Sunday, February 8, 2026
E-PAPER
Homeహెల్త్చదువు పరుగులో ముందుకా... వెనుకకా?

చదువు పరుగులో ముందుకా… వెనుకకా?

- Advertisement -

పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల కాలం మొదలవగానే విద్యార్థుల జీవితంలో ఒకే మాట.. ‘ఇప్పుడే చదవాలి… ఇప్పుడే సక్సెస్‌ కావాలి’. ఈ తొందరే నేడు చదువును ఒక పరుగుపోటీగా మార్చేస్తోంది. కానీ చదువు నిజంగా పరుగు పందెమా? లేక జీవితాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయాణమా?

నేడు చాలామంది విద్యార్థులు చదువుతున్నది నేర్చుకోవాలనే ఆసక్తితో కాదు. వెనుకపడిపోతామేమో అన్న భయంతో. ఉదయం ట్యూషన్‌, మధ్యాహ్నం కాలేజీ, సాయంత్రం కోచింగ్‌, రాత్రి మొబైల్‌లో ‘టాపర్‌ స్టోరీలు’. ఇలా వారి రోజు అంతా ఒత్తిడితో నిండిపోతుంది. అర్థం కాకపోయినా చదివేశామని అనుకోవడం, నిద్ర తగ్గించి మార్కులు పెంచుకోవాలను కోవడం సాధారణమైపోయింది.
హైదరాబాద్‌కు చెందిన ఒక ఇంటర్‌ విద్యార్థి రోజుకు 14 గంటలు చదువేవాడు. కానీ పరీక్ష పేపర్‌లో ప్రశ్న చూసిన వెంటనే చేతులు వణికిపోయాయి. కారణం చదువు లేకపోవడం కాదు. భయం ఎక్కువ కావడం. చదువును ఆనందంగా నేర్చుకునే అవకాశం లేకుండా, అది శిక్షలా మారిపోయింది.
మరో విద్యార్థిని గణితం బాగా రాకపోయినా చిత్రలేఖనంలో అద్భుత ప్రతిభ చూపించింది. కానీ ‘ఆర్ట్‌తో ఏమవుతుంది?’ అన్న మాటలు వింటూ తన ఆసక్తిని పక్కన పెట్టి, బలవంతంగా సైన్స్‌ చదివింది. ఫలితం చదువులో ఆసక్తి కోల్పోవడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం. చదువు ఆమెను ముందుకు నడిపించాల్సిన చోట, వెనక్కి నెట్టింది.
ఇవి ఒక్కరిద్దరి కథలు కావు. నేటి విద్యార్థుల్లో చాలామంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చదువు పరుగులో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మనం ఆలోచించాల్సిన సమయం ఇది.
చదువు పరుగులో విద్యార్థి తనకే తనతో పోటీ పడాలి, ఇతరులతో కాదు. నిన్న కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా అర్థం చేసుకున్నానా అన్న ప్రశ్న ఉండాలి. గంటల లెక్క కాదు, నేర్చుకున్న విషయంపై నమ్మకం ఉండాలి. మధ్యలో ఆగి ఊపిరి పీల్చుకునే అవకాశం ఉండాలి. ఆటలు, కళలు, స్నేహాలు చదువుకు అడ్డంకులు కాదు. అవే మానసిక బలం. అదే సమయంలో చదువు పరుగు పందెంలో ర్యాంకుల పోలికలతో తన విలువను కొలవడం, నిద్ర త్యాగం చేసి శరీరాన్ని.. మనసును నీరసింపజేయడం, ఫెయిల్‌ అయితే జీవితం ముగిసినట్టుగా భావించడం. చదువు భయంతో సాగితే అది విద్య కాదు. ఒత్తిడి మాత్రమే.
చదువు లక్ష్యం ఉద్యోగం మాత్రమే కాదు. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, జీవితాన్ని సమతూకంగా చూసే దష్టి, తనకు నచ్చిన రంగంలో ఎదిగే ఆత్మవిశ్వాసం. ఇవన్నీ విద్య ద్వారా రావాలి. కానీ నేడు విద్యార్థులు ఈ విలువల్ని కాకుండా, మార్కులనే జీవితంగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పరీక్షలు విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసే ఒక దశ మాత్రమే. అవి జీవితానికి తుది తీర్పు కావు. ఎన్నో రంగాల్లో రాణించిన వ్యక్తుల జీవితాలను చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. వారు అందరూ ఒకే దారిలో పరుగెత్తలేదు. తమకు నచ్చిన దారిని ఎంచుకుని, నెమ్మదిగా అయినా స్థిరంగా ముందుకు నడిచారు.
అందుకే విద్యార్థులకు ఒక మాట చెప్పాలి. చదువు పరుగు అనుకుంటే ఊపిరాడదు. అదే చదువు ప్రయాణం అనుకుంటే దారిలో నేర్చుకోవచ్చు, మార్గం మార్చుకోవచ్చు, ముందుకు సాగొచ్చు. అలసిపోతే ఆగడం తప్పు కాదు. అర్థం కాకపోతే ప్రశ్నించడం బలహీనత కాదు. చదువు నిన్ను నడిపించాలి, నలిపెయకూడదు.
పరుగులో గెలవడం కన్నా, జీవితంలో నిలబడడం ముఖ్యమని గుర్తించాల్సిన సమయం ఇది.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -