రేడియో -ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనల సమాచారాన్ని తక్షణమే అందించే సాంకేతిక అద్భుతం. కాలక్రమానుగతంగా వస్తున్న పరిణామాలకు అనుగుణంగా తనని తాను మార్చుకుంటూ భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో మానవుడికి అనధికారిక హితుడిగా, సన్నిహితుడిగా నిలుస్తున్న అదృశ్య విజ్ఞానం.
రేడియో నిన్నటి తరానికి ఓ నోస్టాల్జియా.. నేటి తరానికి ఓ మేనియా.. రేపటి తరానికి ఉటోపియా.. మొత్తంగా రేడియో అంటే ఇప్పుడు అందరికీ ఓ ఎమోషన్… ప్రయాణంలో కార్లో, ఫోన్లో మనతో సహచరించే రిలేషన్…రేడియో ఇప్పుడు – ఓ పాజిటివ్ వైబ్రేషన్… ఓ పాపులర్ జనరేషన్.
”హింద్ దేశ్ కే నివాసీ సభీ జన్ ఏక్ హై, రంగ్ రూప్ వేశ్ భాషా చాహే అనేక్ హై…” ఈ పాట ఆకాశవాణి ద్వారా లక్షల సార్లు విన్నాం. ఈ సాహిత్యానికి రూపం ఇస్తే అది తప్పనిసరిగా రేడియోనే అవుతుంది. రంగు-రూపాలు వేరైనా, జాతి-మతాలు భిన్నమైనా, ఆచార-వ్యవహారాలు వైరుధ్యంగా ఉన్నా, ప్రాంతాలు-పండుగలు వేరువేరైనా అందరినీ చేరువ చేసే మూలమంత్రం భావసమగ్రత. మాతదేవత, మాతభాష, మాతదేశం – ఈ రుణాలు ఎప్పటికీ తీర్చుకోలేనివి అంటుంది భారతీయ జీవన విధానం. దేశ భావనా శుద్ధితో మన దేశం..మన ప్రజలు.. మన సంస్కతి..మన విలువలు ఇవన్నీ దేశభక్తి అనే దారానికి కట్టిన పూలే అంటుంది. వీటన్నింటినీ కలిపి కట్టిన కదంబ మాల ఆకాశవాణి కార్యక్రమాలు .

గొంతులో విశ్వాన్నంతటిని ముడుచుకొని, ఎదలోతుల్లోంచి ఉబికి వచ్చే స్పందనలతో మైకు ముందు మాటల విత్తనాలు చల్లుతుంది ఆకాశవాణి. ప్రతిరోజూ ఉషఃగీతమై..ప్రతి హదయాన్ని మాటలతో స్పర్శిస్తూ..ప్రాతఃకాల పరివర్తనకు ఆది నర్తనమవుతుంది. నది ఇంకుతుందేమో కానీ ఆకాశవాణి మాటల జీవనది మాత్రం ఇంకదు. పలుకుల ప్రవాహం నిరంతరం ఊరుతూనే ఉంటుంది. లలితమైన పాటకి మాటల మల్లెచెండును చుడుతూ.. శాస్త్రీయ గాత్ర-వాద్య సంగీతానికి వెన్నెల వెలుగుల్ని పంచుతూ..గళ పుష్పక విమానంపై మోసుకొచ్చి మన ముంగిళ్ళలో ముగ్గులుగా పరుస్తుంది. వేదనల గాయాలకు జానపద గీతాల లేపనాలు అద్దుతుంది. విషాదాల విలాపాల్లో ఘంటసాల పాటగా..పిల్లల నోట అన్నమయ్య పాటగా..పరావర్తనం చెందుతుంది. స్వరం మంత్రిస్తుంది, నియంత్రిస్తుంది, భావానికి ఆకతిని అందిస్తుంది అనుకుంటాం.. నిత్య చైతన్యాన్ని దేదీప్యమానం చేసేది ఆకాశవాణి మాత్రమే. సరిగమల దశ్యాదశ్యాల స్వర సురభి చేసేది ఆకాశవాణి మాత్రమే. వాయు తరంగాలను శబ్ద తరంగాలతో విలీనం చేసి కొత్త జీవితాన్ని పోసేది ఆకాశవాణి మాత్రమే. స్వరమే తన పరిచయంగా.. స్వరమే తన పరిమళంగా.. స్వరమే తన చిరునామాగా.. స్వరమే తన తొలిప్రేమగా.. ఆకాశవాణి గొంతులోని శబ్దమే సరస్వతీ స్తవంగా అందరినీ అలరిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తొలిసంధ్య సుప్రభాతం నుండి మలిసంధ్య శుభరాత్రి వరకూ మన ఇంట్లో సందడంతా తానే అవుతుంది.. సహస్ర గళార్చన చేస్తుంది.
రేడియో లక్షణమే నమ్మకం. నమ్మకమే దాని యునీక్ సెల్లింగ్ పాయింట్ గా చెప్తుంటారు పెద్దలు. కార్యక్రమాల రూపకల్పన వ్యూహాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజల ఆదరణతో ముందుకు సాగుతూ శత వసంతాలకు చేరువవుతోంది ఆకాశవాణి. సంగీత ఉత్సవాలు, ఆరాధన ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, క్రీడోత్సవాలు, ఎన్నికల ఫలితాల విశ్లేషణ, క్రికెట్ కామెంట్రీ, నాటకాలు, పార్లమెంట్-శాసన సభల సమావేశాలు, జానపద ప్రక్రియలు, ప్రత్యక్ష పరోక్ష వ్యాఖ్యానాలు, ఆరోగ్యం, వైవిధ్యం, విజ్ఞానం, భాషా సంక్షేమ ప్రచారాలతో అందరికీ చేరువైంది ఆకాశవాణి. భారతీయ సంస్కతికి సేవ, ప్రజా సంక్షేమం ఆకాశవాణి లక్ష్యం, ఉద్దేశం కూడా. ప్రసార భారతిలో భాగమైన ఆకాశవాణి ప్రజాసేవా ప్రసార మాధ్యమంగా విలువైన సేవలు అందిస్తుంది. ప్రజావాణిని సంక్షేమ వాణిగా చేరువ చేసింది. వాస్తవాధారిత సమాచారంతో అపోహల్ని పోగొడుతూ, స్థిరమైన, నిక్కచ్చితత్వ సమాచారాన్ని అందరికీ అందించడమే ఆకాశవాణి లక్ష్యంగా మనం చెప్పుకోవాలి.

రేడియో ప్రస్థానం :
Radio is the Medium of Mass Communication అంటారు. 1920లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ స్థాపించబడినా కూడా 1923 వరకూ బొంబాయి క్లబ్ పేరిట ప్రసారాలు మొదలైనప్పటికీ, 1927 జూలై 23 నాడే అధికారికంగా కార్యక్రమాలు మొదలైనట్టుగానే భావిస్తుంటాం. అందుకే అదే రోజున..అంటే జూలై 23న ‘నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే’ ని జరుపుకుంటుంటాం. నిజానికి బొంబాయి, కలకత్తా, మద్రాసుల్లో రేడియో క్లబ్బులు ఉన్నా హైదరాబాద్, ఔరంగాబాద్, మైసూర్, బరోడా, తిరువాన్కూర్ సంస్థానాల్లో ప్రైవేటు రేడియో క్షేత్రాల ద్వారా ప్రసారాలు జరిగినా..అన్నీ ఒకే గొడుగు కిందికి చేర్చబడ్డాయి..అది జరిగింది 1936 లో. అంటే ‘ఆల్ ఇండియా రేడియో’గా ప్రభుత్వ ప్రచార వ్యవస్థగా ప్రజావరణంలోకి వచ్చింది. కానీ 1950 నుంచి దేశంలోని అన్ని ప్రైవేట్ రేడియో కేంద్రాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. నిజానికి ‘ఆకాశవాణి’ అని నామకరణం జరిగింది మాత్రం 1958లోనే. అప్పటిదాకా ఆల్ ఇండియా రేడియో గానే పిలవబడింది. ఆకాశవాణి – అనే పదం రాళ్ళపల్లి గోపాలకష్ణమాచార్యులు గారి పుస్తకం నుంచి తీసుకున్నారు. వారు రేడియో కార్యక్రమాల గురించి రాస్తూ శబ్దం ఆకాశము నుండి చెవికి చేరుతుంది కాబట్టి ఆకాశవాణిగా రేడియోను ప్రస్తావించటం జరిగింది. ఇప్పుడు ప్రసార భారతిలో ఆకాశవాణి, దూరదర్శన్ లు చేరాయి. అంటే 1997 నవంబర్ 23న ప్రసార భారతి కార్పొరేషన్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్వతంత్ర ఉమ్మడి సంస్థగా ఇది మిగిలిపోయింది.
సైన్స్ ప్రకారం.. విద్యుత్ అయస్కాంత తరంగాలు ఎన్నెన్నో పౌనఃపున్యాల్లో ప్రసారమవుతూ రేడియో అనే పరికరాన్ని చేరి ధ్వని రూపంలో మనల్ని అలరిస్తున్నాయి. శబ్దం శరీరంలో భావ ప్రకంపనని కలిగిస్తుందన్నది అనాదిగా మనకు తెలిసిందే కదా. ఆకాశవాణి 23 భాషల్లో 179 మాండలికలతో తన ప్రసారాలను అందిస్తుంది. 7 షార్ట్ వేవ్, 122 మీడియం వేవ్, 626 ఎఫ్‌ఎం ట్రాన్స్మిటర్లతో మనకి చేరువ అయ్యింది. ఆల్ ఇండియా రేడియో ఇప్పటివరకూ 591 రేడియో స్టేషన్లు, 755 రేడియో ట్రాన్స్మిటర్ల తో నిరంతరం శ్రమిస్తోంది. ఖీవీ మోడ్ తో మన దేశంలో ఎందరో యువతను రేడియోవైపు ఆకర్షించింది. న్యూస్ ఆప్ లు 24/7 పనిచేస్తూనే ఉన్నాయి. ఆగేయ దేశాల్లోనూ, మిగతా మిత్ర దేశాలలో ఎన్నో కార్యక్రమాలు ఆకాశవాణి అందిస్తూనే ఉంది. 1936 జనవరి 19 న మొదటిసారిగా వార్తా ప్రసారం మొదలెట్టినప్పటి నుండి దేశ విదేశీ భాషల్లోనూ వార్తా ప్రసారాలు వినిపిస్తోంది. లాభాపేక్ష లేకుండా 1964లో మలేషియాలో ఏర్పాటైన ఏబిసి సంస్థలో మన దేశం శాశ్వత సభ్యురాలుగా ఉంది.

రేడియో దినోత్సవం :
1946 ఫిబ్రవరి 13న యునైటెడ్ నేషన్స్ సంస్థ స్వంత రేడియో కేంద్రాన్ని ప్రారంభించింది. 2011 నవంబర్ 3న ప్రపంచ రేడియో దినోత్సవం ఒకటి ఉండాలని భావించింది. మొదటిసారిగా 2012 ఫిబ్రవరి 13న ‘ప్రపంచ రేడియో దినోత్సవా’న్ని అధికారికంగా ప్రారంభించింది. రేడియో దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అని కొందరు ప్రశ్నించిన సందర్భం కూడా ఉంది. రేడియో మన బాధ్యత.. బలహీన, పీడితుల గొంతుక. నిజానికి రేడియో దినోత్సవం మరో మారు మనందరినీ పునరంకితం చేస్తుంది.. ప్రజా సేవలో. భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకునేలా చేస్తుంది. ఎన్నో కీలక సందర్భాలలో వివిధ దేశాల ప్రజలకు చేరువ చేసే సందేశాలకు వారధిగా, సారథి మారింది… మార్చింది రేడియో. హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం అవుతున్న సమయంలో నిజాం ప్రసంగించింది దక్కన్ రేడియోలోనే. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014 నుండి ప్రతినెల 4 ఆదివారం ప్రసంగిస్తున్న ‘మన్ కీ బాత్’ ఆకాశవాణి ద్వారానే. బడ్జెట్ ప్రసంగాలు, ఉభయ సభల రివ్యూలు, విదేశీ విశేషాలు, స్పాట్ లైట్, కరెంట్ అఫైర్స్ లతో ప్రత్యక్ష వ్యాఖ్యానాలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణాలు, ఎలక్షన్ల ఫలితాలు, నిర్ధారిత వాతావరణ వివరాలు, వరదలు, విపత్కర పరిస్థితుల్లో ప్రధాన భూమికగా నిలిచి ప్రజలకు అండగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది రేడియో. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నది.. రేడియో.
రేడియో ప్రసారాల ఆవశ్యకత :
రేడియోని కనిపెట్టిన మార్కోనీ కేవలం అది ఒక భావ ప్రకటనకి, సమాచార ప్రసారానికి ఉపయోగపడుతుందని ఆశించి ఉండొచ్చు. కానీ బహుముఖీన కార్యక్రమాలకి కేంద్ర బిందువుగా మారిపోయింది ఆకాశవాణి.
‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరి… ‘ఓం నమఃశివాయ’ అనే పంచాక్షరి..”రామ” అనే ద్వాక్షరి లతో విభేదించే వారు ఉంటారేమో కానీ ఆకాశవాణి అనే పంచాక్షరి జపం చేయని వారు మాత్రం బహు తక్కువ. దశావతారాల గురించి చెప్తారు కానీ ఆకాశవాణి అవతారాలు ఎన్నెన్నో! నిస్తంత్రి రేడియో, యాంటీనాల రేడియో, ఎఫ్‌ఎం రేడియో, హ్యామ్ రేడియో, వెబ్ రేడియో, కమ్యూనిటీ రేడియో, వేవ్ రేడియో, షార్ట్ వేవ్ రేడియో, ఎక్స్టర్నల్ సర్వీస్ రేడియో.. ఇలా ఎన్నెన్నో రూపాలు.

ప్రపంచ రేడియో దినోత్సవం ఆవశ్యకత :
ఐక్యరాజ్య సమితి యొక్క విద్యా, విజ్ఞాన, సాంస్కతిక సంస్థ-యునెస్కో ప్రతి ఏడాది ఒక నినాదాన్ని ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తుంది. ఈ ఏడాది 15వ ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా.. ‘రేడియో-కత్రిమ మేధ’ అనే అంశాన్ని నినాదంగా ప్రకటించింది.
2022˝À Radio and Trust
2023˝À Radio and Peace
2024˝À Radio: A Century of Informing, Entertaining and Educating
2025˝À Radio and Climate Change అస్త్రవ లు యునెస్కో- ప్రపంచ రేడియో దినోత్సవ నినాదాలుగా స్వీకరించగా, ఈ.. 2026˝À Radio and Artificial Intelligence ను ఎంచుకుంది.
ఎన్నెన్నో సంఘటనలను, సందర్భాలను దశ్య మాధ్యమం చేసే శక్తి రేడియోకుంది. రేడియోకి ఉన్న సౌలభ్యత వినికిడి ద్వారా మేధస్సును జాగతి పరుస్తుంది. పెరిగిన సాంకేతిక వికాసానికి, ఎదిగొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లు ఎన్ని వచ్చినా అవి రేడియోకి అదనపు హంగులే అన్నది మర్చిపోవద్దు. తన పరిధిని విస్తరించుకుంటూ పనిచేస్తుంది రేడియో. మానవ సేవలో తరిస్తుంది, శ్రవణ మాధ్యమంగా రేడియోకి కోట్ల మంది అభిమానులున్నారు ప్రపంచమంతా. గ్లోబలైజేషన్ మూలంగా ప్రపంచం కుగ్రామంగా మారిన ఈ కాలంలో విశ్వాసనీయత కలిగిన వ్యవస్థగా రేడియోకి ప్రథమ పీఠం వేస్తుంటాం. నైపుణ్యత, విశ్వసనీయత, మానసిక ప్రశాంతత, సమాచార సేకరణ రేడియో ద్వారానే కలుగుతుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తున్న భారత దేశంలో భిన్న సంస్కతుల ప్రజలకు కావాల్సిందేమిటో ఎన్నో సంవత్సరాలుగా గ్రహిస్తూ భారతీయ జీవన విధానానికి అవసరమైన విభిన్న కార్యక్రమాల రూపకల్పనలతో ముందుకు దూసుకుపోతోంది మన ఆకాశవాణి. పలు భాషలు, పలు ప్రాంతాలు, పలు మతాలు, పలు వర్గాలు, పలు ఆచార వ్యవహారాలను గ్రహిస్తూ, గమనిస్తూ, కాపాడుకుంటూ ప్రజలకు చేరువయ్యింది ఆకాశవాణి.
ప్రజాదరణ:
ఎన్ని నెట్వర్క్‌లు.. ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేస్తుంటారు. కానీ రేడియో ఎప్పుడూ తన పర్సనల్ వాయిస్ ని వినిపించదు. వ్యాఖ్యానాన్ని ఆ సంఘటనను బట్టి చేయదు. ప్రజల మీద రుద్దదు. సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. దాన్ని జనాలకి చేర్చటమే తన కర్తవ్యంగా భావిస్తుంది. వినోదం, వికాసం, విశ్లేషణలతో విద్య, వైద్య రంగాల్లో పనిచేస్తూ అందరినీ చేరువ చేస్తుంది. స్పష్టంగా చెప్పటం, ఏ సందర్భాన్ని అయినా క్లుప్తంగా వివరించడం, నిష్పాక్షికంగా వ్యవహరించటం, కచ్చితంగా ప్రకటించటం, తటస్థంగా ఉండటం రేడియో ప్రసారాలకు మూల సూత్రాలు. ప్రజాసేవలో ఇన్ని సంవత్సరాలుగా తరిస్తున్న రేడియో ఎప్పటికీ పాత పడలేదు. అందుకు కారణం సంగీతం వినసొంపుగా అందించడం, సాహిత్యాన్ని ప్రజాహితంగా ప్రకటించడం, వైద్య-విద్య-వైజ్ఞానిక రంగాల్లో నూతన విశ్లేషణలను ప్రకటించటం, కాలాయాపన లేకుండా సత్వరమే స్పందించటం, ఎప్పటికప్పుడు నిష్ణాతుల ఆలోచనలు సందర్భానికి తగ్గట్టుగా ఆయా కార్యక్రమాలలో చేర్చటం, యువ-మహిళ- పిల్లల-వయోధికుల, కర్షక, కార్మిక, శ్రామిక వర్గాలకు అవగతమయ్యేలా రూపొందిస్తూ సమాజంలో ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని ఆకాశవాణి కేంద్రాలకు పిలిపిస్తూ వారి స్వరాన్ని అందరికీ చేరువ చేస్తుండటం వల్ల తన ప్రగతి పూర్వక సంక్షేమ లక్ష్యాన్ని, తన గమ్యాన్ని చేరుకోగలుగుతోంది.. ఆకాశవాణి.
బాధ్యతల నిర్వహణ :
ఎన్నో తరాలుగా ఆకాశవాణికి అభిమానులు కోకొల్లలు. 1927 జూలై 23 నాడు ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ వారు కేంద్రంగా పనిని మొదలెట్టిన సందర్భాన్ని ‘భారత జాతీయ ప్రసార దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ 1947 నవంబర్ 12న ఢిల్లీలోని ఆకాశవాణి కేంద్రానికి వచ్చిన వేళను స్మరించుకుంటూ ఆర్ తేదీని ‘ప్రజాసేవా ప్రసార దినోత్సవం’గా జరుపుకుంటూ ప్రతి ఏడాదీ పునరంకితం అవుతూనే ఉన్నాం. అలాగే ఫిబ్రవరి 13న ‘వరల్డ్ రేడియో డే’ని ప్రపంచమంతా జరుపుకుంటూ ప్రజలకు చేరువయ్య ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఈరోజును ఐక్యరాజ్యసమితి యునెస్కో విభాగం ప్రకటించింది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ఆమోదించాయి.
మన ఆకాశవాణి ఇచ్చే సంగీత గ్రేడింగ్లు ఒక డిగ్రీ సర్టిఫికెట్లతో పోల్చదగినవి. ఆకాశవాణి గొంతులు ఎన్నెన్నో సంక్షేమ సంస్థలకి మూలంగా నిలబడ్డాయి. భాషను పెంపొందించే కవితలు, కథలు, కరెంటు అఫైర్స్ అందించే స్పాట్లైట్ వినడం ద్వారా ఎందరో చక్కని కొలువులు పొంది గొప్ప గొప్ప బాధ్యతలను నిర్వర్తిస్తూ వస్తున్నారు. అక్కినేని నాగేశ్వరావు గారు లాంటి వాళ్ళు కూడా ఆకాశవాణి నాటకాల్లో నటించాలని ఉందని తమ ప్రగాఢ ఆకాంక్షను వెలిబుచ్చారు. శారదా శ్రీనివాసన్ గారితో కలిసి రేడియో నాటకాల్లో నటించాలని ఎంతోమంది కలలు కన్నారు. ఆకాశవాణి అనౌన్సర్స్, నాటక కళాకారులను చూడటానికి ఆకాశవాణి కేంద్రాలకు ఎంతో మంది ప్రజలు వచ్చే వారన్న సంగతి అందరికీ తెలిసిందే.
ప్రపంచానికి విపత్తుగా మారిన, ప్రజలకు ముప్పు కలిగించే ప్రతి విషయం మీద, చెడు చేసే ప్రతి సందర్భం మీద, ప్రజలకు కనీస అవగాహన కలిగించడం రేడియో విధి. ప్రజల మనసుల్లో భయాందోళనలు తగ్గించే ప్రయత్నం చేసి శాంతి సామరస్యాలతో ప్రజల్ని ప్రశాంతంగా ఉంచడంలో రేడియో తన విశిష్ట పాత్రని అనాదిగా పోషిస్తూనే ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎందరి ఉద్యోగాలు పోతాయో, వ్యక్తిగత విశేషాలు బయట పడతాయో, సైబర్ నేరాలు పెరుగుతాయో అని భయాందోళనలకు గురి అవుతున్న ప్రజలకు ఈ ఏఐ తో ఏది చెడు, ఏది మంచి, ఏది అబద్ధం, ఏది నిజం అని తెలుసుకొనే అవగాహన కలిగిస్తుంది ఆకాశవాణి. ప్రపంచ మానవాళికి మంచి సేవలు అందించే దిశగా ఏఐ పని చేయబోతుంది. సమాచార, వార్తా మాధ్యమం ఆకాశవాణి ప్రసార వ్యవస్థలో ఇదొక శుభ సూచకమైన పరిణామం కానుంది. ప్రజలందరినీ ఒక తాటిపై నడిపించడానికి కావాల్సిన సమాచార అవగాహనను రేడియో అందిస్తుంది.
స్వర విహంగమై ఎగురుతూ.. స్వర ఝరిగా కదులుతూ.. స్వరాకాశమై ఎదుగుతూ.. స్వరలిపిగా ఒదుగుతూ.. ప్రతి గుండెను పలకరిస్తూ.. ప్రతిమనసును స్పశిస్తూ.. మౌనాన్ని ఛేదించే మంత్రాక్షరం అవుతుంది రేడియో. స్వరమే జీవనాకారంగా.. మానవాళి ఆకాంక్షలకు వీలునామాలు చెక్కుతుంది.. ఈ సంక్షేమ వాణి.
– అయినంపూడి శ్రీలక్ష్మి, 9989928562



