అమెరికాపై భారత్ ఘన విజయం
సూర్యకుమార్ కెప్టెన్సీ ఇన్నింగ్స్
రాణించిన సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
డిఫెండింగ్ చాంపియన్ టీమ్ ఇండియా ఐసీసీ టీ20 ప్రపంచకప్ వేట మొదలెట్టింది. యుఎస్‌ఏపై 29 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. సూర్యకుమార్ యాదవ్ (84 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కగా తొలుత భారత్ 161/9 పరుగులు చేసింది. ఛేదనలో యుఎస్‌ఏ 132/8 పరుగులకే పరిమితమైంది.
నవతెలంగాణ-ముంబయి
బ్యాట్‌తో తడబడినా, బంతితో అదరగొట్టారు. 162 పరుగుల ఛేదనలో యుఎస్‌ఏను 132/8 పరుగులకే కట్టడి చేశారు. శనివారం వాంఖడె స్టేడియంలో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో యుఎస్‌ఏపై భారత్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అర్ష్‌దీప్ సింగ్ (2/18), మహ్మద్ సిరాజ్ (3/29), అక్షర్ పటేల్ (2/24) రాణించటంతో… మోనాక్ పటేల్ (34, 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), సంజయ్ కృష్ణమూర్తి (37, 31 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరిసినా అమెరికా చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పవర్‌ప్లేలో తడబాటుకు గురైంది. అభిషేక్ శర్మ (0), శివం దూబె (0), రింకు సింగ్ (6), హార్దిక్ పాండ్య (5), అక్షర్ పటేల్ (14) నిరాశపరిచారు. 77/6తో కష్టాల్లో కూరుకున్న భారత్‌ను సూర్యకుమార్ యాదవ్ (84 నాటౌట్, 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) రాణించారు. అజేయ అర్థ సెంచరీ బాదిన సూర్యకుమార్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
సిరాజ్, అర్ష్‌దీప్ అదుర్స్
బంతితో భారత్‌ను ఇరకాటంలో పడేసిన ఆనందం అమెరికా శిబిరంలో ఎంతోసేపు నిలువలేదు. పేసర్లు మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లు పవర్‌ప్లేలో కొత్త బంతితో నిప్పులు చెరిగారు. సిరాజ్ వరుస ఓవర్లలో ఓపెనర్లను సాగనంపగా.. నం.3 బ్యాటర్ కథ అర్ష్‌దీప్ ముగించాడు. అండ్రీస్ గౌస్ (6), సాయితేజ ముక్కమల్ల (2) సిరాజ్ ధాటికి వికెట్ కోల్పోయారు. కెప్టెన్ మోనాక్ పటేల్ (0)ను అర్ష్‌దీప్ డకౌట్ చేశాడు. దీంతో 13/3తో అమెరికా పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. పవర్‌ప్లేలో చెరో మూడు ఓవర్లు సంధించిన సిరాజ్, అర్ష్‌దీప్‌లు అమెరికాను వణికించారు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు అమెరికా బ్యాటర్లను కట్టడి చేశారు. అమెరికా బ్యాటర్లలో మిలింద్ కుమార్ (34), సంజయ్ కృష్ణమూర్తి (37) నాల్గో వికెట్‌కు 52 బంతుల్లో 58 పరుగులు జోడించారు. కానీ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ 8 ఓవర్లలో 48 పరుగులకు 3 వికెట్లు పడగొట్టారు. దీంతో అమెరికా 98/6తో ఓటమి కోరల్లో చిక్కుకుంది. 16 ఓవర్లలో 100/6తో నిలిచిన అమెరికా ఓటమి బాట పట్టింది. డెత్ ఓవర్లలో పేసర్లు సిరాజ్, అర్ష్‌దీప్, హార్దిక్ లాంఛనం ముగించారు.
సూర్య కెప్టెన్సీ ఇన్నింగ్స్
సూర్యకుమార్ యాదవ్ (84 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. బ్యాటింగ్ లైనప్‌లో అందరూ నిరాశపరిచినా సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. యుఎస్‌ఏ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న సూర్యకుమార్ ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. గత టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలోనూ అమెరికా బౌలర్లు మన బ్యాటింగ్ లైనప్‌ను ఇబ్బంది పెట్టగా.. అప్పుడూ సూర్యకుమార్ తనదైన షో చేశాడు. లోయర్ ఆర్డర్, టెయిలెండర్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసి భారత్‌కు మంచి స్కోరు అందించాడు. రింకు సింగ్‌తో కలిసి 34 బంతుల్లో 26 పరుగులు, అక్షర్ పటేల్‌తో కలిసి 24 బంతుల్లో 41 పరుగులు, అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి 14 బంతుల్లో 22 పరుగులు, వరుణ్ చక్రవర్తితో కలిసి 6 బంతుల్లో 21 పరుగులు జోడించాడు. 4 సిక్స్‌లు, 10 ఫోర్లతో మెరిసిన సూర్యకుమార్ యాదవ్ ఆఖరు వరకు క్రీజులో అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. టాస్ నెగ్గిన అమెరికా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. పవర్‌ప్లేలోనే భారత విధ్వంసక బ్యాటర్లు డగౌట్‌కు చేరుకున్నారు.
అభిషేక్ శర్మ (0), శివం దూబె (0), ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25)లు నిరాశపరిచారు. ఫలితంగా 6 ఓవర్లలో 46 పరుగులకే భారత్ 4 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ తొలి బంతికే వికెట్ కోల్పోవటంతో లయ తప్పిన ఇన్నింగ్స్.. మళ్లీ కోలుకోలేదు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో విఫలమయ్యారు. రింకు సింగ్ (6), హార్దిక్ పాండ్య (5), అక్షర్ పటేల్ (14) సైతం విఫలం కావటంతో 77/6తో టీమ్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అజేయ అర్థ సెంచరీతో భారత్‌ను ఆదుకున్నాడు. విలువైన భాగస్వామ్యాలు నిర్మించి భారత్‌కు మంచి స్కోరు అందించాడు. అమెరికా బౌలర్లలో శాడ్లీ (4/25) నాలుగు వికెట్లతో మెరువగా.. హర్మీత్ సింగ్ (2/26), అలీ ఖాన్ (1/13), మోషిన్ (1/16) రాణించారు. 46 బంతుల్లో 50.. 92 బంతుల్లో 100 పరుగుల మైలురాయి చేరుకున్న భారత్.. సూర్యకుమార్ ధనాధన్‌తో ఆఖరు ఓవర్లలో దండిగా పరుగులు పిండుకుంది. సూర్య దూకుడుతో చివరి రెండు ఓవర్లలోనే భారత్ 33 పరుగులు సాధించింది.
సంక్షిప్త స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : 161/9 (సూర్యకుమార్ యాదవ్ 84, తిలక్ వర్మ 25, శాడ్లీ 4/25, హర్మీత్ సింగ్ 2/26)
యుఎస్‌ఏ ఇన్నింగ్స్ : 132/8 (సంజయ్ 37, మిలింద్ 34, సిరాజ్ 3/29, అర్ష్‌దీప్ 2/18, అక్షర్ 2/24)



