హైదరాబాద్ : ప్రముఖ వ్యవసాయ అనుబంధ సంస్థ గోద్రెజ్ ఆగ్రోవెట్ వరి సాగు చేసే రైతుల కోసం జపాన్‌కు చెందిన ఐఎస్‌కె సంస్థ అభివృద్ధి చేసిన అత్యాధునిక సైక్లాప్రిన్ సాంకేతికతతో ‘టకాయ్’ అనే కొత్త పురుగుమందును మార్కెట్లోకి విడుదల చేసింది. వరి పంటకు తీవ్ర నష్టం కలిగించే కాండం తొలిచే పురుగు, ఆకుముడత నివారణకు ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆ కంపెనీ ఎండి సునీల్ కటారియా తెలిపారు. వరి నాటిన 15-30 రోజుల మధ్యలో, 40-60 రోజుల దశలో దీనిని వాడటం ద్వారా పంటకు సుదీర్ఘ కాలం రక్షణ లభిస్తుందన్నారు. దీనివల్ల పంట ఆరోగ్యం మెరుగుపడి దిగుబడి పెరుగుతుందన్నారు. త్వరలోనే ఈ మందును మొక్కజొన్న, మిర్చి, చెరకు వంటి ఇతర పంటలకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది.



