Tuesday, February 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం16 నుంచి బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు

16 నుంచి బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు

- Advertisement -

ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో 23 వరకు నిర్వహణ
సవరణ షెడ్యూల్‌ విడుదల

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర బడ్జెట్‌ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సన్నాహక సమావేశాలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా సోమవారం సమావేశాల సవరణ షెడ్యూల్‌ను విడుదల చేశారు. గతేడాది డిసెంబర్‌ 23 నుంచి ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో శాఖల వారీగా ఆన్‌లైన్‌లో బడ్జెట్‌ ప్రతిపాదనలను సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భౌతికంగా ఈనెల 16 నుంచి శాఖల వారీగా ఆర్థిక శాఖ సన్నాహక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సమావేశాలు సచివాలయంలో జరుగుతాయి. ఆయా శాఖల మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, ఆయా శాఖల విభాగాధిపతులతో ఈనెల 23 వరకు ఈ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది.

ఈనెల 16న మొదటి సమావేశం ఉదయం ఎస్సీ,ఎస్టీ, వికలాంగుల సంక్షేమం, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో మధ్యాహ్నం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో, సాయంత్రం మైనార్టీ సంక్షేమం, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ మంత్రి అజహరుద్దీన్‌తో ఉంటుంది. అదేనెల 17న ఉయదం వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, హ్యాండ్లూమ్‌, టెక్స్‌టైల్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో, మధ్యాహ్నం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డి అనసూయ సీతక్కతో, సాయంత్రం ఆర్‌ అండ్‌ బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సమావేశం ఉంటుంది. 18న ఉదయం రెవెన్యూ, హౌజింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో, మధ్యాహ్నం నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో, సాయంత్రం పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో సమావేశముంటుంది.

19న ఉదయం ఎక్సైజ్‌, పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో, మధ్యాహ్నం కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామితో, సాయంత్రం పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో సమావేశం ఉంటుంది. 20న ఉదయం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో, మధ్యాహ్నం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈనెల 21న ఉదయం విద్యారంగం, మధ్యాహ్నం హోం శాఖ, సాయంత్రం న్యాయ శాఖతోపాటు, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమావేశముంటుంది. 23న మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ, మధ్యాహ్నం సాధారణ పరిపాలన శాఖతోపాటు సాయంత్రం ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్‌ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -