తెల్లాపూర్‌లో ఉద్రిక్తత
శివాజీ విగ్రహం పక్కనే ఏర్పాటుతో ఘర్షణ
పోలీసుల బందోబస్తు
నవతెలంగాణ-రామచంద్రాపురం
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ సర్కిల్లో శివాజీ విగ్రహం పక్కనే.. గ్రామస్తులు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టడం ఘర్షణకు దారితీసింది. పది రోజుల కిందట ఇదే సర్కిల్లో గ్రామానికి చెందిన కొందరు శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం పక్కనే శుక్రవారం జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. జ్యోతిరావు పూలే విగ్రహానికి పలువురు గ్రామస్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ క్రమంలో రెండు విగ్రహాలకు సంబంధించి ఇరు గ్రూపుల మధ్య మాటా మాటా పెరగడంతో ఘర్షణకు దారి తీసింది. కొందరు మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే ఇరువురినీ చెదరగొట్టారు. విగ్రహాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలాన్ని సైబరాబాద్ అడిషనల్ డీసీపీ ఉదయరెడ్డి, నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ చేరుకొని అందర్నీ అక్కడి నుంచి పంపించి వేశారు. పూలే విగ్రహ తొలగింపు యత్నాన్ని పలు ప్రజాసంఘాలు ఖండించాయి.
దుండగులను కఠినంగా శిక్షించాలి : కేవీపీఎస్
తెల్లాపూర్‌లో పూలే విగ్రహాన్ని కాలుతో తన్ని కూల్చేందుకు ప్రయత్నించిన దుండగులను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్‌బాబు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కొన్ని ఆధిపత్య శక్తులు పూలే విగ్రహాన్ని అక్కడ ఉంచేందుకు జీర్ణించుకోలేక ఈ దాడులు చేస్తున్నాయని తెలిపారు. శివాజీ విగ్రహం ముసుగులో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. శివాజీ, పూలేకు పోటీ పెట్టి తమ రాజకీయం పబ్బం గడుపుకుంటున్నారని చెప్పారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు మహనీయులను అడ్డం పెట్టుకోవద్దని కోరారు.



