పౌష్టికాహార లోపం – బాల్యవివాహాలు
మందుల ఆహారంతో మహిళల్లో డీఎన్ఏ మార్పులు
ఆటిజం లేదా అంగవైకల్యంతో శిశువుల జననం
రాష్ట్రంలో మాతా మరణాలపై నర్సింగ్ విద్యార్థినుల అధ్యయనం
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
కనీస వైద్య సదుపాయాలు లేని పరిస్థితి నుంచి అత్యాధునిక వైద్య సేవలు వరకు సమాజం పరిణామం చెందినప్పటికీ ప్రసూతి మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల్లో పౌష్టికాహార లోపం, కొనసాగుతున్న బాల్యవివాహాల వల్ల మాతా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. గర్భస్రావాల నుంచి మొదలుకొని ప్రసూతి సమయంలో, ప్రసూతి అనంతర కాలంలో తల్లీపిల్లల మరణాలు ఆందోళన కలిగించే పరిణామం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలతోపాటు ఆదివాసీ ప్రాంతాల్లో మరణాల రేటు కొనసాగుతున్నట్టు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినుల అధ్యయనంలో తేలింది. మెడికల్ సోషియాలజీ ఫ్యాకల్టీ డా.శ్రీనివాస్ సూచన మేరకు ఇటీవల ఈ సర్వే నిర్వహించినట్టు విద్యార్థినుల బృందం తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అధ్యయనం జరిగింది. దీనిలో 16 మంది బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థినులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీల స్థితిగతులపై అధ్యయనం నిర్వహించారు. ప్రతి లక్ష మంది గర్భిణులలో సుమారు 50 – 60 మంది మరణించారని ఈ సర్వే ద్వారా వెల్లడైంది.
ఆహారం- పౌష్టికాహారంపై అవగాహన లేకపోవడం సరైన మోతాదులో కావాల్సిన విటమిన్లను కౌమార దశలో ఉన్న అమ్మాయిలు పొందడం లేదని విద్యార్థుల అధ్యయనం చెబుతోంది. ప్రత్యేకించి బాలికలు మెచ్యురిటీ అయిన తర్వాత అవసరమైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల విటమిన్లను పొందలేకపోతున్నారు. ఐరన్ లోపం వల్ల రక్తహీనతకు గురవుతున్నారు. మహిళలు గర్భం ధరించిన సమయంలో రక్తహీనత లోపాన్ని అధిగమించడానికి వైద్యులు సూచిస్తున్న ఐరన్ టాబ్లెట్లను వాడటం లేదు. ఐరన్ టాబ్లెట్లు వాడితే పిల్లలు నల్లగా పుడతారని ఒక తప్పుడు అవగాహన మహిళల్లో ఉంది. ఈ క్రమంలో ఎనీమియా ప్రభావంతో గర్భిణులకు గర్భస్రావం అవుతోంది. అలాగే కొందరు గర్భీణులు రక్తహీనతతో బాధపడుతూ మృతి చెందుతున్నారు. బాల్య వివాహాలు కూడా ప్రసూతి మరణాలకు కారణమవుతున్నాయి. ఒకవైపు శరీరం పరిపక్వత పరిణితి చెందకముందే గర్భధారణ, కనీసం మూడేండ్ల వ్యవధి కూడా లేకుండానే రెండో సంతానానికి వెళ్లడంతో యువతులు రక్తహీనతతో పాటు పలు రకాల పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, సామాజిక ఒత్తిడి మొదలైన కారణాలతో పాతికేండ్ల వయస్సు రాకముందే మాతా మరణాలకు గురవుతున్నారు.
మందుల ఆహారం- డీఎన్ఏలో మార్పులు
సేంద్రీయ వ్యవసాయం అంతరించిపోతూ రసాయనిక ఎరువులు, మందుల వాడకం పంటలపై అధికమవడంతో ఈ మందుల ఆహారం తింటున్న ప్రజలు పలు రకాల రోగాలకు గురవుతున్నారు. ప్రత్యేకించి కౌమార దశ ఉన్న యువతుల నుంచి మొదలుకొని పెండ్లయిన యువతులపై రసాయనిక ఎరువులు, మందుల అవశేషాల ప్రభావం పడుతోంది. గర్భధారణ సమయంలోనే యువతుల్లో డీఎన్ఏ మార్పులు చోటుచేసుకోవడంతో శిశువులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఈ కారణంగా శిశువులు ఆటిజంతో పుడుతున్నారు. క్రోమోజోముల వ్యవస్థలో గురైన మార్పుల కారణంగా మానసిక అనారోగ్యంతోనే కాకుండా అంగవైకల్యంతో శిశువుల జననం జరుగుతోంది. దీంతో ఇలాంటి శిశువుల తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు కుటుంబంలో… మరోవైపు సమాజంలో ఒత్తిళ్లకు గురవుతూ ఆర్థికంగా కూడా అవస్థల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు సమస్యను గుర్తించి.. సమస్య రాకముందే మేల్కొనాల్సిన అవసరం ఉందని వైద్యులు, సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆహారం – ఆరోగ్యంపై అవగాహన పెరగాలి
ఆహారం- ఆరోగ్యంపై ప్రజలందరికీ అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం తగ్గిస్తూ సేంద్రీయ వ్యవసాయాన్ని చేయాల్సిన అవసరం ఉంది. సేంద్రీయ పంటలతోనే మానవాళి ఆరోగ్యం ప్రత్యేకించి తల్లి గర్భం నుంచి మొదలుకొని శిశు జననం ఎదుగుదల వరకు ఆహారం- పౌషికాహారం ప్రాధాన్యత ఎంతో ఉంది.ఎదుగుతున్న బాలికలకు మంచి ఆహారంతో పాటు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. 20 ఏండ్ల తర్వాతనే యువతులకు పెండ్లీలు-పిల్లలు అనే అంశం ఉండాలి. గర్భం ధరించిన నాటి నుంచి మొదలుకొని ప్రసూతి వరకు, ఆ తర్వాత కూడా తగిన విటమిన్లను మహిళలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో మాతా మరణాలను నివారించడంతో పాటు ఆరోగ్యవంతమైన మంచి పిల్లలను కనడానికి అవకాశం ఉంటుంది. దీంతో బలవంతమైన భారతీయ సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. -డాక్టర్ కత్తెరసాల శ్రీనివాస్


