ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి భారత్
పప్పుధాన్యాలు ఉత్పత్తిలో ఇంకా వెనుకబాటే
టాటా- కార్నెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ డైరెక్టర్ ప్రభు ఎల్ పింగళి
ఘనంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మెగా స్నాతకోత్సవం
నవతెలంగాణ-రాజేంద్రనగర్
1960లో ఆహార కొరత ఎదుర్కొన్న భారతదేశం హరిత విప్లవంతో నేడు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని టాటా-కార్నెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ డైరెక్టర్, అంతర్జాతీయ వ్యవసాయ నిపుణులు ప్రభు ఎల్ పింగళి అన్నారు. పప్పుధాన్యాలు, తృణధాన్యాల ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామన్నారు. దాంతో ప్రజలలో పోష్టికాహార లోపం ఉందన్నారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో జరిగింది. వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రభు పింగళికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతిభాశాలి జానయ్య నేతృత్వంలో విశ్వవిద్యాలయం మంచి ప్రగతి సాధిస్తోందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రజల ఆహార అలవాట్లలో అనేక మార్పులు వచ్చాయని, పాశ్చాత్యుల ఆహారపు అలవాట్లు మన వారికీ అలవడుతున్నాయని వివరించారు. అధునాతన టెక్నాలజీలు, డిజిటల్ విధానాలను, విస్తరణ సేవలను సన్న, చిన్నకారు రైతాంగానికి అందుబాటులోకి తేవాలన్నారు. వినియోగదారుల ఆహారపు అలవాట్లకు అనుగుణంగానూ, ప్రజలకు పౌష్టికాహార భద్రత అందించే విధంగానూ ప్రణాళికలు ఉండాలన్నారు. వీసీ అల్దాస్ జానయ్య స్నాతకోత్సవ నివేదికను సమర్పించారు. బోధన, పరిశోధన, విస్తరణ అంశాలలో విశ్వవిద్యాలయం అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. తొలిసారిగా వ్యవసాయ కూలీల పిల్లలకు యూజీ కోర్సుల్లో 15 శాతం సీట్లు ప్రత్యేకంగా కేటాయించామన్నారు. అలాగే ప్రత్యేక కోటా సీట్ల ఫీజును రూ.10 లక్షల నుంచి రూ.5 లక్షలకు తగ్గించినట్టు తెలిపారు.
నూతనంగా కొడంగల్, నిజామాబాద్, హుజూర్‌నగర్‌లలో వ్యవసాయ కళాశాలలను ప్రారంభించామన్నారు. విశ్వ విద్యాలయం ర్యాంక్ 37 నుంచి 24కు పెరిగిందని ప్రకటించారు. ఈ స్నాతకోత్సవంలో 2135 మంది అండర్ గ్రాడ్యుయేట్స్‌కు, 480 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌కు, 129 మందికి పీహెచ్డీ పట్టాలు అందచేశారు. అదే విధంగా ఆరుగురు పీహెచ్డీ అభ్యర్థులకు, 26 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌కు, 64 మంది అండర్ గ్రాడ్యుయేట్స్‌కు బంగారు పతకాలు అందచేశారు. 56వ స్నాతకోత్సవానికి సంబంధించి బీటెక్(అగ్రికల్చరల్ ఇంజినీరింగ్) విద్యార్థిని గన్నేరపు నవ్య ఆరు బంగారు పతకాలు సాధించారు. 58వ స్నాతకోత్సవానికి సంబంధించి బీటెక్(అగ్రికల్చరల్ ఇంజినీరింగ్) విద్యార్థిని స్నేహలత ఏడు బంగారు పతకాలను సాధించారు. బీఎస్సీ(అగ్రికల్చర్) విద్యార్థిని మారం సంజన 5 బంగారు పతకాలు సాధించారు.



