సాయంత్రంతో మున్సిపల్ ప్రచారం బంద్
క్యాంపెయిన్‌లో స్థానిక నేతలదే జోరు-పగలు ప్రచారాలు రాత్రి వ్యూహాలు
పలు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కేటీఆర్, హరీశ్ సభలు
సీపీఐ (ఎం) నుంచి జాన్‌వెస్లీ…సీపీఐ నుంచి కూనంనేని ప్రచారం
మొదలైన తాయిలాలు..ప్రలోభాలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అందుకు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు జోరుగా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఈసారి స్టార్ క్యాంపెయినర్లు లేకుండా ప్రచారం ముగుస్తోంది. స్థానిక నేతలే ఎక్కువగా ప్రచారంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాలుగు ఉమ్మడి జిల్లాల్లో సభలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపల్ కేంద్రానికి పరిమితమయ్యారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కరీంనగర్ మున్సిపాలిటీల బాధ్యత అప్పగించడంతో అక్కడ మాత్రమే ప్రచారం నిర్వహించారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు అశ్వారావుపేట, ఇల్లందు, ఏదులాపురం, సత్తుపల్లి, కల్లూరులలో రోడ్ షోలు నిర్వహించారు. వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా అక్కడి మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు. మిగిలిన మంత్రులు సైతం చాలావరకు సొంత జిల్లాలతో పాటు ఇన్చార్జిగా వ్యవహరించిన జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. ఖమ్మం పార్లమెంటు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న మంత్రి కొండా సురేఖ ఒక్కరోజు ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. సీపీఐ జాతీయ నేత నారాయణ ఏదులాపురం, కొత్తగూడెంలలో ప్రచారం నిర్వహించారు.
ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌రావు, సాగర్, నున్నా నాగేశ్వరరావు, మల్లు లక్ష్మీ, నాగయ్య, చుక్కారాములు తదితరులు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ నుంచి కేటీఆర్, హరీశ్‌రావు రాష్ట్రవ్యాప్తంగా పలు సభల్లో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు ఎంఐఎం ముఖ్యనేతలూ ప్రచార సభల్లో పాల్గొన్నారు. పగలు బహిరంగ ప్రచారం నిర్వహించిన నాయకులు రాత్రి వ్యూహాలకు పదును పెట్టారు. ప్రతి వార్డు, డివిజన్లలో గడిచిన వారం, పది రోజులుగా ఎన్నికల ప్రచార మైకులతో పట్టణ ప్రజలు నిద్రలేచారు. ఇప్పటివరకూ ఎన్నికల ప్రచార మోతను భరించగా… ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలూ మొదలయ్యాయి.
ప్రచార రథాలతో హోరెత్తిన కాలనీలు
కాలనీల్లో ప్రచార రథాలు మైకులతో హోరెత్తించాయి. ఒక పార్టీ రథం ఓ వీధిలో తిరుగుతుండగానే మరో పార్టీ రథం మరో వీధిలో మోత మోగిస్తున్న తతంగం వారం రోజులుగా నడిచింది. ఇన్ని రోజులు పార్టీల జిల్లా నేతలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలనీలను చుట్టేస్తూ హడావుడిలో ఉన్నారు. ప్రచారంలో పాల్గొంటూనే మెజార్టీ సీట్లలో గెలుపునకు ఏమి చేయాలనేదానిపై రాత్రిళ్లు వ్యూహానికి పదును పెట్టారు. ప్రధాన పార్టీలన్నీ పుర పీఠంపై గురిపెట్టి అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తమ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్, తమ వారికి ఓటేస్తే కేంద్ర నిధులు వస్తాయని బీజేపీ, తమ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఆదరించాలని బీఆర్‌ఎస్ నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ తరపున ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కాలనీల్లో పర్యటించారు.
ఇప్పటికే మొదలైన ప్రలోభాలు
ఇప్పటికే ప్రలోభ చర్యలు మొదలయ్యాయి. ఏ వార్డులో పరిస్థితి ఎలా ఉందనేది ఆరా తీశారు. బలహీనంగా ఉన్న చోట ఎవరితో మాట్లాడితే ప్రయోజనకరంగా ఉంటుందనే దానిపై సమాలోచనలు చేశారు. వాటిని ఆచరణలో పెడుతున్నారు. కాలనీ ముఖ్య వ్యక్తులకు ఫోన్లు చేస్తూ తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. వార్డుల్లో ఉండే సామాజికవర్గాల్లో ముఖ్యమైన వారితో మాట్లాడుతూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అన్ని పార్టీలూ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అర్ధరాత్రి వరకు సైతం అనధికారిక ప్రచారం నిర్వహించారు. ఈ రెండు రోజులు పగలూ రాత్రుళ్లు నిద్ర లేకుండా ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రలోభాలు చేపడుతున్నారు.



