బూర్జువా వర్గానికి అత్యున్నతమైన దివ్యవాణి ఐ.ఎం.ఎఫ్. అటువంటి సంస్థే ఇండియా బడ్జెట్‌లో ప్రకటించిన జీడీపీ అంచనాలు నమ్మదగ్గవి కావని ప్రకటించింది. అటువంటప్పుడు బడ్జెట్ లో పేర్కొన్న వివిధ అంచనాలు, వృద్ధిరేటు సంఖ్యలు, జీడీపీ అంచనాలు వగైరాలన్నింటకీ పెద్దగా విలువ లేదు. నిజానికి, అనేక రకాల పన్నులను ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ప్రకటించింది. వాటి ద్వారా ప్రభుత్వానికి వచ్చే అదనపు ఆదాయం ఎంత ఉండనుంది? అన్నది గాని, లేకపోతే తగ్గిపోయే ఆదాయం ఎంత అన్నది గాని అంచనాల్లో ఇవ్వనేలేదు. అయినప్పటికీ, బడ్జెట్ అంకెల్ని బట్టి దాని వ్యూహం ఏ దిశగా ఉండబోతోంది అన్నది చెప్పవచ్చు. ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ ఉన్న స్థితిలో ఈ బడ్జెట్ వెనుక ఉన్న వ్యూహం పూర్తిగా కుటిలత్వంతో కూడుకుని వుంది. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొం టున్న అత్యంత ప్రధాన సమస్యలు ఇలా ఉన్నాయి: గత వందేళ్ల కాలంలో ఎన్నడూ చూడనంత తీవ్రస్థాయిలో దేశంలో ఆర్థిక అసమానతలు కొట్టవచ్చినట్టు పెరిగిపోయాయి.
ప్రణాళికా సంఘం తన తొలి సంవత్సరాల్లో పేదరికం ఉన్నట్టు నిర్ధారించడానికి ఎంపిక చేసిన ప్రమాణాల మేరకు (తలసరి ఆహారంలో ఎన్ని కేలరీల శక్తి కనీసం ఉండాలన్న ప్రమాణం) చూసినప్పుడు పూర్తి పేదరికంలోకి దిగజారిపోతున్నవారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దేశంలోని విద్యా వంతులైన యువజనుల్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగం చాలా తీవ్రస్థాయికి చేరింది. ఈ సమస్యలన్నింటికీ ఒక ఉమ్మడి పరిష్కారం ఉంది. సామాన్య ప్రజల కొనుగోలుశక్తిని భారీగా పెంచడమే ఆ పరిష్కారం. ద్రవ్యలోటు పెరగకుండా, ఈ విధంగా ప్రజల కొనుగోలుశక్తిని పెంచడానికి కావలసిన ధనాన్ని సమీకరించాలంటే సంపన్నుల మీద అదనంగా పన్నులు వేయడమే మార్గం. ఇలా సమీకరించిన ధనం ప్రజలకు అందిస్తే అప్పుడు దేశం మొత్తం మీద డిమాండ్ పెరుగుతుంది. ఎక్కువగా ఉపాధి కల్పనకు దారి తీసే వస్తూత్పత్తికి అది దోహదం చేస్తుంది. పేదరికం నుండి విముక్తి కూడా దొరుకుతుంది. ఆర్థిక అసమానతలు కూడా ఒకమేరకు తగ్గుతాయి.
సరిగ్గా దీనికి పూర్తి వ్యతిరేక దిశ తీసుకోవడంలోనే ఈ బడ్జెట్ కుటిలత్వం వెల్లడౌతోంది. జీడీపీలో పన్నుల ద్వారా లభించే ఆదాయం శాతం పెరగాల్సింది పోయి తగ్గుముఖం పట్టింది. 2023-24లో, 2024- 25లో ఇది11.5 శాతం ఉండేది. 2025-26 (సవరించిన అంచనాలు)లో 11.4కి తగ్గింది. 2026-27లో 11.2కి మరింత తగ్గింది. దీనికి తోడు ద్రవ్య లోటు 2024-25లో 4.8 శాతం, 2025-26 (సవరిం చిన అంచనాలు)లో 4.4 శాతం, 2026- 27లో 4.3 శాతం ఉంది. అందుచేత మొత్తం ప్రభుత్వ వ్యయం కుదించబడింది. అటు సంపన్నుల మీద పన్నులు పెంచడానికి కాని, ఇటు ద్రవ్యలోటును పెంచడానికి కాని ప్రభుత్వం సిద్ధం కాలేదు. అదే పెట్టుబడి వ్యయాన్ని చూస్తే 2024-25 లో అది జిడిపిలో 4.0 శాతం ఉండేది. 2025-26 (సవరించిన అంచనాలు)లో 3.9 శాతంగా ఉంది. 2026-27కి అది 4.4 శాతానికి పెరిగింది.
అయితే ఈ పెట్టుబడి వ్యయం పెరుగుదల కూడా ఒక భ్రమే. కేంద్ర ప్రభుత్వం స్వయంగా చేపట్టే పెట్టుబడి వ్యయం 2023-24లో, 2024-25లో 3.2 శాతం, 2025-26 (సవరించిన అంచనాలు) లో 3.1 శాతం ఉంటే ఇప్పుడు 2026-27 లో కూడా 3.1 శాతమే ఉండనుంది. మరి పెరగనున్నది ఏమిటి? పెట్టుబడి ఆస్తులు (కాపిటల్ ఎసెట్స్) పెంచుకో డానికి సహాయంగా ఇచ్చే గ్రాంట్-ఇన్-ఎయిడ్ 0.8 శాతం నుండి 2026-27లో 1.3 శాతానికి పెరగనుంది. అయితే ఇందులో ఉపాధి హామీ పథకం కింద ఇచ్చేది కూడా కలిసి వుంది. ఇప్పుడు ఆ పథకం కింద చేసే ఖర్చులో రాష్ట్రాల వాటా పెరిగింది. గతంలో కేంద్రం వాటా 90, రాష్ట్రాల వాటా 10 శాతం గా ఉండేది. ఇప్పుడు అది 60:40గా మారింది. ఇందులో రాష్ట్రాలు గనుక తమ వంతు ఖర్చుకు కావలసిన నిధులను సమీకరించుకోలేకపోతే అప్పుడు కేంద్రం తన వంతు ఖర్చు చేయనక్కర లేదు.
ఇప్పటికే నిధుల లేమితో తిప్పలు పడుతున్న రాష్ట్రాలు ఏ మేరకు పెరిగిన ఈ అదనపు భారాన్ని మోయగలవన్నది ప్రశ్నార్ధకమే. పైగా అనుకున్న విధంగా ఈ ఉపాధిహామీ పథకం కింద నిధులు ఖర్చు కాకపోడానికి బాధ్యతను రాష్ట్రాల పైకి కేంద్రం నెట్టివేసి తప్పించుకోవచ్చు. పోనీ ఈ విధంగా 90:10 నిష్పత్తిని 60:40గా మార్చేటప్పుడు రాష్ట్రాలను ఆ నిర్ణయంలో భాగస్వాముల్ని చేసిందా అంటే కేంద్రం ఆపని చేయనేలేదు. కాని వైఫల్యానికి మాత్రం ఆ రాష్ట్రాల్నే బాధ్యులుగా చేయబోతోంది. ”సహకార సమాఖ్యతత్వం” అంటే అర్థం ఇదేనేమో మరి! కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల వనరుల విషయంలో, వాటి బాధ్యతల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసేసుకుంటూ, కొన్ని రాష్ట్రాలపట్ల పక్షపాతాన్ని ప్రదర్శిస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది. కేంద్రం పక్షపాతాన్ని చూపించేది బీజేపీ- పాలిత రాష్ట్రాలకు అనుకూలంగానని వేరే చెప్పనక్కరలేదు. బీజేపీ-యేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల పని తీరు సక్రమంగా లేదంటూ వాటికి నిధుల కోత పెడుతోంది. వై.వి.రెడ్డి అధ్యక్షతన నడిచిన 14వ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాల వాటాను 2020 నాటికల్లా 32 నుండి 42 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది.
కాని కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచడానికి సిద్ధపడ లేదు. ఒకవేళ పెంచితే అందులో రాష్ట్రాలకు వాటా పంచవలసి వుంటుంది. దానికి బదులు సెస్‌లు, సర్‌చార్జిలు విధించడానికి పూనుకుంది. వాటిని రాష్ట్రాలతో పంచుకోవాలన్న నియమం లేదు. అందుకే రాష్ట్రాలకు ఎగనామం పెట్టడానికి ఈ ఎత్తుగడ పన్నింది. మొత్తం కలిపి చూస్తే ఇప్పుడు పన్నులు, సెస్‌లు, సర్‌చార్జిలు వసూలైన దానిలో రాష్ట్రాల వాటా 34 శాతానికి మించి లేదు. ఆ విధంగా ఆర్థిక వనరుల కేంద్రీకరణ పెరిగింది. ఇలా మోసపూరితంగా వ్యవహరించినా, కేంద్రం చేసే వ్యయం పెరుగుతోందాంటే అదీ లేదు. అది స్థిరంగానే ఉంది తప్ప పెరగడం లేదు. ఈ సారి గ్రాంట్-ఇన్ ఎయిడ్‌గా రాష్ట్రాలకు ఇచ్చేది ఉపాధి హామీ పథకంలోని మార్పుల కారణంగా బడ్జెట్‌లో చూపించిన మేరకు పెరగకపోవచ్చు. అదే జరిగితే ఈ ఏడాదీ ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల ఉండబోదు. ఆ విధంగా ఈ బడ్జెట్ మన దేశ ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న మూడు ప్రధాన సమస్యలకూ పరిష్కారం చూపగల శక్తిని ప్రదర్శించలేదు.
మొత్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వ వ్యయం ఉపాధి కల్పనకు దోహదం చేసేదిగా లేదు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఖర్చు చేసే బదులు, భవనాలు నిర్మించడానికి ఖర్చు చేస్తే ఉపాధి పెరుగుదలకు అది ఎలా తోడ్పడుతుంది? ప్రభుత్వ వైద్య వ్యవస్థలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఖర్చుచేస్తే అటువంటి ప్రత్యక్ష ఉపాధి కల్పన వలన ఆర్థిక వ్యవస్థలో బహుళ దొంతరల్లో వృద్ధి నమోదయ్యే వీలుంటుంది. కాని బడ్జెట్‌లో ప్రతిపాదనలు నిరుద్యోగాన్ని అరికట్టే దిశగా లేవు. పైగా పెంచే దిశగా ఉన్నాయి. ప్రయివేటు రంగానికి పన్ను రాయితీలు పెంచారు. ఇక పెట్టుబడులను ఆకర్షించే పేరుతో బహుళ జాతి కంపెనీలకు సైతం రాయితీలు కల్పించారు. మరోపక్క ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన కోసం కాకుండా మౌలిక వసతుల కల్పన కు కేటాయింపులు పెంచారు. ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పనకు కేటాయించి వుంటే, ప్రజలకు నేరుగా బదలాయించి వుంటే దాని ప్రభావం వేరేగా ఉంటుంది.
ప్రయివేటు రంగానికి ఎన్ని రాయితీలు ఇచ్చినా అక్కడి నుంచి పెట్టుబడులు పెరగవని, మార్కెట్‌లో డిమాండ్ పెరిగినప్పుడే ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని ఈ ప్రభుత్వానికి తెలిసినట్టు లేదు. గత బడ్జెట్లలో కూడా ఇదే విధంగా పన్ను రాయితీలు ప్రయివేటు రంగానికి కల్పిం చారు. 2019లో అయితే భారీగా రాయితీలు ఇచ్చారు. కాని పెట్టుబడులు మాత్రం మందకొడిగానే ఉంటూ వచ్చాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తంగానే మందగించింది. దానితోబాటు పెట్టుబడులు కూడా మందగించాయి. ఇటువంటి సమయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశంలోకి ప్రవహించేస్తాయని, అందుకే బహుళజాతి సంస్థలకు పన్నులు తగ్గించేస్తాం అని చెప్పడం బొత్తిగా అర్ధం లేనిది. పైగా ఒకపక్క తన దేశం నుండి పెట్టుబడులు బయటకు పోకుండా నిరోధించడానికి ట్రంప్ సుంకాలను తెగ పెంచేస్తున్న సమయంలో ఈ వాదన ఏమాత్రమూ చెల్లేది కాదు.
ఇక ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారబోతోంది. ఇప్పుడు తలా ఐదు కిలోల చొప్పున పేదలకు ఉచితంగా ప్రతి నెలా ఇస్తున్న ఆహార ధాన్యాన్ని 2027లో నిలిపివేయనున్నట్టు ప్రకటించారు. గ్రామీణ ప్రాంత పేదలకు ప్రస్తుతం ఈ ఉచిత పథకం ప్రాణాధారంగా ఉంది. దానిని గనుక నిలిపేస్తే అది వారికి మరింత లోతుగా కష్టాల్లోకి నెడుతుంది. రెండవది అమెరికాతో సహా వివిధ దేశాలతో చేసిన వాణిజ్య ఒప్పందాల విషయం. ముఖ్యంగా అమెరికాతో చేసిన ఒప్పందం ప్రకారం (వస్తున్న వార్తలను బట్టి) భారతీయ సరుకులమీద అమెరికా పద్దెనిమిది శాతం సుంకం వేస్తుంది. కాని అమెరికా నుండి వచ్చే వస్తువుల మీద మన దేశం ఏ పన్నూ విధించదు. ఇటువంటి అసమాన వాణిజ్య ఒప్పందం మన భారతీయ రైతులకు ఎనలేని కష్టాలను కలిగించనుంది. ఇది ముఖ్యంగా పాడి రంగం మీద ప్రభావం చూపనుంది. కాని ఫాసిస్టు లక్షణం ఉన్న ఏ ప్రభుత్వమైనా ప్రజల సమస్యల పట్ల ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తుంది తప్ప వాటి పరిష్కారం గురించి ఏమాత్రమూ ఆలోచించదు.
1930ల నాటి ఫాసిజానికి, నేటి ఫాసిజానికి తేడా ఏమిటో ఈ బడ్జెట్ తెలియజేస్తుంది. 1930లలో ఫాసిస్టు దేశాలలో బడ్జెట్లలో లోటు భారీగా పెంచి సైనిక వ్యయాన్ని బాగా పెంచారు. దానివలన ఆ దేశాలలో స్థూల డిమాండ్ బాగా పెరిగింది. దానివలన ఆ దేశాలు మహా మాంద్యం నుండి బయటపడ్డాయి. ఆ సైనిక వ్యయంలో భాగంగా కేవలం యుద్ధ పరికరాలకు, వాహనాలకు, ఆయుధాలకు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున సైనికులను కూడా నియమించారు. అది నేరుగా ఉపాధి అవకాశాలను పెంచింది. కాని ప్రస్తుతం ఉన్న ఫాసిస్టు ప్రభుత్వాలు, మన బీజేపీ ప్రభుత్వం వంటివి, ద్రవ్యలోటునూ పెంచడం లేదు, ప్రత్యక్ష ఉపాధి అవకాశాలనూ పెంచడం లేదు. ప్రజలకు నేరుగా ఆర్థిక తోడ్పాటునూ అందించడం లేదు. వాళ్లు రాబోయే కాలంలో పెంచేది ఏమైనా ఉందీ అంటే అది ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రచారాన్ని మాత్రమే.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్



