.మూడు లక్షల కోట్లు అదనపు భారం మోపింది. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ యధాతథంగా కొనసాగిస్తున్నది. బడ్జెట్‌ సారాంశం మరింత ప్రమాదకరం. సంఘటిత రంగం, రెగ్యులర్‌ ఉద్యోగాల నుండి భద్రత లేని నాన్‌ పర్మినెంట్‌, గిగ్‌ వర్కర్స్‌ వైపు నెట్టుతున్నది. వారి సంక్షేమం మాత్రం విస్మరించింది. స్థూలంగా ఇది ప్రజల సమస్యలు, ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులను పరిష్కరించే బడ్జెట్‌ కాదు. బడాబాబుల బొజ్జలు నింపే బడ్జెట్‌. గత సంవత్సరమే కాదు, ఈ బడ్జెట్‌లో కూడా కార్పొరేట్‌ సంస్థల కోసం సుమారు ఏడు లక్షల కోట్లు ధారాదత్తం చేస్తున్నారు. అందుకే మీడియాలో చర్చనుండి తప్పించే ఎత్తుగడలు వేసింది. కార్పొరేట్‌ మీడియాకు కూడా కేసీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ సమస్య ‘కోతికి కొబ్బరి చిప్ప’ దొరికినట్టు దొరికింది.

బడ్జెట్‌ ప్రసంగంలో స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల సేవలో తరించే ప్రతిపాదనలతోనే పేజీలు నింపారు. పన్నెండేండ్ల మోడీ పాలన స్థిరత్వం, ఆర్థిక క్రమశిక్షణ, నిరంతర అభివృద్ధి, మితమైన ద్రవ్యోల్బణంతో తమదంటూ ముద్రవేసిందన్నారు. ధరల వాతలు భరిస్తున్న జనం ‘మితమైన ద్రవ్యోల్బణం’ అంటే నవ్విపోతారన్న సోయి లేదు. అంబానీలు, అదానీల ఆస్తుల పెరుగుదలలో మాత్రమే నిరంతర అభివృద్ధి ఉన్నది కదా! ఆర్థిక క్రమశిక్షణ పేరుతో సాధారణ ప్రజల కోసం చేయవల్సిన ఖర్చులే కోతపెట్టారు. అంతిమంగా పేదరికమే పరిష్కారం చేయకుండా స్థిరంగా కొనసాగుతున్నది. 25కోట్ల మందిని పేదరికం నుండి బయట పడేశారట! మరోవైపు ప్రతినెలా ఎనభై కోట్ల మందికి నెలకు ఐదు కేజీల చొప్పున బియ్యం ఉచితంగా ఇస్తున్నామని వీరే చెప్పుకుంటున్నారు. ధనికులకు ఇస్తున్నారా? అబద్దాలు కూడా అతికేటట్టు చెప్పాలి కదా!

అంతర్జాతీయ మార్కెట్‌తో పెనవేసుకోవాలన్నారు. ఎగుమతులు పెరిగి, దీర్ఘకాలిక పెట్టుబడులు ఆకర్షించాలన్నారు. ఉత్పాదకత పెంచటం ద్వారా ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెంచాలన్నారు. పాలకులు తలకిందులుగా ఆలోచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ తీవ్ర ఒడిదుడుకులతో సతమతమౌతున్న సమయం. అమెరికా ఉత్పత్తులను మనదేశంలో డంప్‌ చేయాలని ట్రంప్‌ ఒత్తిడులు చూస్తూనే ఉన్నాం. ఎగుమతులకు అవకాశాలు పరిమితమేనని ఆర్థిక సర్వే గతంలోనే హెచ్చరించింది. అయినా, ఎగుమతుల గురించి చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం! పైగా చవకగా ఉత్పత్తి అంటున్నారు. యంత్రాలు, ముడి సరుకుల ఖర్చు తప్పదు. వేతనాలు పెంచమని అడగవద్దని చెప్పకనే చెబుతున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ఉపాధి అవకాశాలు తగ్గటం, వేతనాల పెంపులేకపోవటంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది.

దేశంలో అమ్మకాలు మరింత తగ్గుతాయి. నిల్వలు పెరిగి పరిశ్రమల మూతకు దారితీస్తాయి. ఏమాత్రం ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవారైనా సరుకుల డిమాండ్‌ పెంచే చర్యలు బడ్జెట్‌లో ప్రతిపాదించాలని చెబుతారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచకుండా, సరుకుల సప్లయ్ పెంచే మార్గం ఈ బడ్జెట్‌ ప్రతిపాదిస్తున్నది. డిమాండ్‌ పెరగకుండా పెట్టుబడిదారులకు ఇచ్చే రాయితీలు, వారు సంపద రూపంలో దాచుకోవడానికే ఉపయోగపడతాయి. అసలు విషయం ఆర్థిక మంత్రి స్పష్టంగానే చెప్పారు. ప్రధాని మోడీ ‘ఉచితాలను’ నమ్ముకోలేదు. అంటే ప్రజల సంక్షేమ చర్యలు ఆయన ప్రభుత్వానికి గిట్టవు. ఊగిసలాటకు తావులేకుండా బరితెగించి సరళీకృత విధానాలు అమలు చేస్తామన్న సంకేతాలిచ్చారు. సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పి ప్రజల మీద నుంచే పోతుందన్నమాట. ఉపాధి అవకాశాలు పెంచేది తయారీ రంగం. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’తో తయారీ రంగం బేస్‌ రెట్టింపు చేయబోతున్నామని ప్రధాని మోడీ 2014లో చెప్పారు. కానీ ఆనాడు తయారీ రంగం ద్వారా జీడీపీకి తోడైన స్థూల విలువ పదిహేడు శాతం ఉండగా, ఇప్పుడది పదమూడు శాతానికి పడిపోయింది.

నిరుద్యోగ సమస్యకు కనుచూపు మేరలో పరిష్కారం లేదు. జీడీపీతో పోల్చితే అప్పుల మొత్తం తగ్గిస్తామని చెప్పారు. ద్రవ్యలోటు 4.4 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గిస్తామన్నారు. అంటే సంక్షేమం కోసం కేటాయింపులు కోత పడి, బడాబాబుల రాయితీలు మాత్రం కొనసాగిస్తారన్నది గత అనుభవం. కార్పొరేట్‌ సంస్థలకు మాత్రం వరాల జల్లు. ఇన్సెంటివ్లు, దిగుమతి సుంకాల తగ్గింపు, కొన్ని సంవత్సరాల పాటు పన్ను రాయితీలు (ట్యాక్స్‌ హాలిడే) గుప్పించారు. మౌలిక వసతుల నిర్మాణంలో ఉన్న ప్రయివేటు సంస్థల విశ్వాసం పెంచే చర్యలు తీసుకుంటారట. చిన్న, మధ్యతరహా, సూక్ష్మ పరిశ్రమలు నిలదొక్కుకునే చర్యలు కాదు… అవి దివాళా తీస్తే ప్రభుత్వరంగ సంస్థలకు అంటగట్టే చర్యలు ప్రతిపాదించారు. సులభతర వ్యాపారం కోసం విదేశీ మదుపుదారులకు అనుకూలంగా విదేశీ మారకద్రవ్య నిబంధనలు సవరిస్తారు. సమాచాం, సాంకేతిక రంగాలలో (క్లౌడ్‌ సర్వీసులు) విదేశీ సంస్థలకు ట్యాక్స్‌ హాలిడే ఇస్తారు. కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎంఎటి) పదిహేను శాతం నుంచి పద్నాలుగు శాతానికి తగ్గించారు.

ఎగుమతుల కోసం అన్న పేరుచెప్పి ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌లలోని కంపెనీలు తమ సరుకులను తక్కువ ధరకు భారతదేశంలోనే అమ్ముకునే అవకాశం ఇస్తామన్నారు. ఇక మధ్యతరహా, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు బతుకగలవా? ‘నమ్మకం’ ప్రాతిపదికగా ఎగుమతి, దిగుమతుల విధానం రూపొందిస్తారు. సరుకుల తనిఖీలు పరిమితం చేస్తారట! ఇక నాణ్యతా ప్రమాణాలకు దిక్కుండదు. అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ ఉండదు. అక్రమాలకు పాల్పడిన యజమానుల మీద జరిమానాలు, శిక్షలు తగ్గిస్తామన్నారు. కార్మిక వర్గ నిరసన చర్యలను మాత్రం నేరాల జాబితాలో చేర్చారు. బ్యాంకింగ్‌ రంగంలో కృత్రిమ మేధస్సు ప్రభావం వల్ల ఎలాంటి ఉద్యోగులు అవసరమవుతారో, నైపుణ్యం పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు ప్రతిపాదించేందుకు కమిటీ వేస్తారు. అంతే తప్ప ఉద్యోగ భద్రత మీద ప్రభావం పరిశీలించి పరిష్కారం చూపేందుకు కాదు. ఐదు విశ్వవిద్యాలయాల టౌన్‌ షిప్‌లు ‘కార్పొరేట్‌ మిత్రుల’ను తయారు చేయడానికి స్థాపిస్తామంటున్నారు.

నిపుణులను తయారు చేయడానికి కాదు! వ్యవసాయాభివృద్ధి అంటే ‘హై వాల్యూ అగ్రికల్చర్‌’ అని తేల్చారు. ఇప్పుడున్న రైతులకు మద్దతు ధర, వ్యవసాయ కార్మికుల బతుకు దెరువుల ప్రస్తావన లేదు. చేపలు, పశుపోషణ, డ్రైఫ్రూట్స్‌, ఎర్ర చందనం లాంటి పంటల కోసం కంపెనీలు పెడితే ప్రోత్సహిస్తామన్నారు. వ్యవసాయ రంగంలో కూడా పెట్టుబడిదారులకే ప్రోత్సాహం! ఇప్పటికే పేదలు ఎక్కే 500 పాసింజర్‌ రైళ్లను రద్దు చేసిన ప్రభుత్వం, ఈ బడ్జెట్‌లో హైస్పీడ్‌ రైళ్లను ప్రతిపాదించింది. సమస్యల పరిష్కారానికి తగిన మార్గం లేక కాదు, బడా పారిశ్రామికవేత్తల నుంచి ఆదాయం పన్ను పెంచడం, సంపద పన్ను, వారసత్వపు పన్ను వేయడం ద్వారా వనరుల సేకరణకు పాలకులు సిద్ధంగా లేరు.

సమస్యలతో సతమతమయ్యే ప్రజలు పరిష్కారాల కోసం యజమానులను, పాలకులను ప్రశ్నించవద్దని పాలకుల భావన. ఇందుకోసం ఇప్పటికే కార్మిక చట్టాలు రద్దుచేసి, లేబర్‌ కోడ్స్‌ రూపొందించామని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. సిటీ ఎకనామిక్‌ ఏరియా పథకంలో గుడులు, గోపురాలు ఉన్న పట్టణాలు చేర్చారు. బాధలు తట్టుకోలేని జనానికి దేవుడే దిక్కు అంటున్నారు. ‘శ్రమశక్తి నీతి-2025’లో ప్రభుత్వ విధానాలకు కౌటిల్యుని అర్థశాస్త్రం కూడా స్పూర్తినిచ్చిందన్నారు. బతుకుతెరువు కోసం బానిసలుగా పని చేయొచ్చని కౌటిల్యుడు సెలవిచ్చారు. ఇప్పుడు దేవుని మీద భారం వేసి బానిసలుగా బతుకుతారా? లేక పాలకుల మెడలు వంచేందుకు పోరుబాట ఎంచుకుంటారా? ప్రజలే తేెల్చుకోవాల్సిన సమయం.

ఎస్‌.వీరయ్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -