Sunday, February 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఎవరిక్కావాలి?

ఎవరిక్కావాలి?

- Advertisement -

ఎవరిక్కావాలి? అన్న ప్రశ్న వెనుకనే ఎందుక్కావాలి అన్న నిజం కూడా దాక్కొని ఉంటుంది. అది కొందరికి కనబడుతుంది ఇంకొంతమందికి కనబడదు. మరికొందరికి కనబడినా చూసిచూడనట్టు నటిస్తారు. నటన జీవితంలో ఒక భాగం మరి. ఇక చేదు విషయాలెప్పుడూ దూరంగా పెట్టే స్వభావం మనిషిది. కొత్త సంవత్సరం, సంక్రాంతి చలేగయా, ఉగాది ఆనేవాలీహై. ఉగాదికి పచ్చడి చేస్తారు. జీవితంలో తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు ఇలా అన్ని రుచులూ ఉంటాయందులో. మనం చదివేవాటిలో, వినేవాటిలో కూడా ఈ రుచులన్నీ కనిపిస్తుంటాయి. ఒకరు తీయగా చెబితే ఇంకొకరు కారంగా చెబుతారు, మరొకరు చేదుగా. ఐతే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒకేమాట ఒక్కొక్కరికీ ఒక్కోవిధంగా కనిపిస్తుంది, నినిపిస్తుంది. తినే నాలుకనుబట్టి, వినే చెవినిబట్టి. అసలు దీనెనకాల ఉండే మెదడుననాలి, దాన్ని పెంచుకున్న మనిషిని, దాన్ని రకరకాల బేధభావాలతో నింపే మనుషుల్ని అనాలి. ఎవరు బాధపడినా, సంతోషించినా ఇది మాత్రం నిజం.

నీవుండే ఊరు, జిల్లా, దేశం, మొత్తంగా నీవుండే ప్రపంచం రోజురోజుకూ వేడెక్కుతోందని తెలుసా? ఎందుకు తెలీదు భేషుగ్గా తెలుసు అన్నది సమాధానం. ఇక్కడే ఎవరిక్కావాలి అన్న ప్రశ్న వస్తుంది. నాకేంటి అన్న సాధారణ మానవుల సమాధానమూ వస్తుంది. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా ఇదే కథ ప్రతిరోజూ, ప్రతి వారం, నెలా, సంవత్సరం, అంతెందుకు జీవితం మొత్తం ఇలాగే ఉంటుంది. నెహ్రూజీ చెప్పినట్టు ఈ సభలో సగం మంది తెలివైనోళ్లు అంటే సరి! ఎవ్వరూ మీదికి రారు. ఐతే గాంధి, నెహ్రూ పేర్లను వాడితే ఇప్పుడు చాలామందికి కోపమొస్తుంది. అసలు గాంధి సినిమా వచ్చేవరకూ గాంధీ అంటే ఎవరో ప్రపంచానికి తెలీదు అన్న పెద్దమనుషులున్నారిప్పుడు. బెన్‌ కింగ్స్‌లే గాంధీ వేషధారి. 1982లో తీసిన ఈ సినిమాలో కథ 1893 నుండి మొదలవుతుంది. ఇప్పుడు చెప్పండి గాంధీ ప్రపంచానికి ఎప్పటినుండీ తెలుసో? ఇదంతా ఎవరిక్కావాలి చెప్పండి?

మిత్రుడు దామోదర్‌ మొన్న ఒక వ్యాసం రాసిండు. పురపాలక సంఘాల ఎన్నికలొస్తున్నాయి, మీ కొట్లాటలాపి ప్రజల గురించి పట్టించుకోండి అన్నది దాని సారాంశం. తనూ ఇదే విషయం చెప్పిండు. పట్టణ ప్రాంతాల్లో వాతావరణం మారిపోతోంది. ఎండలూ, వానలూ, చలి ఇవన్నీ ఇంతకు ముందులేని విధంగా ఉన్నాయి. ఎప్పుడు ఏదొస్తుందో తెలియని పరిస్థితి. ఇదంతా ఎవరిక్కావాలి? అలాగే ట్రంపులవారిపై మరో మిత్రుడు శ్రీనివాస్‌ ఇంకో పత్రికలో వ్యాసం రాసిండు. తనే కాదు చాలా పత్రికల్లో చాలా వ్యాసాలొచ్చినాయి అమెరికా పెత్తనంపై. మరి పెద్దోళ్లు నోరెత్తుతున్నారా? ఇదంతా ఎవరిక్కావాలి? ఫలానా హీరోయిన్‌కు పెళ్లి కుదిరిందంట, మీకోసం లేటెస్ట్‌ ఫొటో అనో, హీరో విడాకులెందుకిచ్చాడు అనో, తండ్రి ఐన యువ హీరో అన్న వార్తలు ముఖ్యమైన వార్తలుగా చలామణి అవుతున్నాయి. యువ హీరో కాక వృద్ధ హీరో తండ్రి కాడు కదా! అన్న విషయం వదిలేస్తే ఫ్యాన్సు సదరు సెలెబ్రిటీల ఇంటిదగ్గర సంబురాలు జరుపుకుంటారు.

తమ స్వంత ఇంట్లో వీళ్లు పనులు చేస్తారా లేదా అని కనుక్కుందాం. రైతుబజారుకుపోయి సబ్జీ తెచ్చిపెట్టమని అమ్మ బతిమాలినా ఏదో ఒకటి చేసేయమ్మా అని వదిలేసే రకం ఎందుకంటే హీరో ఇంటిదగ్గర మిత్రులతో కలిసి ఎంజాయ్ చేయడం ముఖ్యం కదా మరి! మహా కవీ, కొందమంది కుర్రవాళ్లు అంతే మరి! ఇప్పుడు కృత్రిమమేధ యుగం నడుస్తోంది. ముందే తిమ్మిని బమ్మిని చేయగల సమర్ధులు మానవులు. ఇక వాళ్లు కనిపెట్టిన ఈ కృ.మే వాళ్ల తెలివికి సంక్రాంతి ముగ్గులకు రంగులేసినట్టు మెరుగులు పెడుతోంది. డియర్‌ కృ.మే కార్మికులపై రుద్దుతున్న నల్లచట్టాల నిజస్వరూపం తెలుసు, అవి మంచివని, వాళ్లకు మేలు చేస్తాయని, ఇవి తయారుచేసింది పెట్టుబడిదారుల మంచికని తెలిసినా తెలియనట్టు నటించడానికి మంచి మంచి మాటలతో నాకు ఒక ప్రకటన రాసిపెట్టు అనడిగితే అది అలాగే ఇస్తుంది. ఎందుకంటే అడిగింది చేసిపెట్టడమే దానికి తెలుసు.

పనిలో పనిగా ఈనెల పన్నెండున చేస్తున్న దేశవ్యాప్త సమ్మె దండగని, కార్మికులను ఏకం చేస్తున్న వారిపై విషం చల్లేలా ఒక ప్రకటన తయారు చేసి ఇవ్వు. అలాగే కార్మికులందరూ ఒకవర్గమని తెలుసుకోకుండా మతాలు, కులాల పరంగా వాళ్లను విడదీసేలా మావాళ్లు నిత్యం పనిలోనే ఉంటారు దాన్ని ఇంకా మెరుగ్గా రాసివ్వు. ఇలా ఏదడిగితే అది చేసిపెట్టే కృ.మే ఉండగా ఇక మనిషి మెదడెందుకు చెప్పండి. ఇటువైపునున్న కార్మికులు, కార్మిక నాయకులకు ఈ కృ.మేతో పనేలేదు. నిజమైన మేధస్సు వారి సొంతం. వాళ్లు నిజాలు చెప్పేటోళ్లు . అందుకే వాళ్లు ఎవరిక్కావాలి అని ఏవిషయంలోనూ అనుకోరు. ప్రపంచాన్ని అనునిత్యం చూస్తూనే ఉంటారు. అందుకే ప్రశ్నిస్తుంటారు కూడా. ఏదైనా ప్రపంచానికి, సర్వ మానవాళికి పనికొచ్చేది నాక్కావాలి అనుకునేటోళ్లు వాళ్లు. మహా కవీ, వాళ్లు ముందుయుగం దూతలు మరి. అలాంటోళ్లనే ఎవరిక్కావాలి అని ఎవరైనా అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు…

జంధ్యాల రఘుబాబు
9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -