Saturday, February 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంస్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో రైతులకు తీవ్ర నష్టం

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో రైతులకు తీవ్ర నష్టం

- Advertisement -

బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ గ్రామాల్లో ప్రచారం చేస్తాం
12న జరిగే దేశవ్యాప్త సమ్మెను రైతులు జయప్రదం చేయాలి : పోస్టర్‌ ఆవిష్కరణలో ఎస్‌కేఎం రాష్ట్ర కన్వీనర్లు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలతో మన దేశ రైతులు తీవ్రంగా నష్టపోతారనీ, దీని వెనుక వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ చేసే కుట్ర దాగి ఉందని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) కన్వీనర్లు టి.సాగర్‌, పశ్యపద్మ, వి.ప్రభాకర్‌, మండల వెంకన్న, జక్కుల వెంకటయ్య, ఆర్‌.వెంకట్రాములు, బి.రాము, నాగిరెడ్డి, కాంతయ్య తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఏకపక్షంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల దేశ, రాష్ట్ర రైతులకు జరుగబోయే నష్టాన్ని రైతాం గానికి తెలియజేసేందుకు ఫిబ్రవరి 11 వరకు గ్రామ గ్రామాన ప్రచారం చేస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) తెలిపారు.

ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మె సందర్భంగా మండల, జిల్లా కేంద్రాల్లో కార్మికులతోపాటు ప్రదర్శనలు, సభలు, రాస్తారోకోల్లో పాల్గొనాలని రైతులకు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యాలయంలోని రాజ్‌ బహదూర్‌ గౌడ్‌ హాల్‌లో దేశవ్యాప్త సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే అమెరికా నుంచి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్‌ తదితర పంటలు, పాలు, పాల పదార్థాలు దిగుమతి సుంకాలు లేకుండా పెద్ద ఎత్తున మన దేశంలోకి దిగుమతి అవుతాయని తెలిపారు. అమెరికాలో వ్యవసాయ రంగానికి అక్కడి ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తుండగా.. మనదేశంలో వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం మూడు శాతమే ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. మన దేశ వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులతో పోల్చితే అమెరికా వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు చాలా చౌక అనీ, దీంతో ఆ దేశ ఉత్పత్తులు మనదేశంలోకి విచ్చలవిడిగా వస్తాయని తెలిపారు.

దీనివల్ల మన రైతులు పండించిన పంటలు అమ్ముకునే దారి లేక దివాళా తీస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. 65శాతం జనాభా ఆధారపడి ఉన్న మన వ్యవసాయ రంగం చతికిలబడే ప్రమాదముందన్నారు. తొమ్మిది కోట్ల మంది పాడి రైతులు దివాళా తీస్తారని చెప్పారు. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల పైన 18 శాతం పన్నులను ఆ దేశం విధిస్తున్నదనీ, మన దేశం మాత్రం సుంకాలు ఎత్తివేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. దీనివల్ల మన ఎగుమతులు నిలిచిపోతాయనీ, విదేశాల నుంచి దిగుమతులు విచ్చలవిడిగా వస్తాయని తెలిపారు.
ఢిల్లీ ఉద్యమం సందర్భంగా రైతు సంఘాలకు ఇచ్చిన హామీలు అమలు పరచకుండా మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని మరోసారి మోసం చేస్తున్నదని విమర్శించారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధరల అమలు చట్టం గురించి మాట్లాడటం మానేసిందన్నారు. ఎరువుల మీద సబ్సిడీలు తగ్గించి ధరలను పెంచుతున్నదని విమర్శించారు. నూతన విత్తన చట్టంతో రైతులు విత్తనంపై హక్కును కోల్పోతారని హెచ్చరించారు.

విద్యుత్‌ చట్టం 2025 ద్వారా స్మార్ట్‌ మీటర్లు అమల్లోకి వస్తాయనీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఉండదని చెప్పారు. దీంతో మోటార్లతో సాగించే వ్యవసాయం భారమవుతుందన్నారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం -2005ను రద్దుచేసి, పేదలకు ఉపాధి లేకుండా చేసే 2025 వీబీజీఆర్‌ఏఎమ్‌జీ ని తీసుకొచ్చిందని విమర్శించారు. కేంద్రం 90 శాతం నిధులను 60 శాతానికి తగ్గించిన విషయాన్ని పక్కనబెట్టి మోసపూరితంగా 125 రోజుల పని దినాల గురించి ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. నిధులు తగ్గిపోతే పని దినాలు ఎలా పెరుగుతాయని ప్రశ్నించారు. ఈ విధానాలకు నిరసనగా గ్రామ గ్రామాన నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దిష్టిబొమ్మలు దహనం చేయాలని, ఫిబ్రవరి 12న లేబర్‌ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ కార్మిక వర్గం నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మూడ్‌ శోభన్‌, డిజి ప్రసాద్‌, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -