Sunday, February 8, 2026
E-PAPER
Homeజాతీయంక్యాబ్‌ డ్రైవర్ల సమ్మె సక్సెస్‌

క్యాబ్‌ డ్రైవర్ల సమ్మె సక్సెస్‌

- Advertisement -

అగ్రిగేటర్ల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు
ఆగిన ఆరులక్షలకుపైగా యాప్‌ ఆధారిత వాహన సేవలు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా క్యాబ్‌ డ్రైవర్లు శనివారం నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె విజయవంతమైందని యాప్‌ ఆధారిత రవాణా కార్మికులు తెలిపారు. తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (టీజీపీడబ్ల్యూయూ), ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ ఆధారిత ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ (ఐఎఫ్‌ఏటీ) యాప్‌ ఆధారిత రవాణా కార్మికులు రోడ్డెక్కారు. తమకు దక్కాల్సిన న్యాయమైన చార్జీలు, చట్టపరమైన సమ్మతి , అగ్రిగేటర్‌ కంపెనీల దోపిడీని అంతం చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఓలా, ఉబర్‌, రాపిడో, పోర్టర్‌ , ఇతర యాప్‌ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లతో దేశమంతటా ఉన్న ఆరు లక్షలకుపైగా డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొన్నారు. దీంతో తెలంగాణ, కర్నాటక, అసోం, మహారాష్ట్ర , ఢిల్లీ, ఇతర రాష్ట్రాలలో రవాణా సేవలు నిలిచిపోయాయి.

ఢిల్లీలో కార్మికులు, అఖిల భారత యూనియన్‌ నాయకులు జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. యాప్‌ ఆధారిత రవాణా కార్మికుల జాతీయ ఐక్యతను ప్రదర్శించారు. టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఐఎఫ్‌ఏటీ సహ వ్యవస్థాపకుడు , జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్‌ సలావుద్దీన్‌ మాట్లాడుతూ.. ”మోటారు వాహన అగ్రిగేటర్‌ మార్గదర్శకాలు 2025 ప్రకారం ప్రభుత్వాలు.. గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో సంప్రదించి కనీస బేస్‌చార్జీలను తెలియజేయాలని స్పష్టంగా నిర్దేశిస్తుందన్నారు. ప్రభుత్వాల నిరంతర నిష్క్రియాత్మకత అగ్రిగేటర్‌ కంపెనీలకు కార్మికులను దోపిడీ చేయడానికి స్వేచ్ఛనిచ్చిందన్నారు. దీంతో యాప్‌ ఆధారిత రవాణా కార్మికుల బతుకు అగమ్యగోచరంలా తయారైందని తెలిపారు.

ముఖ్య డిమాండ్లు :
-మోటారు వాహన అగ్రిగేటర్‌ మార్గదర్శకాలు ..2025 ప్రకారం తప్పనిసరి చేసిన గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో సంప్రదించాలి. యాప్‌ ఆధారిత రవాణా సేవలకు కనీస బేస్‌ చార్జీలను వెంటనే ప్రకటించాలి.
-మోటారు వాహనాల చట్టం , అగ్రిగేటర్‌ మార్గదర్శకాలు 2025 ప్రకారం, వాణిజ్య ప్రయాణికుల వస్తువుల రవాణా కోసం ప్రయివేట్‌ (వాణిజ్యేతర) వాహనాలను ఉపయో గించడంపై కఠిన నిషేధం లేదా వాణిజ్య వర్గం వాహనాలకు తప్పనిసరి మార్పిడి చేయాలి.
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే టీజీపీడబ్ల్యూయూ, ఐఎఫ్‌ఏటీ సంఘాల ప్రతినిధులతో తక్షణం చర్చలు ప్రారంభించాలి.
-యాప్‌ ఆధారిత రవాణా రంగం యొక్క న్యాయమైన, చట్టబద్ధమైన, స్థిరమైన నియంత్రణను నిర్ధారించాలి.
-కేంద్ర ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా ఉండటం వల్ల హక్కుల కోసం భవిష్యత్తులో దేశవ్యాప్తంగా నిరసనలు మరింత ఉధృతం చేస్తామని యూనియన్లు హెచ్చరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -