– 82,547 మంది విద్యార్థులకు డిగ్రీల ప్రదానం
– మెట్టు మదన్ మోహన్‌రెడ్డికి గౌరవ డాక్టరేట్
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ హెచ్ ఆడిటోరియంలో శనివారం 14వ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 82,547 మంది విద్యార్థులకు యూజీ, పీజీ, పీహెచ్డీ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో 15 విభాగాల నుంచి 87 డాక్టరల్ డిగ్రీలు, 71 బంగారు పతకాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ హెచ్ వీసీ డా.టి.కిషన్ కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించి స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. ముందుగా అరబిందో ఫార్మా లిమిటెడ్, హైదరాబాద్ హోల్‌టైమ్ డైరెక్టర్ మెట్టు మదన్ మోహన్‌రెడ్డికి డాక్టరేట్ (ఆనరిస్ కాజా) ప్రదానం చేశారు. ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ రంగాల్లో చేసిన విశిష్ట సేవలు, నాయకత్వ ప్రతిభకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందజేశారు. వీసీ విద్యార్థులతో ప్రమాణం చేయిం చి డిగ్రీలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన విశ్వవిద్యాలయ వార్షిక నివేదికను సమర్పిస్తూ మాట్లాడారు.
మొత్తం 82,547లో 72,210 అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, 9,373 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, 729 డాక్టర్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీలను ప్రదానం చేస్తున్నట్టు వీసీ తెలిపారు. ప్రస్తుత సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్ వంటి రంగాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్25 పాఠ్యక్రమాన్ని అమలు చేశామని, ఇది ‘తెలంగాణలో ఉన్నత విద్యను రూపాంతరం చేయడం- విజన్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా ఉందని ఆయన వివరించారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్, హెల్త్‌కేర్, అర్బన్ మొబిలి టీ రంగాల్లో 23 డీప్‌టెక్ స్టార్టప్‌ల ఇంక్యుబేషన్ జరుగుతోందని తెలిపారు. రూ.10.65 కోట్ల విలువైన పరిశోధన ప్రాజెక్టులు అమలవు తున్నాయని, ఇవి పునరుత్పాదక ఇంధనం, సైబర్ సెక్యూరిటీ, హెల్త్‌కేర్ రంగాల్లో కీలక సవాళ్లను పరిష్కరిస్తాయని చెప్పారు. చాలా కాలం తర్వాత 214 మంది పీహెచ్డీ స్కాలర్లకు ప్రవేశాలు కల్పించడంతోపాటు 8 కొత్త పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జర్మనీ, స్వీడన్, జపాన్, భారతదేశంలోని వివిధ సంస్థలతో 29 అవగాహన ఒప్పందాలు (8 అంతర్జాతీయ, 21 జాతీయ) కుదుర్చుకున్నామని, స్వీడన్‌లోని బ్లెకింగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో 20 ఏండ్ల సహకారం కొనసాగుతోందని వెల్లడించారు. విద్యార్థులకు వాస్తవ ప్రపంచ అనుభవాన్ని అందించేందుకు డీఆర్డీఓ, సీఎస్ఐఆర్-ఐఐసీటీ, సీసీఎంబీ, బీహెచ్ఈఎల్ వంటి సంస్థలతో విద్యా-పరిశోధన భాగస్వామ్యాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం 97 అనుబంధ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి హోదా, 103 కళాశాలలకు ఎన్ఏఏసీ గుర్తింపు, 64 కళాశాలలకు ఎన్బీఏ గుర్తింపు లభించిందని తెలిపారు. ఈ కార్య క్రమంలో విశిష్ట పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జేఎన్టీయూ హెచ్లో ఘనంగా14వ స్నాతకోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



