తెలంగాణకు నిధుల్లో కోత ఫెడరలిజంపై దాడే
సొమ్ములు మావి… గొప్పలు మీవా?
రాష్ట్రం నుంచి కేంద్రానికి పోతున్నది రూ.1,33,208 కోట్లు
కేంద్రం ఇస్తున్నది రూ.51 వేల కోట్లే
ప్రతిసారీ కేంద్ర మంత్రులు మేమిచ్చాం..
తెచ్చాం అనటం దుర్మార్గం
అది ముమ్మాటికీ ప్రజల సొమ్మే : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశానికి అధిక ఆదాయాన్ని సమకూర్చుతున్న దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నదనీ, రాజకీయ ఉద్దేశంతో తెలంగాణపై ఆర్థిక వివక్ష చూపుతున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
దేశ ఆదాయానికి దక్షిణాది వెన్నెముక…
2018-19 నుంచి 2022-23 వరకు ఐదేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం పన్నులు రూ.90.80 లక్షల కోట్లు అయితే, ఇందులో దక్షిణాది రాష్ట్రాల నుంచే రూ. 22.86 లక్షల కోట్లు(పావొంతు వరకు) ఉన్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు తిరిగి కేంద్రం ఇచ్చింది 16.3 మాత్రమేనని గణాంకాలే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు రూపాయికి సగటున 30 పైసలు ఇస్తూ అదే సమయంలో బీహార్, ఉత్తరప్రదేశ్‌లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు రూ.1కి రూ.4 చొప్పున ఇవ్వడమేంటి? ఇది ఆర్థిక అసమతుల్యతను పెంచడం కాదా? అని నిలదీశారు. ఇది ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలను సృష్టించే ప్రమాదకర ధోరణి అని హెచ్చరించారు.
తెలంగాణ గణాంకాలే సాక్ష్యం….
పార్లమెంట్ సమావేశాల్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2024-25లో తెలంగాణ రాష్ట్రం నుంచి 1,33,208 కోట్ల పన్నులు వసూలైతే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి కేంద్ర పన్నుల రూపంలో రూ.27,050 కోట్లు, కేంద్ర గ్రాంట్ల రూపంలో రూ.7,913 కోట్లు, కేంద్ర ప్రాయోజిక పథకాల రూపంలో రూ.16,762 కోట్లు మొత్తంగా రూ.51,725 కోట్లు విడుదల చేసినట్టు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారని గుర్తుచేశారు. పథకాల రూపంలో వచ్చే నిధులను కూడా కలిపితేనే ఈ మొత్తం వస్తోందని తెలిపారు. జీఎస్టీ సవరణతో తెలంగాణ ఏటా రూ.8 వేల కోట్ల మేర నష్టపోతున్నదని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సూచించిన రెవెన్యూ లోటు గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం పూర్తిగా పక్కన పెట్టడంతో రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్య్రం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రంగాలవారీగా, రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకు కత్తెర పెట్టడం వల్ల తెలంగాణకు మరో రూ.5 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బలమైన రాష్ట్రాలను బలహీనపర్చి నిధుల కోసం కేంద్రంపై ఆధారపడేలా చేసే కుట్ర దీని వెనుక ఉందని విమర్శించారు.
బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులకు పట్టదా?
ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు భాగమనీ, కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడేవి కావని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. మన దేశం సమగ్ర అభివృద్ధి సాధించాలన్నా, కేంద్రం చెప్పుకుంటున్న వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలన్నా అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని సూచించారు.
తెలంగాణకు పదేండ్ల నుంచి నిధుల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరుగుతుంటే బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వారు ఎత్తిచూపకపోగా రాష్ట్ర ఖజానాకు కేంద్రమే పూర్తి నిధులు సమకూర్చుతున్నట్టు కేంద్ర మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణాలను కూడా రాష్ట్రానికి విడుదల చేసే నిధుల ఖాతాల్లో వేస్తున్న బీజేపీ నేతలు… వాటిని నిర్మించి మళ్లీ ప్రజల నుంచే టోల్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్న విషయాన్ని ఎందుకు ప్రజలకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
కేంద్రాన్ని నిలేద్దాం కలిసిరండి
తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ, రైతు భరోసా, పంట కొనుగోళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో భారీగా ఖర్చు చేస్తోందని, కానీ కేంద్రం నుంచి రావాల్సిన న్యాయమైన వాటా రాకపోవడం రాష్ట్ర ఆర్థికాభివద్ధికి అడ్డంకిగా మారుతోందని వాపోయారు. తాజా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం సూచించిన ఒక్క ప్రతిపాదనను కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు కూడా తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధ వాటాకోసం కేంద్రంతో పోరాడటానికి తమతో కలిసి రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.



