ఎంపీలతో ఆయన ప్రాణాలకు ముప్పు వార్తల్లో నిజం లేదు : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఆర్మీ మాజీ చీఫ్ నరవాణే రాసిన పుస్తకం అంశంలో భయపడడం వల్లే ప్రధాని మోడీ లోక్సభకు రావడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే ఆ తీర్మానాన్ని సభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఎంపీల వల్ల ప్రధాని ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదనీ, ఎవరైనా మోడీని బెదిరిస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ అన్నారు. గడిచిన గురువారం కొందరు మహిళా ఎంపీలు లోక్సభలో ఆందోళన చేపట్టడంతో మోడీ తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.అమెరికా వాణిజ్య ఒప్పందం అంశంలో భయపడుతున్న ప్రభుత్వం.. బడ్జెట్లో చర్చ చేపట్టేందుకు వణుకుతోందని రాహుల్ విమర్శించారు. ఆ వాణిజ్య ఒప్పందం కుదిరిన తీరు, దానితో రైతులకు ఎదురుకానున్న సమస్యలను చెప్పేందుకు ప్రభుత్వం జంకుతోందన్నారు.
మోడీని బెదిరించేందుకు సభ్యులు ప్లాన్ చేశారన్న ఊహాగానాలు చాలా ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని, అలాంటిదేమీ లేదని చెప్పారు. సభ్యుల వల్ల కాదు.. తాను చెప్పబోయే నిజాన్ని తట్టుకోలేక, భయంతో ప్రధాని సభకు రావడం లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ సభ్యులు ప్రధానిని అటాక్ చేసే ప్రశ్నే లేదని, ఆయన ధైర్యంగా సభకు రావాలని చెప్పారు. ఎవరైనా దాడి చేస్తారన్న సమాచారముంటే, ఆ వ్యక్తిని అరెస్టు చేయాలని, మీరెందుకు అలా చేయడం లేదని రాహుల్ అన్నారు. ఆర్మీ మాజీ చీఫ్ నరవాణే రాసిన పుస్తకం పట్ల మోడీకి భయం ఉన్నట్టు తెలిపారు. నరవాణే పుస్తకాన్ని పబ్లిష్ చేయలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారనీ, కానీ తమ వద్ద ఆ బుక్ కాపీ ఉన్నట్టు రాహుల్ గాంధీ వెల్లడించారు.



