– ఆ మూడు రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటాల్లో పెరుగుదల
– కేరళకు అధికం.. అసోంకు మధ్యస్తం.. తమిళనాడుకు స్వల్పం
– పశ్చిమ బెంగాల్‌కు మాత్రం భారీ నష్టం
– 16వ ఆర్థిక సంఘం సిఫారసులు
– అధికారం కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు
– వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఈ రాష్ట్రాలు కీలకం : రాజకీయ పరిశీలకులు
న్యూఢిల్లీ : ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటాలో పెరుగుదల లభించింది. ఒక రాష్ట్రానికి తగ్గింపు జరిగింది. 16వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) సిఫారసుల ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ మూడు రాష్ట్రాలకు కలిపి అదనంగా రూ.9234 కోట్లు దక్కనున్నాయి. ఇది 15వ ఆర్థిక సంఘం ప్రకారం లభించే మొత్తంతో పోలిస్తే ఎక్కువే.
16వ ఆర్థిక సంఘం నివేదిక
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 1న లోక్‌సభలో 16వ ఆర్థిక సంఘం నివేదికను ప్రవేశపెట్టారు. ఈ నివేదికలో అసోం, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు కేంద్ర పన్నులు-సుంకాల విభజనలో ఎక్కువ వాటా కేటాయించగా.. పశ్చిమ బెంగాల్ వాటా తగ్గించారు. ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)లో కూడా త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అసోం బీజేపీ అధికారంలో ఉండగా.. పుదుచ్చేరిలో ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఆలిండియా ఎన్.ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సీ) ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నది. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలూ బీజేపీకి అధికారం చేపట్టడానికి అందని ద్రాక్షగానే మిగిలాయి.
కేంద్ర పన్నుల వాటాలో మార్పులు
కేంద్రం 16వ ఆర్థిక సంఘం సిఫారసులను ఆమోదించి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి నిధుల కేటాయింపులు చేసింది. 2021-26 కాలానికి వర్తించిన 15వ ఆర్థిక సంఘం కాలంతో పోలిస్తే.. ఈ సారి రాష్ట్రాల వాటాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో కేరళకు పన్నుల వాటాలో అధికంగా దక్కాయి. ఈ రాష్ట్రానికి కేంద్ర పన్నుల నికర ఆదాయంలో వాటా 15వ ఆర్థిక సంఘంలో 1.925 శాతం ఉండగా, 16వ ఆర్థిక సంఘంలో ఇది 2.382కు పెరిగింది. దీంతో 2026-27లో మొత్తం రూ.15.26 లక్షల కోట్ల విభజనీయ పూల్ నుంచి కేరళకు అదనంగా రూ.6975 కోట్లు లభించనున్నాయి. అసోం రాష్ట్రానికి వాటా 3.128 శాతం నుంచి 3.258 శాతానికి పెరిగింది. దీంతో ఆ రాష్ట్రానికి రూ.1994 కోట్లు అందనున్నాయి. తమిళనాడు వాటా స్వల్పంగా 18 బేసిస్ పాయింట్లు పెరిగి 4.079 శాతం నుంచి 4.097 శాతానికి చేరింది. దీని ద్వారా ఆ రాష్ట్రానికి అదనంగా రూ. 275 కోట్లు లభించనున్నాయి.
పశ్చిమ బెంగాల్‌కు తీవ్ర నష్టం
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌కు మాత్రం కేంద్ర పన్నుల వాటా తగ్గింది. 15వ ఆర్థిక సంఘంలో 7.523 శాతంగా ఉన్న వాటా… 16వ ఆర్థిక సంఘంలో 7.215 శాతానికి తగ్గింది. దీని ఫలితంగా పశ్చిమ బెంగాల్‌కు రూ.4700 కోట్లు తక్కువగా లభించనున్నాయి.
స్థానిక సంస్థలకు గ్రాంట్లు
16వ ఆర్థిక సంఘం వచ్చే ఐదేండ్లకు (2026-27 నుంచి 2030-31 వరకు) స్థానిక సంస్థల కోసం మొత్తం రూ.7.91 లక్షల కోట్ల గ్రాంట్లను సిఫారసు చేసింది. ఇందులో గ్రామీణ, స్థానిక సంస్థలకు (గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పంచాయతీలు) రూ.4.35 లక్షల కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.3.56 లక్షల కోట్లు కేటాయించారు. ఇక గ్రామీణ సంస్థలకు రాష్ట్రాల వారీగా చూస్తే… అసోంకు రూ.14,580 కోట్లు, కేరళకు రూ.3308 కోట్లు, తమిళనాడుకు రూ.16,930 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.28,203 కోట్లు దక్కనున్నాయి. పట్టణ సంస్థల విషయంలో అసోంకు రూ.3249 కోట్లు, కేరళకు రూ.16,683 కోట్లు, తమిళనాడుకు రూ.25,069 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.22,023 కోట్లు అందనున్నాయి. అదనంగా, ప్రత్యేక మౌలిక వసతుల గ్రాంట్ పొందనున్న 22 నగరాల జాబితాలో పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, తమిళనాడులోని కోయంబత్తూర్ ఎంపికయ్యాయి. అయితే ఈ నగరాలకు ఎంత నిధులు కేటాయిస్తారో ఇంకా స్పష్టత లేదు.
విపత్తు నిర్వహణ నిధులు
రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు నివారణ నిధి (ఎస్‌డీఎంఎఫ్) కోసం 2026-27 నుంచి 2030-31 వరకు రూ.2,04,401 కోట్ల మొత్తం నిధులను 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. రాష్ట్రాలవారీగా కేటాయింపులు చూస్తే… అసోంకు రూ.5825 కోట్లు, కేరళకు రూ.2580 కోట్లు, తమిళనాడుకు రూ.11,314 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.9158 కోట్లు పొందనున్నాయి.
రాబోయే ఎన్నికల ప్రాధాన్యం
ఈ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతం కలిపి లోక్‌సభలో 116 స్థానాలు, రాజ్యసభలో 51 స్థానాలు, శాసనసభల్లో మొత్తం 840 మంది సభ్యులను కలిగి ఉన్నాయి. ఈ 51 రాజ్యసభ స్థానాల్లో 13 స్థానాలు ఈ ఏడాది ఖాళీ కానున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ఇవి కీలకమైన ప్రాంతాలు. ప్రతిపక్ష పార్టీలకు తమ ప్రాంతీయ బలాన్ని కాపాడుకోవడం ప్రధాన సవాల్. అంతేకాదు.. వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలపై కూడా ఈ రాష్ట్రాల ఫలితాలు ప్రభావం చూపనున్నాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. పైన పేర్కొన్న ఆయా రాష్ట్రాలు, యూటీలలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర పన్నుల వాటాల పంపకాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయని వారు అంటున్నారు.
రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సందేశం
కేవలం నిధుల కేటాయింపులతోనే కాకుండా.. 16వ ఆర్థిక సంఘం కొన్ని రాష్ట్రాలకు స్పష్టమైన హెచ్చరికను కూడా పంపింది. పశ్చిమ బెంగాల్‌లో అమలవుతున్న ‘లక్ష్మీర్ భాండార్’ మహిళల నగదు బదిలీ పథకాన్ని ప్రస్తావిస్తూ… సబ్సిడీల వల్ల రాష్ట్ర ఆర్థిక భారం పెరుగుతోందని కమిషన్ సూచించింది. ”అవసరం లేని సబ్సిడీలు, షరతులు లేని నగదు బదిలీలకు ‘సన్‌సెట్ క్లాజ్’ (ముగింపు గడువు) ఉండాలి. సబ్సిడీలను తరచూ సమీక్షించే వ్యవస్థలను ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి” అని కమిషన్ పేర్కొన్నది.



