Monday, February 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురాష్ట్రంలో 'రహ వీర్‌' అమలు

రాష్ట్రంలో ‘రహ వీర్‌’ అమలు

- Advertisement -

ప్రమాద బాధితులను కాపాడితే..రూ.25వేల రివార్డు.. రాష్ట్ర రవాణాశాఖ శ్రీకారం

నవతెలంగాణ-సిటీబ్యూరో
”రోడ్డుపై వెళ్తున్నప్పుడు కళ్లెదుటే ఘోర ప్రమాదం… రక్తపు మడుగులో సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న బాధితులు. చుట్టూ జనం ఉన్నా, కాపాడాలనే మనసున్నా… ‘పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమో” అనే భయంతో చాలామంది వెనుకడుగు వేస్తుంటారు. ఈ సంకోచం కారణంగా ఎన్నో అమూల్యమైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కానీ ఇకపై ఆ భయం అక్కర్లేదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రాణాలను కాపాడే సామాన్యులను ‘రహ వీర్‌’ పేరుతో గుర్తించి, భారీ నజరానాతో సత్కరించేందుకు రవాణాశాఖ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ప్రకటన విడుదల చేసింది.

రూ. 25వేల పారితోషికం
రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో(గోల్డెన్‌ ఆవర్‌) ఆస్పత్రికి తరలించి, వారి ప్రాణాలు దక్కేలా చేసిన వ్యక్తులను ప్రభుత్వం ‘రహ వీర్‌’గా ఎంపిక చేస్తుంది. ఇలాంటి వారికి రవాణాశాఖ ద్వారా రూ. 25,000 నగదు బహుమతి, ప్రభుత్వ ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు.

చట్టం మీ వైపే..
సహాయం చేసేవారికి చట్టపరమైన రక్షణ ఉంటుందని రవాణా శాఖ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. గుడ్‌ సమారిటన్‌లను(సహాయం చేసేవారిని) పోలీసులు విచారణ పేరుతో వేధించకూడదు. ఆస్పత్రుల్లో కూడా అడ్మిషన్‌ ఫీజులు లేదా ఇతర వివరాల కోసం ఒత్తిడి చేయకూడదు. మీరు చేసేది సామాజిక సేవగానే పరిగణించబడుతుంది తప్ప, సాక్ష్యంగా కాదు. అంటే సుప్రీం మార్గదర్శకాల ప్రకారం పూర్తి చట్టపరమైన రక్షణ ఉంటుందని రవాణా శాఖ చెబుతోంది.

ఎంపిక విధానం ఇలా..
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితుడిని ఆస్పత్రికి చేర్చిన వ్యక్తి వివరాలను స్థానిక పోలీసులు లేదా ఆస్పత్రి వర్గాలు నమోదు చేస్తాయి. జిల్లా కలెక్టర్‌ చైర్మెన్‌గా, ఎస్పీ, జిల్లా వైద్యాధికారి సభ్యులుగా ఉండే జిల్లా స్థాయి కమిటీ ఈ వివరాలను పరిశీలిస్తుంది. ప్రాణాన్ని కాపాడినట్టు నిర్ధారణ అయ్యాక, ఆ వ్యక్తిని ‘రహ వీర్‌’గా ఎంపిక చేసి బహుమతిని అందజేస్తారు. ‘రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు చూస్తూ ఉండిపోకుండా, ధైర్యంగా ముందుకు రండి’ అని రవాణా శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.

ఎందుకు ఈ పథకం?
గోల్డెన్‌ అవర్‌(ప్రమాదం జరిగిన మొదటి గంట)లో బాధితుడికి వైద్యం అందితే ప్రాణం దక్కే అవకాశాలు ఎక్కువ. అయితే పోలీసుల భయంతో జనం ముందుకు రావడం లేదు. ఈ భయాన్ని పోగొట్టి, మానవత్వాన్ని చాటుకునే వాతావరణాన్ని కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -