ఎవరి ఓట్లు చీలుస్తారోనని బెంబేలు
1115 వార్డుల్లో ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం
బరిలో ఏఐఎఫ్‌బి, జనసేన, ఎంఐఎం, బీఎస్‌పీ వంటి పార్టీలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఘట్టం ముగిసింది. క్షేత్రస్థాయిలో ఓటర్లు ఏ పార్టీ వైపు ఆసక్తి చూపుతున్నారనే దానిపై రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. వరుసగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, గత మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, వార్డులు, తాజా మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితేంటని పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. గెలుపుపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతల్లో ఎవరి ధీమా వారికున్నా…ఆలిండియా పార్వర్డ్ బ్లాక్, జనసేన, ఎంఐఎం, బీఎస్సీలు ఆ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఆ పార్టీల నుంచి పోటీ ఎదుర్కొంటున్నాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీలు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు నిద్ర లేకుండా చేశాయి.
ముఖ్యంగా ఆ మూడు పార్టీల్లో టికెట్ దక్కని వారు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వారు ఆ నాలుగు పార్టీల నుంచి టికెట్ సంపాదించారు. వారు అధికార, ప్రతిపక్ష పార్టీల ఓట్లను చీల్చుతారన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడుకు ఎంఐఎం, బీఎస్పీ చెక్ పెడతాయనే టెన్షన్ పట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గర ఉన్న ఎంఐఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 282, బీఎస్పీ 213 వార్డుల్లో పోటీ చేస్తున్నది. ముస్లింలు అత్యధికంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వాతావరణం ఉంటుంది. ఆ వార్డుల్లో గాలిపటం ఓట్లు చీల్చడం వల్ల కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఎంఐఎం పోటీ చేయడం వల్లే బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందన్న చర్చ కూడా జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాలను నమ్ముకుంది. అదేవిధంగా గులాబీ కారుకు ఆలిండియా పార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) 288 వార్డుల్లో బ్రేకులు వేస్తుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. దీనంతటికి కారణం ఆ పార్టీ వెనకాల తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఉన్నారు. ఇప్పటికే అంతర్గత సంఘర్షణలో ఉన్న గులాబీ దళానికి సింహం గుర్తు అడ్డంగా నిలబడిందనే విశ్లేషణలున్నాయి. ఇప్పటికే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ద్వితీయస్థానానికి పడిపోయిన కారు…మున్సిపల్ ఎన్నికల్లోనూ ద్వితీయ స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలే లక్ష్యంగా కల్వకుంట్ల కవిత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అయితే ఆమె ఫోకసంతా బీఆర్‌ఎస్‌పైన్నే ఎక్కువగా ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీ విజ్ఞప్తిని పెడచెవిన పెట్టిన జనసేన
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన…తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తమకు సహకరిస్తుందని బీజేపీ నేతలు కలలు కన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పవన్ కళ్యాణ్‌తో సమావేశమైంది. తర్వాత బీజేపీకి జనసేన సహకారం ఉంటుందని కథనాలు వెల్లువెత్తాయి. కానీ సీన్ రివర్సయింది. బీజేపీ 2634 వార్డుల్లో పోటీ చేస్తుండగా, జనసేన 332 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దించి బీజేపీకి షాకిచ్చింది. అంతేకాకుండా ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వస్తారన్న మీడియా ప్రచారం కూడా కమలానాధుల్లో కొత్త ఆశలు రేకెెత్తించింది.
కానీ, అలాంటి ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ కొట్టిపారేశారు. పైకి మాత్రం ఏ పార్టీతోనూ బీజేపీకి పొత్తు ఉండదంటూ చెబుతూ వచ్చింది. అంతర్గతంగా మాత్రం జనసేన సహాయాన్ని ఆర్జించినట్టు తెలిసింది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలపై మూడు పార్టీలు ఎక్కువగా దృష్టి సారించాయి. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండటటంతో ముఖ్యమంత్రి కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలపై ఫోకస్ చేశారు. ఫలితాలు ఎలా ఉండబోతాయో ఈనెల 13 వరకు వేచిచూడాల్సిందే.
చిన్న పార్టీలతో చిక్కులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



