కంప్యూటర్ ఆధారితంగా నిర్వహణ
మే 13, 14 తేదీల్లో ప్రవేశ పరీక్ష
లక్ష మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని అంచనా
నవతెలంగాణతో ఐసెట్ 2026 కన్వీనర్, ప్రొఫెసర్ అల్వాల రవి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా 16 రీజియన్లలో ఐసెట్ ప్రవేశ పరీక్ష జరగబోతుంది. దీనికోసం 110 కేంద్రాలను తెలంగాణ ఉన్నతవిద్యామండలి ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి తరపున నల్లగొండలోని ఎంజీయూ నోటిఫికేషన్‌ను వెల్లడించింది. తెలంగాణరాష్ట్రంలో ఎంబీఏ/ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ పరీక్ష నిర్వహణను తెలంగాణ ఉన్నతవిద్యామండలి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం(నల్లగొండ)కు అప్పగించింది. మే 13,14వ తేదీలలో టీజీ ఐసెట్ – 2026 పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను టీజీ ఐసెట్ పరీక్ష కన్వీనర్ అల్వాల్ రవి నవతెలంగాణ ప్రాంతీయ ప్రతినిధికి వివరించారు. ప్రవేశాలకోసం కేంద్రీకృత కౌన్సెలింగ్ ప్రక్రియను టీజీసీహెచ్‌ఈ ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ప్రవేశ పరీక్ష రుసుం ఎలా ఉంటుంది?
అన్ రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.750, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు రూ.550 చెల్లించాలి. ఫిబ్రవరి నుంచి మార్చి 16 వరకు అవకాశం ఉంది. రూ. 250 ఆలస్య రుసుంతో మార్చి 30 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ ఏడు వరకు, రూ. 5000 ఆలస్య రుసుముతో మే ఒకటి వరకు, రూ.10,000 ఆలస్య రుసుంతో మే 3 వరకు చెల్లించవచ్చు. హాల్ టికెట్ డౌన్‌లో డ్ మే 4 నుంచి చేసుకోవచ్చు. టీజీఐసెట్ ఫలితాలు ప్రకటించిన వెంటనే తెలంగాణ ఎంబీఏ ప్రవేశాల షెడ్యూల్ విడుదల అవుతుంది. పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది. పేపర్ వాడటం ఉండదు.
ఐసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అనంతరం మార్పు చేర్పులకు అవకాశం ఉందా ?
పరీక్షకు దరకాస్తు చేసుకున్న అనంతరం చేర్పులు, మార్పులు ఉంటాయి. విద్యాసంవత్సరం నష్టపోకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసిన ఫారంను పునర్‌పరిశీలిం చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం. దరఖాస్తు ఫారమ్ సవరణ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24 వరకు ఉంటుంది. పరీక్ష రాసే అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికాకుండా ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాం. 9676853076 కార్యాలయ పని దినాలలో అందుబాటులో ఉంటుంది.
ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారా?
రాష్ట్రవ్యాప్తంగా రీజినల్ కేంద్రాలలో పరీక్ష నిర్వహించడంతో అభ్యర్థులు స్వస్థలం జిల్లాలోనే పరీక్ష రాసే విధంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.అభ్యర్థుల హాల్‌టి కెట్‌లో పరీక్షాకేంద్రం నేరుగా చేరుకునే విధంగా క్యూఆర్ కోడ్‌తో లొకేషన్ ముద్రిస్తున్నాం. పరీక్షాకేంద్రానికి అభ్యర్థులు రావడానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు.
ఎంతమంది విద్యార్థులు హాజరుకానున్నారు?
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం రెండవసారి టీజీ ఐసెట్ నిర్వహిస్తుంది గత సంవత్సరం 71 వేల 746 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 64,938 మంది పరీక్షకు హాజరయ్యారు.58985 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ సారి లక్ష మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని అంచనా.
నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ ఈ నెల 6 తేదీన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వేదికగా నోటిఫికేషన్ విడుదలైంది. 18 సంవత్సరాలు నిండి ఉండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు సైతం టీజీ ఐసెట్ ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హులు.
ఎన్ని మార్కులు సాధిస్తే అర్హత పొందుతారు?
200 మార్కులకు ప్రశ్న పత్రం తెలుగు, ఆంగ్ల, ఉర్దూ భాషల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షలో 25శాతం మార్కులు సాధిస్తే అర్హత పొందుతారు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు.



