Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలి

మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలి

- Advertisement -

– అంతర్గత ఫిర్యాదు కమిటీలు తప్పనిసరి 
– జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల
నవతెలంగాణ –  కామారెడ్డి 

పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు అన్ని కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదు కమిటీలు (ICC) ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఏ. ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం – 2013 ప్రకారం అశ్లీల వ్యాఖ్యలు, అసభ్య ప్రవర్తన, శారీరక వేధింపులు నేరంగా పరిగణించబడతాయని ఆమె పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు వెంటనే ఐ సి సి  లను ఏర్పాటు చేసి వివరాలను  షి బాక్స్  పోర్టల్  లో నమోదు చేయాలని సూచించారు. నమోదు చేయని సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.

అంతర్గత ఫిర్యాదు కమిటీ సభ్యుల వివరాలను జిల్లా సంక్షేమాధికారి కార్యాలయానికి అందించాలని, సంబంధిత అధికారులు తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. షి బాక్స్   పోర్టల్ ద్వారా మహిళలు తమ ఫిర్యాదులను నమోదు చేసుకుని స్టేటస్‌ను తెలుసుకోవచ్చని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ఎలాంటి భయం అవసరం లేదని భరోసా ఇచ్చారు. సంఘటన జరిగిన మూడు నెలల లోపు ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. కమిటీ నిర్మాణంలో సీనియర్ మహిళా ఉద్యోగిని అధ్యక్షురాలిగా నియమించడంతో పాటు కనీసం ఇద్దరు మహిళా హక్కులు లేదా సామాజిక సేవలపై అవగాహన ఉన్న సభ్యులు, ఒక బాహ్య సభ్యుడు (ఎన్‌జీఓ లేదా మహిళా సమస్యలపై అనుభవం ఉన్న వ్యక్తి) ఉండాలని సూచించారు. కమిటీలో కనీసం 50 శాతం మహిళలు ఉండేలా చూడాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళా హెల్ప్‌లైన్ 181 లేదా పోలీస్ హెల్ప్‌లైన్ 100ను సంప్రదించాలని జిల్లా సంక్షేమాధికారి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -