Sunday, February 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆత్మనిర్భరత లేకుండా వికసిత్‌ భారత్‌ ఎలా సాధ్యం?

ఆత్మనిర్భరత లేకుండా వికసిత్‌ భారత్‌ ఎలా సాధ్యం?

- Advertisement -

– అతివిశ్వాసంతోనే ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌
– విద్యావైద్యానికి ప్రాధాన్యత లేదు
– దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు
– గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని విస్మరించిన కేంద్రం : ఎస్వీకే వెబినార్‌లో పూర్వ ఆర్థికశాస్త్ర అధ్యాపకులు డి నరసింహారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దేశంలో ఆత్మనిర్భరత దెబ్బతిన్నదని హెచ్‌సీయూ పూర్వ ఆర్థిక శాస్త్ర అధ్యాపకులు డి నరసింహారెడ్డి అన్నారు. ఆత్మనిర్భరత లేకుండా వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ‘కేంద్ర బడ్జెట్‌ అతి విశ్వాసమా? ఆత్మనిర్భరతా?’అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో శనివారం వెబినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచీకరణ మారిందన్నారు. చౌక కార్మికులు ఎక్కడుంటే పారిశ్రామికవేత్తలు పెట్టుబడిని అక్కడ పెడుతున్నారని అన్నారు. భారతీయ పారిశ్రామికవేత్తలు కూడా విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారనీ, దీన్ని కొందరు కేంద్ర మంత్రులు ప్రశంసిస్తున్నారని చెప్పారు. భారత్‌లో పెట్టుబడులు పెడితే పరిశ్రమలొస్తాయనీ, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. కానీ భారతీయ పారిశ్రామికవేత్తలు కూడా ఆ దిశగా ఆలోచించడం లేదన్నారు. ప్రపంచానికే ఉత్పత్తి రంగానికి రాజధాని చైనా అని చెప్పారు. ఉత్పత్తి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. సెమీకండక్టర్లు, మినరల్స్‌, చిప్‌లు లేవనీ, వాటి తయారీకి సంబంధించిన యంత్రాలు లేకుండా ఉత్పత్తి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దేశంలో ఎంఎస్‌ఎంఈలు ఎంతో కీలకమన్నారు. 7.47 కోట్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో 32 కోట్ల మంది పనిచేస్తున్నారని వివరించారు. వాటికి రాయితీలు, ప్రోత్సాహకాలను కేంద్ర ప్రకటించడం లేదని అన్నారు. ఎగుమతికి సంబంధించి టెక్స్‌టైల్‌, ఫుట్‌వేర్‌ రంగాలున్నా అందులో పరిశోధన లేదనీ, ఆవిష్కరణలు కూడా లేవని చెప్పారు. దీంతో వాటిలో పనిచేసే వారికి నైపుణ్యం కొరవడిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని టెక్స్‌టైల్‌, ఫుట్‌వేర్‌ రంగాలు అభివృద్ధి సాధించాలని కోరారు. అయితే పర్యావరణ సమస్య ఉత్పన్నమవుతుందనీ, కాలుష్యం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని అన్నారు. దేశంలో నగరాలు అభివృద్ధి చెందుతున్నాయనీ, గ్రామీణ ప్రాంతాలను, చిన్న పట్టణాలను కేంద్రం పట్టించుకోవడం లేదని చెప్పారు. వందే భారత్‌ వచ్చా ప్యాసింజర్‌ రైళ్లను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బుల్లెట్‌ రైళ్లు, హైస్పీడ్‌ రైళ్లకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం కోట్ల మంది సామాన్యులు ప్రయాణించే రైళ్లను నిర్లక్ష్యానికి గురిచేస్తున్నదని విమర్శించారు. రైల్వే బడ్జెట్‌కు గుర్తింపు లేకుండా బీజేపీ ప్రభుత్వం చేసిందన్నారు. ఆత్మనిర్భరత అంటే ఇల్లు చక్కదిద్దుకోవాల్సిన అవసరముందనీ, మౌలిక వసతులను మెరుగుపర్చాలనీ, పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి అవకాశాలను కల్పించాలని సూచించారు. ప్రజల వద్ద డబ్బుంటేనే కొనుగోలు శక్తి పెరుగుతుందనీ, అప్పుడే ఉత్పత్తి చేసిన వస్తువులను కొంటారని వివరించారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అతివిశ్వాసంతోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. వృద్ధి పెరిగిందనీ, ద్రవ్యోల్బణం లేదనీ, నిరుద్యోగం తగ్గిందంటూ ఆర్థిక సర్వేలో ప్రకటించిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పెరిగిందనీ, మహిళల భాగస్వామ్యం కూడా ఉందని అన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. టాప్‌ 10 శాతం సంపన్నులు 66 శాతం, మధ్యతరగతి 40 శాతం వారు 23 శాతం జీడీపీకి సహకారం అందిస్తున్నారని వివరించారు. ప్రజలకు నాణ్యమైన విద్యావైద్యం అందడం లేదన్నారు. కేంద్రం ఆయా రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పారు. సంపన్నులపై సంపద పన్ను వేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -