Monday, February 9, 2026
E-PAPER
Homeదర్వాజఅవని.. ప్రేమ కిరణాల క'వనమై'…!

అవని.. ప్రేమ కిరణాల క’వనమై’…!

- Advertisement -

పంచభూతాల హృదయ గీతాల్లో
కాలుష్య నిశ్శబ్ద సమరం జరుగుతుంటే
పర్యావ’రణం’ ప్లాస్టిక్‌ సంద్రంలో
విషాద గేయాల జలపాతాలను పారిస్తుంది..!
నవతరం బాధ్యతారాహిత్యపు
ఆలోచన సుడుల ముడుల్లో అంధకార
అజ్ఞాన తెరల చాటున సాంకేతికత
రెక్కలు ఎదుగుతుంటే..
పచ్చని అడవులు ఆకలితో మండుతూ
ఆవేదనా స్వరాలయ్యాయి..!

విశ్వశోధనా ఉపగ్రహాల గమనం
కాంతి వేగంతో కదులుతుంటే
కర్బన ఉద్గారాల ఈ-వ్యర్థాలన్నీ
‘అంతరిక్షమై’ మిగులుతూ పుడమి తల్లి
గుండె లోగిలలో కన్నీటి కవిత్వాన్నీ లిఖిస్తున్నాయి..!
గతి తప్పుతున్న భవిష్యత్తు జీవ ఉనికి
ప్రతీ ప్రశ్న ప్రకృతికే సవాలు విసురుతుంటే…
అగ్ర రాజ్యాల ఆధిపత్య కుబుసాల మధ్యలో
పసిపిల్లల ఆకలి ఆర్తనాధాల బతుకు యుద్దంలో..
తూటాల శబ్ద గాయాల అణుబాంబుల
అక్షర జ్వాలల జీవన రాతల మధ్య ”ఆధునాతనం”
శవాల కుప్పల శిథిలాలుగా కనిపిస్తుంటే…
ప్రభాత రవి కన్నీటి రక్త కిరణాలతో ఉదయిస్తున్నాడు..!

గ్లోబల్‌ వార్మింగ్‌.. ఆమ్ల వర్షం..
గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌.. డిజిటల్‌ పొల్యూషన్‌..
ఇలాంటి వైపరీత్యాల విస్ఫోటనాల మధ్య
మన ప్ర’గతి’ రథ చక్రాలు కాలచక్రంపై పరిగెడుతున్నాయి..!
పచ్చని చెట్ల చిరునవ్వుల వెలుగుల మధ్య
పుడమిపై పున్నమి వెన్నెల ఉత్సవాన్ని పూయిద్దాం
మానవతా లేజర్‌ పుంజాల ఉద్యమ గొంతుకలతో
భిన్న సంస్కృతుల సరిహద్దుల ఇంద్ర ధనస్సుల మధ్య
వసుదైక అహింసా భావ చిత్రం నిర్మిద్దాం.
నా త్రివర్ణ పతాక లౌకిక తాత్విక స్ఫూర్తి

పర్యావరణహిత జీవన తత్వ సారమై
రవీంద్రుని గీతాంజలి అక్షర సామ్రాజ్య
సంగీత సవ్వడులతో…
గాంధీజీ బోసినవ్వుల విశ్వశాంతి
పవనాల పరిమళ పదినిసలలో..
జగత్తంతా ప్రేమ కవనాల కుసుమాల
ప్రేరణలతో నింపేద్దాం..!
నా అక్షరాల గ్రావిటీ ఆహ్వానిస్తుంది..
ఈ అనంత విశ్వాన్ని…!
నేను సైతం అంటూ అడుగులేయండి..!
అవని రక్తనాళాల్లో స్వచ్ఛతా సౌధాలను ప్రవహించనీయండి..!

ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌, 9394749536

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -