నవతెలంగాణ – మల్హర్ రావు
నిన్న, మొన్నటి వరకు మార్కెట్ లో కిలో రూ.40 నుంచి రూ.60 వరకు పలికిన టమాటా ధర, ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలి ధర పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా కేవలం రూ.5 నుంచి రూ.10కే పరిమితం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో పండించిన పంటను రోడ్ల పక్కన పారబోయడమో లేదా పొలాల్లోనే వదిలేయడమో చేస్తున్నారు. ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించకపోవడం, కోల్డ్ స్టోరేజ్ సదుపాయం లేకపోవడమే ఈ విపత్తుకు ప్రధాన కారణం.
దళారీల వ్యవస్థ రైతుల నడ్డీ విరుస్తోంది. పండించిన పంటను మార్కెటక్కు తీసుకెళ్తే, అక్కడ వ్యాపారులు సిండికేట్గా మారి ధరను తగ్గించేస్తున్నారు. 25కిలోల బాక్స్ ధర రూ.100 కంటే తక్కువ పలుకుతుండటం రైతుల పాలిట శాపంగా మారింది. టమాటా సాగు అనేది ఒక జూదంలా మారింది. ఎకరాకు అయ్యే ఖర్చులకు, మార్కెట్లో లభిస్తున్న ధరకు పొంతన లేకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతు విత్తనం వేసిన నాటి నుంచి పంట చేతికి వచ్చే వరకు చేసే ఖర్చులు ఇలా ఉన్నాయి. మేలు రకం హైబ్రిడ్ విత్తనాలు, నారు పెంపకం కోసం సుమారు రూ.15 వేలు, కలుపు నివారణకు మల్చింగ్ షీట్లు, నీటి కోసం డ్రిప్ పైపుల ఏర్పా టుకు రూ.20 వేలు, టమాటాకు తెగుళ్ల బెడద ఎక్కువ. రక్షణ కోసం వాడే మందులకు రూ.20 వేలు, నాట్లు వేయడం నుంచి కోత వరకు సుమారు రూ.10వేలు, సగటున ఎకరాకు రూ.65 వేలకు పైగా వస్తుంది.
ప్రస్తుతం ఉన్న ధరను చూస్తే పెట్టుబడి రావడం కష్టంగా ఉందని రైతులు వాపోతున్నారు. చాలామంది రైతులు విత్తనాలు, మందులను డీలర్ల వద్ద అప్పుగా తెచ్చుకుంటారు. పంట అయిపోయాక డబ్బులిస్తామని మాట ఇస్తారు. ఇప్పుడు ధరలు లేకపో వడంతో తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరుగుతు న్నాయి. ఖరీఫ్ సాగుకు పెట్టుబడి లేక దిక్కుతోచని స్థితి ఉంటుందని ఆవేదన వ్యక్త చేస్తున్నారు.
దళారీల మాయాజాలం..
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపో యినా.. వినియోగదారుడు మాత్రం మార్కెట్లో కిలో రూ.10 నుండి పైగా కొనాల్సి వస్తోంది. మధ్యలో ఉన్న దళారీలు లాభపడుతుంటే, అటు వినియోగదారుడు, ఇటు రైతు ఇద్దరూ నష్టపో తున్నారు.



