నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
సోమవారం ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు పరిశీలించారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందర్శించారు.
ఎంత మంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ వార్డుకా వార్డుల వారీగా బ్యాలెట్ పేపర్లు ఇచ్చారా అని అడిగి తెలుసుకున్నారు. ఫెసిలిటేషన్ సెంటర్ లో ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సోమవారం సాయంత్రం కల్లా ముగుస్తుందని తెలిపారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్యన కౌంటింగ్ హాల్ కు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ లు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


