Tuesday, February 10, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినవ్విపోదురుగాక..!

నవ్విపోదురుగాక..!

- Advertisement -

భారతరత్న.. ఇది దేశ ప్రతిష్టాత్మక అవార్డు. స్వాతంత్య్ర పోరాటానికి, ప్రజాస్వామ్య విలువలకు, సమానత్వానికి తమ జీవితాన్ని అంకితం చేసిన మహనీయులకు అందించే గొప్ప గౌరవం. అలాంటి ప్రాధాన్యతగల అవార్డును తమ రాజకీయ అజెండాకు తగినట్టు మలచుకోవడం సిగ్గుచేటయిన విషయం. మహారాష్ట్రలోని ముంబైలో ఆదివారం నిర్వహించిన సంఘ్‌- శతాబ్ది ఉత్సవాల్లో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు ‘పరివారం’ ప్రమాదకర ఆలోచనలకు అద్దంపట్టే ధోరణికి సంకేతాలు. ‘సావర్కర్‌కు భారతరత్న ఇస్తే, దాని ప్రతిష్ట పెరుగుతుందని’ చెప్పడం స్వాతంత్రోద్యమ చరిత్రను తిరగరాయలన్న ఆరెస్సెస్‌ ప్రాజెక్టులో ఓ భాగం! అంతేకాదు, హిందూ అనే పదం పురాణాల్లో లేదని, విదేశాల నుంచి వచ్చిందని ఆలస్యంగానైనా వ్యక్తపరచడం, దీనివెనుక ‘మతలబు’ కూడా గ్రహించాల్సిన అంశం. ఎందు కంటే, భగవత్‌ చెప్పిన మాటలు అను కోకుండా వచ్చినవి కాదు, సంఘ్‌ రాజకీయ వ్యూహంలో రూపుదిద్దుకున్న అభిప్రాయాలు!

ఈ దేశపు లౌకికవనంలో విద్వేషపు కలుపు సావర్కర్‌. బ్రిటీష్‌ పాలకులకు ఆయన రాసిన క్షమాపణ పత్రం స్వాతంత్య్రం కోసం మడమ తిప్పక పోరాడినవారి ఆశయాలకు విరుద్ధం. జైలులో ఉండి కూడా పోరాటాన్ని కొన సాగించిన విప్లవకారులు, జాతీయ నాయకులతో పోల్చినప్పుడు ఆయన రాజకీయ వైఖరి, ‘సర్దుబాటు, సహకారం’ వైపే మొగ్గింది. ‘నన్ను విడిచి పెట్టండి.. యువతను జాతీయోద్యమంలోకి రాకుండా చూస్తాను’ అని ‘తెల్ల దొరలకు’ బానిసగా మారినవాడు.గాంధీ, నెహ్రూ, అంబేద్కర్‌ వంటి నేతలు దేశాన్ని పౌరసత్వం, సమానత్వం, లౌకికతత్వంపై నిర్మించాలని కోరితే, సవార్కర్‌ దృష్టి ‘సాంస్కృతిక ఏకత్వం’ పేరుతో మతాధిత్యంవైపు వెళ్లింది. ఇలాంటి నాయకునికి భారతరత్న కట్టబెట్టే ఆలోచనను సంఘ్‌ చేస్తుందంటేనే ‘మరోకుట్ర’కు తెరదీసిందని అర్థం!
బ్రిటీష్‌వారితో ‘రాజీ’పడి ప్రజల్లో విభజన సృష్టించిన వ్యక్తిని భగవత్‌ ‘ఆ స్థాయికి’ ఎత్తడం, పైగా ఆయనకు అవార్డు ఇవ్వడం వల్ల దాని ప్రతిష్ట పెరుగుతుందని చెప్పడం ఆ..ఆలోచనల వెనుక దాగిన ‘ఆరెస్సెస్‌ ఎజెండా’ ఏమిటో స్పష్టం. ఇది త్యాగాన్ని కాదు, విధేయతను దేశభక్తిగా నిర్వచిస్తోంది. అధికారాన్ని ఎదిరించడం, పోరాడటం దేశద్రోహంగా చిత్రిస్తోంది. పాలకులకు దాసోహపడటం దేశసేవగా ప్రజల మనసుల్లో నాటుతోంది.

నేడు భారతరత్న చర్చను తీసుకు రావడం కూడా యాదృచ్ఛికమేమి కాదు. స్వాతంత్య్ర పోరాట చరిత్రను చిన్నగా చేయడం, గాంధీహత్య వంటి సంఘటనల చుట్టూ ఉన్న భావజాల బాధ్యతను పక్కకు నెట్టడం, హిందుత్వాన్ని ‘జాతీయత’గా మలచడం, ఇవన్నీ.. ఒకేశ్రేణిలో కనిపించే దృశ్యాలు. అసలు ఏ అర్హత ప్రాతిపదికన సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్నది కూడా ప్రశ్నే. ఇప్పటివరకు ఈ అవార్డు పొందినవారు కేవలం గొప్పవ్యక్తులే కాదు, వారు దేశానికి దశ, దిశ చూపినవారు. శాస్త్రీయ విజ్ఞానం, ప్రజాసేవ కోసం పాటుపడిన వారు. ప్రజల్లో రగులుతున్న స్వాతంత్య్రపు బలమైన కాంక్షను ఉద్యమంగా మళ్లించినవారు, సామాజిక న్యాయానికి పోరాడినవారు. ఎన్నో ఏండ్లపాటు జైలుశిక్షలు అనుభవించినవారు.

నేటికీ ప్రజల గుండెల్లో వీరులెవరైనా ఉన్నారంటే ఉరికొయ్యను ముద్దాడిన భగత్‌సింగ్‌, యువతశక్తి నిర్వీర్యం కాకుండా స్వాతంత్య్ర ప్రేరణకు ఉపయోగించిన నేతాజీ, ఇంకా చరిత్రలో ఎంతోమంది. అందుకే ఒక్కసారి మనం కొన్ని విషయాలను గుర్తుతెచ్చుకోవాలి. భగత్‌సింగ్‌ జైలులో ఉన్నప్పుడు తండ్రి తీసుకొచ్చిన క్షమాపణ లేఖను చూసి భగత్‌సింగ్‌ అన్న మాటలు నేటికీ దేశం కళ్లముందు సాక్షాత్కరిస్తూనే ఉంటాయి. ”బానిసత్వంలో బతకడం కన్నా, స్వేచ్ఛ కోసం చావడమే గౌరవం” అది ఒకమాట కాదు, ఒక చైతన్యపు గర్జన. అదే సావర్కర్‌ మాత్రం బ్రిటీష్‌ పాలకులకు క్షమాపణలు రాసి, ‘విదేయత హామీ’లతో బయటపడ్డాడు. ఒకరేమో జైలును విప్లవ పాఠశాలగా మార్చుకుంటే, మరొకరు ఏకంగా దేశ ఆత్మగౌరవాన్నే తాకట్టు పెట్టాడు. నిజమైన పోరాటవీరులో ఇక్కడే తెలుస్తోంది.

భారతరత్న గౌరవం ఎవరికి దక్కాలి? ప్రజల్ని ఏకం చేసిన సమానత్వపు సిద్ధాంతానికా? విభజనకు దారి తీసిన భావజాలానికా? భగవత్‌ మాటల వెనుక ఉన్నదంతా కూడా అధికారానికి ఎదురు తిరగకుండా ఉండే బానిస విధానం. ప్రశ్నించేతత్వాన్ని ప్రమాదకరంగా, తిరుగుబాటును అప్రయోజనంగా, యువతను నిరసనల నుంచి దూరం చేయడం, ఇది రాజకీయ లొంగుబాటులోని ఆరెస్సెస్‌ క్రమం. భగవత్‌ వ్యాఖ్యలు రానురానూ ‘దేశభక్తి’ చర్చను ముందుకు తెచ్చి ప్రజాగ్రహాన్ని మళ్లించడం. అందుకే, ఈ అవార్డు విలువల కేంద్రంగా కాకుండా, రాజకీయ ‘ఆయుధం’గా మారితే గనుక, స్వాతంత్య్ర పోరాట చరిత్రకు ఇంతకన్నా వేరే ద్రోహమేమి ఉండదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -