Sunday, February 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏటిగడ్డ కిష్టాపూర్‌కు హరీశ్‌రావు రావొద్దు

ఏటిగడ్డ కిష్టాపూర్‌కు హరీశ్‌రావు రావొద్దు

- Advertisement -

నిర్వాసితులు, కాంగ్రెస్‌ నాయకుల ఆగ్రహం
ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో తీవ్ర ఉద్రిక్తత
పరస్పరం చెప్పులు విసురుకున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.. పోలీసుల లాఠీచార్జి
ప్రచారంలో పాల్గొనకుండా వెళ్లిపోయిన ఎమ్మెల్యే


నవతెలంగాణ-గజ్వేల్‌ రూరల్‌
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మల్లన్నసాగర్‌ ఆర్‌అండ్‌ ఆర్‌ కాలనీలో శనివారం జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పునరావాస కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రచారానికి వస్తున్నారని తెలిసి.. కాంగ్రెస్‌ నాయకులు, ప్యాకేజీ రాని నిర్వాసిత ప్రజలు తరలివచ్చారు. తమను ప్రాజెక్టులో నిండా ముంచారని, వ్యవసాయ భూములన్నీ లాక్కున్నారని నిరసనకు దిగారు. సర్వం కోల్పోయి రోడ్డున పడిన తమను సచ్చారా? బతికారా? అని అడగనోళ్లు మా కాలనీకి రావద్దు అంటూ ఆందోళనకు దిగారు. రోడ్డున పడ్డామని, అడ్డా మీద కూలీలుగా బతకాల్సిన పరిస్థితులు తలెత్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనూ బీఆర్‌ఎస్‌ ప్రచారం ప్రారంభం చేయడంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్‌ నాయకులు, ప్రజలు.. హరీశ్‌రావు గోబ్యాక్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ నాయకులపై చెప్పులు విసరడంతో.. తిరిగి బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ నాయకులపై చెప్పులు విసిరారు. ఆందోళన తీవ్రమవుతుండటంతో సీఐలు రవి కుమార్‌, రవిరాజు, ముత్యం రాజు ఆధ్వర్యంలో పోలీసులు లాఠీచార్జి చేసి.. వారిని చెదరగొట్టారు. అయితే, ఆందోళన జరుగుతుండటంతో హరీశ్‌రావు ప్రచారంలో పాల్గొనకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. అనంతరం బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి వంటేరు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి పునరావాస గ్రామాల కాలనీల్లో అభ్యర్థులతో ప్రచారం కొనసాగించారు. ఇదిలా ఉండగా సుమారు 5 గంటలపాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. వందలాది మంది పోలీసులు.. అదనపు బలగాలతో ఎక్కడి కక్కడా ఇరు పార్టీల వారిని, నిర్వాసితులను చదరగొట్టే ప్రయత్నం చేశారు. ఘర్షణ జరిగిన చోట బెటాలియన్‌ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -