Monday, February 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం12న దేశవ్యాప్త సమ్మెకు మద్దతు

12న దేశవ్యాప్త సమ్మెకు మద్దతు

- Advertisement -

జయప్రదానికి వామపక్షాల పిలుపు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలను అనుసరిస్తున్నది. మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి. విద్యుత్‌ సవరణ చట్టం-2025, వీబీజీఆర్‌ఏఎమ్‌జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్‌ఐసీలో 100శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతించడం లాంటి ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి. ఈ డిమాండ్లతో కేంద్ర కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ నెల 12న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. రాష్ట్రంలోని కార్మికులు, రైతులు, ప్రజలు ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి’ అని వామపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు.

ఆదివారం ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎంఎల్‌)మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి.సూర్యం, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్‌)లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేశ్‌రాజా, ఎస్‌యూసీఐ(సి) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌ మురహరి, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, పార్వర్డ్‌బ్లాక్‌ కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌.వీ.ప్రసాద్‌ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కార్మికులకు నష్టం చేకూర్చేలా, యాజమాన్యాలకు లాభం చేకూర్చేలా లేబర్‌కోడ్‌లు ఉన్నాయని విమర్శించారు. వాటివల్ల కార్మికులు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, గ్రాట్యుటీ, పెన్షన్‌ వంటి సామాజిక భద్రతకు దూరమవుతారని ఎత్తిచూపారు. పనిగంటలు పెరుగుతాయనీ, ఉద్యోగ భద్రత ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ చట్టాన్ని మార్చి పేదల పొట్టగొట్టడాన్ని తప్పుబట్టారు. విద్యుత్‌ సవరణ బిల్లు వల్ల సామాన్యులకు విద్యుత్‌ చార్జీలు పెరుగుతాయనీ, స్మార్ట్‌ మీటర్లు, క్రాస్‌ సబ్సిడీ రద్దుతో రైతులు, పేదలకు ఉచిత విద్యుత్‌ సౌకర్యాలు పోతాయని వివరించారు. రాష్ట్రాల హక్కులను విస్మరిస్తూ కేంద్రం చట్టాలు చేయడం ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. విత్తన సవరణ బిల్లు వల్ల విత్తనాల ధరలను నియంత్రించే అధికారం ప్రయివేటు కంపెనీల చేతుల్లోకి వెళ్ళి, బహుళజాతి కంపెనీల పట్టు పెరుగుతుందనే విషయాన్ని ఎత్తిచూపారు. ఎల్‌ఐసీలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం వల్ల విదేశీ కంపెనీలు కేవలం లాభాపేక్షతో పని చేస్తాయనీ, క్లెయిమ్ల విషయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చట్టాలతో దేశ సార్వభౌమత్వం దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -