నీతి, నిజాయితీకి కట్టుబడిన వారికే ఓట్లు వేయాలి : టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు
నవతెలంగాణ-బోనకల్
కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు సార్వత్రిక విద్యా సాధన లక్ష్యానికి దూరంగా ఉన్నాయని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్ విమర్శించారు. ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండల పరిధిలోని పెద్దబీరవల్లి గ్రామంలో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత సంవత్సరం రూ.1,28,650 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం రూ.1,39,289 కోట్లు కేటాయించారని తెలిపారు. అంకెల్లో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ మొత్తం బడ్జెట్ దామాషాలో తక్కువగానే ఉందన్నారు. పెరిగిన ధరలతో పోలిస్తే మధ్యాహ్న భోజనం, సమగ్ర శిక్షకు కేటాయించిన బడ్జెట్ ఏమాత్రం సరిపోదన్నారు. జాతీయ విద్యా కమిషన్ సిఫారసు చేసిన విధంగా బడ్జెట్‌లో 10 శాతం, జీడీపీలో 6 శాతం కేటాయింపుకు అందనంత దూరంలో ప్రస్తుత కేటాయింపులు ఉన్నాయని విమర్శించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయడానికి వీలుగా బడ్జెట్ కేటాయింపులు పెంచాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేస్తోందన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతుందని ఆశించిన ఉద్యోగులకు నిరాశ మిగిలిందని చెప్పారు. గత సంవత్సరం తీసుకొచ్చిన ఆదాయ పన్ను చట్టం ప్రకారమే పన్ను స్లాబులు ఉంటాయని ప్రకటించటం అన్యాయం అన్నారు. 12 సంవత్సరాలుగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచలేదన్నారు. సేవింగ్స్ మొత్తాలపై రిబేటును పెంచలేదని తెలిపారు. పాత విధానాన్ని కొనసాగిస్తూ, కొత్త విధానాన్ని ప్రోత్సహించడానికే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని కోరారు.
మున్సిపల్ ఎన్నికల్లో నీతి, నిజాయితీకి కట్టుబడి ఉండే వారికే ఓట్లు వేయాలని ఉపాధ్యాయలోకానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు జరుగుతున్న వివిధ కార్యక్రమాల విజయవంతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని, అధికారులు ఉపాధ్యాయులకు తగిన సూచనలు చేస్తూ స్నేహపూరిత వాతావరణంలో కలిసికట్టుగా ముందుకు సాగేందుకు సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, బోనకల్ మండల అధ్యక్షులు గార్లపాటి చినరంగారావు, మండల కోశాధికారి పి.నరసింహారావు, సోషల్ మీడియా కన్వీనర్ ఎం.నరేంద్రసింహ, నాయకులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.సురేష్, విద్యాసాగర్, నాయకులు మాదాల ప్రసాద్, ఆలస్యం పుల్లారావు, వీరస్వామి, సుధాకర్, రామకృష్ణ, యు.నాగేశ్వరావు పాల్గొన్నారు.



