లాహోర్‌లో బంగ్లా, పాక్ క్రికెట్ చీఫ్‌ల భేటీ
ఐసీసీ ప్రతినిధులతో కలిసి సమాలోచనలు
భారత్‌తో మ్యాచ్ బాయ్ కాట్ నిర్ణయం వెనక్కి?
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ గ్రూప్ దశ మ్యాచ్ నిర్వహణపై ఆశలు చిగురిస్తున్నాయి. బాయ్ కాట్ నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్రధాని ప్రకటించినా… తాజా పరిణామాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. బాయ్ కాట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. భారత్‌తో మ్యాచ్‌లో ఆడేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను ఐసీసీ అన్వేషిస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చీఫ్‌లతో ఐసీసీ డైరెక్టర్లు సోమవారం లాహోర్‌లో సమాలోచనలు జరిపారు.
లాహోర్ (పాకిస్తాన్)
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఖజానాకు కాసుల వర్షం కురిపించే భారత్, పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం సాగేందుకు ఐసీసీ దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆర్థిక ఆంక్షలు, జరిమానా, పాయింట్ల కోత, ద్వైపాక్షిక సిరీస్‌లపై ప్రభావం సహా పీఎస్‌ఎల్‌లో ఆటగాళ్లకు ఎన్‌ఓసీల జారీ అంశంలో ఆంక్షలతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డును దారికితెచ్చుకునే ప్రయత్నాలు ఫలించలేదు.
పాకిస్తాన్ బాయ్ కాట్ నిర్ణయానికి కట్టుబడితే.. ఫిబ్రవరి 15న ఐసీసీ రూ.2200 కోట్ల మేర నష్టపోనుంది. ఈ పరిస్థితుల్లో బెదిరింపులకు పోకుండా.. దౌత్యపరంగా స్నేహపూర్వక చర్చలతో సమస్య నుంచి గట్టెక్కాలని ఐసీసీ భావిస్తోంది. అందులో భాగంగానే ఐసీసీ డిప్యూటీ చైర్మెన్ ఇమ్రాన్ ఖవాజ ఆదివారం పీసీబీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లామ్ లాహోర్‌కు చేరుకోగా.. సోమవారం మరోసారి ఐసీసీ సమాలోచనలు జరిపింది.
బంగ్లాకు బాసట!
భద్రత కారణాలతో భారత్‌లో ఆడలేమని బంగ్లాదేశ్ స్పష్టం చేసినా.. ఐసీసీ ఆ వినతిని పట్టించుకోకుండా ఏకపక్షంగా ఆ జట్టును ప్రపంచకప్ నుంచి తప్పించిన తీరుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహంగా ఉంది. ఐసీసీ నిర్ణయాన్ని తప్పుపట్టిన పీసీబీ చీఫ్ మోషిన్ నక్వీ.. టీ20 ప్రపంచకప్‌లో పాక్ ప్రాతినిథ్యంపై అనుమానం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌కు బాసటగానే భారత్‌తో మ్యాచ్‌ను బాయ్ కాట్ చేస్తున్నట్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ వైపు ప్రధాని బాయ్ కాట్ నిర్ణయాన్ని వెల్లడించినా.. మ్యాచ్ జరిగేలా చూసేందుకు ఐసీసీ రాయబారం నడుపుతోంది. ఈ దౌత్యం సఫలీకృతం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
షరతులు వర్తిస్తాయి
పాక్ ప్రధాని బాయ్ కాట్ నిర్ణయాన్ని, అందుకు కారణాలను వెల్లడించటంతో ఇక భారత్, పాక్ మ్యాచ్ అసాధ్యమే. అయినా, ఐసీసీ దౌత్య పరంగా ప్రయత్నాలు చేయటంతో పలు మార్గాలు కనిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో ఆడితే బంగ్లాదేశ్‌కు కలిగే ప్రయోజనాలు యథాతథంగా కొనసాగించటం, తదుపరి ఎటువంటి ఆంక్షలు వేయకుండా ఉండటం సహా 2031 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ సహా ఆతిథ్య దేశంగా బంగ్లాదేశ్ స్థానానికి భరోసా వంటి షరతులను ఐసీసీ ప్రతినిధులతో పీసీబీ, బీసీబీ చీఫ్‌లు ప్రతిపాదించినట్టు సమాచారం. ఇక పాకిస్తాన్ క్రికెట్‌కు మేలు చేకూర్చేందుకు ప్రస్తుతం ఐసీసీ వార్షిక ఆదాయంలో అందుతున్న వాటాను పెంచటం. ఐసీసీ ఏడాదికి సుమారు రూ.5400 కోట్లు ఆర్జిస్తుండగా.. అందులో సింహభాగం రూ.2100 కోట్లను బీసీసీఐ దక్కించుకుంటోంది.
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు వరుసగా రూ.369 కోట్లు, రూ.338 కోట్లు అందుకుంటున్నాయి. పాకిస్తాన్ రూ.310 కోట్లు తీసుకుంటుంది. ఐసీసీ ఆదాయంలో పాక్ వాటాను 5.75 శాతం నుంచి 7-10 శాతం వరకు పెంచాలని పీసీబీ పట్టుబడుతోంది. ఐసీసీ ఆదాయ పంపకాల ఒప్పందం 2024లో కుదరగా.. 2027 వరకు ఆ ఫార్ములా కొనసాగనుంది. ఐసీసీ ప్రతినిధులతో పీసీబీ, బీసీబీ చర్చలు ఆర్థిక అంశాలకు మారటంతో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పై సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఇటు ఐసీసీ, అటు పీసీబీ స్పష్టంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు.
కానీ మరో 2-3 రోజుల పాటు ఈ చర్చలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటు భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ, దాయాదుల మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల కరచాలనం కొనసాగించటం వంటి అంశాలు సైతం చర్చకు వచ్చినట్టు వార్తలు వచ్చినా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా ఖండించింది. ఓ వైపు భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పై నీలనీడలతో పాటు చర్చలు కొనసాగుతుండగా.. గ్రూప్ దశలో భారత్, పాకిస్తాన్‌లు తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టాయి. మంగళవారం యుఎస్‌ఏతో పాకిస్తాన్ ఆడనుండగా.. గురువారం నమీబియాతో భారత్ తలపడనుంది. వచ్చే ఆదివారం భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలో షెడ్యూల్ చేశారు.



