తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాల ఆలోచన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేందుకు పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94సీ కింద ఈ నోటీసు ఇవ్వనున్నాయి. ఈ నోటీసుకు 20 రోజుల గ్రేస్ పీరియడ్ అవసరం కాబట్టి, బడ్జెట్ సమావేశాల రెండో దశలో దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సోమవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో జరిగిన ప్రతిపక్ష పార్టీ నాయకుల సమావేశంలో స్పీకర్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, సీపీఐ(ఎం), డీఎంకే, టీఎంసీ, ఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), శివసేన (ఉద్ధవ్ వర్గం) సహా వామపక్షాలు హాజరయ్యాయి.
స్పీకర్‌ను తొలగించడానికి 100 మంది ఎంపీలు సంతకం చేసిన తీర్మానం అవసరం. సభ ఈ తీర్మానాన్ని ఓటు ద్వారా ఆమోదిస్తే, స్పీకర్‌ను తొలగిస్తారు. ఇప్పటివరకు ఈ విధంగా ఏ స్పీకర్‌నూ తొలగించలేదు. ప్రతిపక్ష తీర్మానం ఈ కింది అంశాలను లేవనెత్తే అవకాశం ఉంది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడటానికి అనుమతించకపోవడం, ప్రతిపక్ష మహిళా ఎంపీలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం, ఇందిరా గాంధీతో సహా నెహ్రూ కుటుంబ సభ్యులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడానికి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేకు అనుమతి ఇవ్వడం, సీపీఐ(ఎం) ఎంపీ ఎస్ వెంకటేశ్ సహా ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం. గత ఆగస్టులో రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్‌ఖర్‌పై ప్రతిపక్ష పార్టీలు తీర్మానం ప్రవేశపెట్టాయి, కానీ సాంకేతిక కారణాలను చూపుతూ దానిని తిరస్కరించిన విషయం విదితమే.



