సర్టిఫికెట్ల చుట్టూనే సగం జీవితం
మార్పును కోరుకుంటున్న సామాన్యుడు
ఎస్‌ఎస్‌ఆర్ శాస్త్రి
”మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు…మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు” అంటారు అందెశ్రీ. ”మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే” అంటారు కార్ల్ మార్క్స్. రెండూ రైటే! మనిషి పుట్టింది మొదలు చచ్చేదాకా ‘నేను నేనే’ అని నిరూపించుకోవడానికి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అలాగని ఇదేదో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ‘సర్’ గురించిన ప్రస్తావన అనుకునేరు. అది కూడా ఓటరు తనను తాను మనిషినేననీ, బతికేఉన్నానని నిరూపించుకొనే శీలపరీక్షతో కూడిన సర్కారు చర్యే! అయినా ప్రస్తుత టాపిక్ అది కాదు. మన సత్యం-సబితమ్మ దంపతులకు కొడుకు పుట్టాడు. ఆ వెంటనే బర్త్ సర్టిఫికెట్ కోసం మున్సిపాల్టీ వార్డు కార్యాలయంలో (గ్రామపంచాయతీలో) దరఖాస్తు చేశారు. పేరు లేకుండా ఓ బుడ్డోడు ఈ భూమ్మీద పడ్డాడని సర్కారు ఓ సర్టిఫికెట్ ఇచ్చింది. ఆర్నెల్లు దాటాక ఆ బుడ్డోడికి యాదగిరి అని పేరు పెట్టారు.
సత్యం దంపతులు మళ్లీ మున్సిపల్ వార్డు ఆఫీస్‌కు వెళ్లి అంతకుముందు ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్‌లో తమ కొడుకు పేరు యాదగిరి అని చేర్చుతూ మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. ఓ పదిరోజలు తర్వాత యాదగిరి పేరుతో బర్త్ సర్టిఫికెట్ వచ్చింది. ఇదంతా రొటీనే కదా…ఈ సోదంతా ఎందుకు? పాయింట్‌కు రా…అనే కదా మీరనేది..అక్కడికే వస్తున్నా. అసలు మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చాక, ఆ తర్వాత కూడా జీవితం అంతా ఈ ‘సర్టిఫికెట్ల’ చుట్టూనే తిరుగుతోంది. పుట్టగానే బర్త్ సర్టిఫికెట్, ఆ వెంటనే ఆధార్‌కార్డు తీసుకోవాల్సిందే.వాటితో రేషన్‌కార్డులో పేరు చేర్చాలి. స్కూల్లో వేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్, ఇన్‌కం సర్టిఫికెట్ తప్పనిసరి. స్కూలు మారాలన్నా, అక్కడి చదువు పూర్తయ్యి కాలేజీలో చేరాలన్నా ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, బోనఫైడ్ సర్టిఫికెట్లు ఉండాల్సిందే. ఆ పై చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మళ్లీ కులం, ఇన్‌కం, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు కావాలి. అంతకుముందే బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయాలంటే దానికీ మళ్లీ కొన్ని ఆధారాలు సమర్పించాలి. ఆదాయ సర్టిఫికెట్లు ఏటా ఓసారి తీసుకోవాల్సిందే.ఈ లోపు 18 ఏండ్లు నిండుతాయి కాబట్టి ఓటరు గుర్తింపు కార్డు ఉండాల్సిందే.
ఆ వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. సరే…సదువు అయిపోయింది కదా…ఏదైనా ఉద్యోగంలో చేరదాం అనుకుంటే మళ్లీ అదే సర్టిఫికెట్ల లొల్లి. ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే, సదరు దరఖాస్తుదారు తానేననీ, తమ కులం ఫలానా అని తాజాగా రుజువుచేసుకోవాలి. ఏదో ఉద్యోగం దొరికింది…ఇక సెటిల్ అవుదాం అనుకోగానే పెండ్లి ప్రస్తావన రానే వచ్చే. పెద్దలు పెండ్లి చేయగానే మళ్లీ మ్యారేజ్ సర్టిఫికెట్ తెచుకోవాలి. అది ఉంటేనే అప్పటి వరకు ఒక ఇంట్లోఉన్న ఆడపిల్ల మరో ఇంటికి వచ్చినట్టు ధృవీకరిస్తారు. సరే…అక్కడికి ఓ యజ్ఞం పూర్తయ్యింది అనుకుంటుండగానే… భార్య గర్భవతి కావడం, పిల్లల్ని కనడం, వాడికోసం బర్త్ సర్టిఫికెట్ నుంచి మొదలు పెట్టడం….మళ్లీ సైకిల్ చక్రం రిపీట్. సరే..సంసారం పెరుగుతోంది ఓ సొంతిల్లు కొనుక్కుందాం అనుకుంటే, బ్యాంక్ లోన్ కోసం నో డ్యూ సర్టిఫికెట్లతో మొదలై స్టేట్‌మెంట్లు, సిబిల్ స్కోరు, దస్తావేజుల చుట్టూ ప్రదక్షిణలు షురూ! ఇల్లు కొనుక్కున్నాం అని సంతోషించేలోపు కరెంటు మీటరు, ఆస్తిపన్ను రశీదుల్లో పేర్లు మార్చుకోవాలంటే మళ్లీ సర్టిఫికెట్ల అప్‌లోడ్ తప్పనిసరి.
భవిష్యత్ ఎలా ఉంటుందో అనే భయంతో కుటుంబానికి ఆర్థిక రక్షణ కోసం ఇన్సూరెన్స్ చేద్దామంటే మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. కష్టమో నిష్ఠూరమో లైఫ్‌ను ఇలాగే నెట్టుకుంటూ వెళ్తుంటే, రిటైర్‌మెంట్ రానే వచ్చే! హతవిధీ అనుకుంటూ మళ్లీ సెటిల్‌మెంట్ల కోసం సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయక తప్పకపాయే! ఆ తర్వాత పెన్షన్ తీసుకుంటుంటే…నేను బతికే ఉన్నా అని ఏటా వేలిముద్రలు వేసి, ఈ జీవి ఇంకా భూమ్మీదే ఉన్నాడని రుజువుచేసుకోవాల్సిందే. ఈలోపు ఏదైనా అనారోగ్యం వచ్చి దవాఖానాలో పడితే ఆరోగ్యశ్రీ కావాలంటే తెల్లరేషన్ కార్డుతో పాటు మళ్లీ ప్రదక్షిణలు మొదలు. వచ్చిన రోగం నిర్ణీత ఆర్థిక పరిమితికి మించితే, ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటూ మళ్లీ సర్టిఫికెట్ల కోసం తిరగాల్సిందే.
ఏందిరా బాబు ఈ బతుకు అని మనల్ని మనం ఈసడించుకుంటుండగానే సటుక్కున సావొస్తే, మళ్లీ డెత్ సర్టిఫికెట్ కోసం అదే మున్సిపల్ వార్డు ఆఫీసు చుట్టూ తిరగాల్సిందే. పోతే పోయాం దిక్కుమాలిన సర్టిఫికెట్ల గోల వదిలిపోయిందని ‘ఆత్మ’ సంతృప్తి చెందేలోపు ఆస్తిపంపకాల కోసం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కావాలనే షరతు గుర్తొచ్చే! జీవిత చక్రం ఇక్కడితో ఆగిపోలేదు. ఓసారి పుట్టాక మనం భూమ్మీద ఉన్నా లేకున్నా, మన ఆనవాళ్లు సర్టిఫికెట్ల రూపంలో స్థిరంగా ఉండిపోతాయి. ఇవన్నీ స్వదేశంలో సామాన్యుడి బతుక్కి చెందినవే. వీటిలోనే పిల్లల్ని పై చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో బయటి దేశాలకు పంపాలంటే ఆ ‘సర్టిఫికెట్ల’ గోల వేరు. ఏమిరా ఈ బతుకు…సగం జీవితం సర్టిఫికెట్ల చుట్టూ తిరుగుతూనే అయిపాయే అని మనసులో అనుకునే లోపు, తర్వాతి తరం ఇదే ‘చట్రం’లోకి వస్తూనే ఉంది. కచ్చితంగా దీనికో ‘సన్మార్గం’ రావాలి. ‘సర్’ లాంటి తలనొప్పులు తప్పాలి. కాంపిటీటివ్ ప్రపంచంలో కామన్‌మ్యాన్ కోరిక ఇదే!!



