Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డి, బిచ్కుందలో పోలీసుల భారీ ఫ్లాగ్ మార్చ్

కామారెడ్డి, బిచ్కుందలో పోలీసుల భారీ ఫ్లాగ్ మార్చ్

- Advertisement -

నిర్భయంగా ఓటు వేయండి: ఎస్పీ రాజేష్ చంద్ర పిలుపు
నవతెలంగాణ – కామారెడ్డి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శిశుమందిర్ స్కూల్ నుంచి ప్రారంభమైన ఈ కవాతు న్యూ బస్ స్టాండ్, నిజాంసాగర్ రోడ్, బడా మసీద్, పాన్ చౌరస్తా, డెయిలీ మార్కెట్, రైల్వే స్టేషన్, సిరిసిల్ల రోడ్ మార్గంగా రాజీవ్ పార్క్ వరకు నిర్వహించారు.  బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో బిచ్కుంద మండల కేంద్రంలో  పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందనే సందేశాన్ని ఇవ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించబడతాయని, పోలీసులకు సహకరించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోమవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగుస్తుందని, అనంతరం ఎవరైనా ప్రచారం నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, కీలక ప్రాంతాలు సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయని, కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఏ అవాంఛనీయ ఘటన జరగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఓటర్లు మద్యం, డబ్బు, బహుమతులు వంటి ప్రలోభాలకు గురికావద్దని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 కు తెలియజేయాలని సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ ఫ్లాగ్ మార్చ్‌లో అదనపు కలెక్టర్ విక్టర్, ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఆర్డీఓ వీణ, ఎస్హెచ్ఓ నరహరి, రూరల్ సీఐ రామన్, వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బిచ్కుంద కవాతులో సబ్‌డివిజన్ సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -