ముంబయిపై కర్నాటక గెలుపు
ముంబయి : కెఎల్ రాహుల్ (130, 182 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీకి తోడు రవిచంద్రన్ స్మరణ్ (83 నాటౌట్, 123 బంతుల్లో 11 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించటంతో 325 పరుగుల లక్ష్యాన్ని కర్నాటక 6 వికెట్లు కోల్పోయింది. ముంబయిలోని శరద్ పవార్ అకాడమీలో జరిగిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబయిపై 4 వికెట్ల తేడాతో కర్నాటక గెలుపొందింది. మయాంక్ అగర్వాల్ (3), దేవదత్ పడిక్కల్ (39), కరుణ్ నాయర్ (13) నిష్క్రమణతో కర్నాటక కష్టాల్లో కూరుకుంది. కానీ కెఎల్ రాహుల్, రవిచంద్రన్ స్మరణ్‌లు నాల్గో వికెట్‌కు 147 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు.
14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో సెంచరీ కొట్టిన కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోవటంతో.. శ్రేయస్ గోపాల్ (1), కృతిక్ కృష్ణ (2) సైతం అతడి బాటలోనే నడిచారు. ఈ సమయంలో విద్యాధర్ పాటిల్ (31 నాటౌట్, 30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రవిచంద్రన్ స్మరణ్ లాంఛనం ముగించాడు. 73.4 ఓవర్లలో 6 వికెట్లకు కర్నాటక 325 పరుగులు చేసింది. కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌటైంది. ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకు కుప్పకూలగా, రెండో ఇన్నింగ్స్‌లో 377 పరుగులు చేసింది. నాల్గో రోజు ఆటలోనే విజయం అందుకున్న కర్నాటక రంజీ ట్రోఫీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
జమ్మూ కశ్మీర్ గెలుపు
దేశవాళీ క్రికెట్‌లో జమ్మూ కశ్మీర్ హవా కొనసాగుతుంది. వైట్‌బాల్‌తో పాటు రెడ్‌బాల్ ఫార్మాట్‌లోనూ జమ్మూ కశ్మీర్ తనదైన ముద్ర వేస్తోంది. ఇండోర్‌లో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో మధ్యప్రదేశ్‌పై ఆ జట్టు 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. 291 పరుగుల ఛేదనలో మధ్యప్రదేశ్ 234 పరుగులకే కుప్పకూలింది. జమ్మూ కశ్మీర్ బౌలర్లు అకిబ్ నబి (5/70), అబిడ్ ముస్తాక్ (3/49) వికెట్ల జాతర సాగించారు. సరాన్షు జైన్ (64, 81 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), శుభమ్ శర్మ (32), హిమాన్షు మంత్రి (31) మెరవటంతో మధ్యప్రదేశ్ 68.3 ఓవర్లలో 234 పరుగులు చేసింది. జమ్మూ కశ్మీర్ 56 పరుగుల తేడాతో మెరుపు విజయం అందుకుంది.
కష్టాల్లో ఆంధ్ర
బెంగాల్‌తో రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో ఆంధ్ర కష్టాల్లో కూరుకుంది. సుదీప్ కుమార్ (299), హబిబ్ గాంధీ (95), సుమంత గుప్తా (81) దంచికొట్టడంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 629 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులే చేయగా.. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 334 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 64/3తో ఎదురీదుతోంది. నేడు ఆఖరు రోజు ఆటలో తొలి రెండు సెషన్లలోనే చివరి 7 వికెట్లపై బెంగాల్ గురిపెట్టగా.. రోజంతా బ్యాటింగ్ చేసేందుకు ఆంధ్ర సిద్ధమవుతోంది. బెంగాల్ మరోసారి బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం లేకుండానే విజయం అందుకోవాలని నేడు బరిలోకి దిగనుంది.



