వాటిలో కొన్ని అత్యంత అరుదైనవి
కనుగొన్న మహారాజా శ్రీరామ్ చంద్ర భంజా దేవ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు
ప్రొఫెసర్ బిస్వజిత్ రాథ్ నేతృత్వంలో నిర్వహణ
మరోసారి వార్తల్లో నిలిచిన ఒడిశాలోని సిమిలిపాల్ జాతీయ ఉద్యానవనం
భువనేశ్వర్ : ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న సిమిలిపాల్ జాతీయ ఉద్యానవనం మరోసారి తన జీవ వైవిధ్యంతో వార్తల్లో నిలిచింది. బరిఫడాలోని మహారాజా శ్రీరామ్ చంద్ర భంజా దేవ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం నిర్వహించిన విస్తృత పరిశీలనలో ఏకంగా 148 లైకెన్ జాతులను గుర్తించింది. ఇది రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక సంఖ్యగా నిలిచింది. ఈ మేరకు ఏఎన్ఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రొఫెసర్ బిస్వజిత్ రాథ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ పరిశోధనలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బృందంగా ఏకంగా 148 లైకెన్ జాతులను గుర్తించగా.. వాటిలో కొన్ని అత్యంత అరుదైనవిగా తేలాయి. ముఖ్యంగా ఫిసియెల్లా మెలనోక్రోమా అనే జాతిని దేశంలో తొలిసారిగా గుర్తించారు. అలాగే క్లాడోనియా ఫ్రూటికులోసా అనే జాతి ఒడిశాలో మొదటిసారి నమోదు కావడం విశేషం.
లైకెన్లు అంటే ఏమిటి?
లైకెన్లు అనేవి శిలీంధ్రం (ఫంగస్), శైవలాలు లేదా నీలి బ్యాక్టీరియా కలిసిన సహజ జీవ సమూహాలు. ఇవి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవించగలవు. ఎండలు, భారీ వర్షాలు, చలి, వ్యాధులను తట్టుకునే శక్తి వీటికి ఉంటుంది. తమను రక్షించుకోవడానికి ఇవి ప్రత్యేక రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ రసాయనాలే ఔషధ పరిశోధనలకు కీలకంగా మారుతున్నాయి. పరిశోధనలో సేకరించిన లైకెన్లలో థైమోక్వినోన్, జియోరిన్, అజెలాయిక్ ఆమ్లం వంటి విలువైన జీవక్రియ పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు.
వ్యాధికారక సూక్ష్మజీవులను నిరోధించే క్రిమి నాశక గుణాలు, శరీర కణాలను రక్షించే ఆక్సీకరణ నిరోధక లక్షణాలు, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే వ్యాధి నిరోధక ప్రభావం కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రొఫెసర్ బిస్వజిత్ రాథ్ మాట్లాడుతూ.. సిమిలిపాల్ ప్రాంతంలో లభించిన లైకెన్లలో ఉన్న థైమోక్వినోన్ వంటి పదార్థాలు మనుషుల్లో వ్యాధికారక జీవులను నిర్మూలించగలవన్నారు. వీటికి క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్ ఔషధాల తయారీలో ఇవి ఉపయోగపడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.



