ఒక పూటలోనే 7.46 శాతం ర్యాలీ
ముంబయి : బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) 2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3)లో అద్భుతమైన పనితీరును కనబర్చడంతో ఆ సంస్థ షేర్ పరుగులు పెట్టింది. బ్యాంక్ లాభాలు 14 శాతం పెరిగి రూ.21,876 కోట్లకు చేరడంతో పాటుగా.. మొండి బకాయిలు 1.57 శాతానికి తగ్గడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. ఈ సానుకూల ఫలితాల నేపథ్యంలో సోమవారం ఉదయం నుండే ఎస్బిఐ షేర్లు మార్కెట్లో దుమ్మురేపాయి. బిఎస్ఇలో 7.46 శాతం లేదా రూ.79.55 పెరిగి రూ.1,145.95కి చేరింది. ఇది 52 వారాల గరిష్ట స్థాయి కావడం విశేషం.
ఎస్బిఐ పనితీరుపై ప్రముఖ రీసెర్చ్ ఏజెన్సీలు, బ్రోకరేజ్ సంస్థలు అత్యంత సానుకూల ధోరణిని వ్యక్తం చేస్తున్నాయి. మోతీలాల్ ఓస్వాల్, జెఫరీస్ వంటి దిగ్గజ సంస్థలు ఎస్బిఐ షేరుకు ‘బై’ రేటింగ్ ఇస్తూ లక్ష్య ధరను రూ.1,300 నిర్ణయించాయి. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ దృఢంగా ఉందని.. భవిష్యత్తులో రుణాల వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉందని జెఫరీస్ విశ్లేషించింది. అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ సిఎల్ఎస్ఎ సైతం అవుట్పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ రూ.1,275 రూపాయల లక్ష్య ధరను కేటాయించగా, నువామా, నోమురా సంస్థలు కూడా తమ టార్గెట్ ధరలను వరుసగా రూ.1,250, రూ.1,235కు పెంచాయి. మొత్తంమీద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్బిఐ తన అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎస్బీఐ షేర్లతో ఇన్వెస్టర్లకు కాసుల పంట
- Advertisement -
- Advertisement -



