Tuesday, February 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకబ్జాల చెర నుంచి పార్క్‌కు విముక్తి

కబ్జాల చెర నుంచి పార్క్‌కు విముక్తి

- Advertisement -

రూ. 60 కోట్ల విలువైన 3 వేల గజాల పార్కును కాపాడిన హైడ్రా
నవతెలంగాణ-సిటీబ్యూరో

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, నార్సింగ్‌ విలేజ్‌, ఆరుణోదయ హౌసింగ్‌ సొసైటీలోని పార్కుకు కబ్జాల చెర నుంచి సోమవారం హైడ్రా విముక్తి కల్పించింది. అరుణోదయ కాలనీ హుడా అనుమతి పొందిన లే ఔట్‌లో 6078 గజాలు పార్కు కోసం కేటాయించారు. ఈ పార్కు స్థలంపై స్థానికంగా ఉన్న వారి కన్ను పడింది. ఇప్పటికే 3 వేల గజాల వరకూ అక్రమ నిర్మాణాలు వచ్చేశాయి. మిగిలిన 3 వేల గజాల పార్కు స్థలంలోనూ 1600 గజాలను స్థానికంగా ఉన్న వ్యక్తి కబ్జా చేశారు. ప్రీకాస్ట్‌ ప్రహరీ నిర్మించి.. అందులో షెడ్డూ వేశారు. ఈ 1600 గజాల ఆక్రమణలపై గతంలో నార్సింగ్‌ మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకున్నారు. నిర్మాణాలను తొలగించారు. అయినా కబ్జాలు ఆగలేదు.

నార్సింగి మున్సిపాలిటీ ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో కలవడం.. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఇదే అదనుగా మళ్లీ 1600 గజాలను తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. చుట్టూ ప్రీకాస్ట్‌ ప్రహరీ నిర్మించి.. లోపల తాత్కాలిక షెడ్డులు కూడా నిర్మించాడు. దాంతో కబ్జా పూర్వాపరాలను వివరిస్తూ స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఆదేశాలమేరకు హైడ్రా అధికారులు రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కు స్థలంగానే నిర్ధారించుకున్నారు. మొత్తం పార్కు స్థలం 6078 గజాలు కాగా.. 3వేల గజాల వరకూ అక్రమ కట్టడాలు వచ్చేశాయి. మిగిలిన 3వేల గజాలను హైడ్రా సోమవారం కాపాడింది. పార్కు హద్దులను నిర్ధారిస్తూ చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌ వేసింది. అలాగే పార్కు కోసం కేటాయించిన స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -