Wednesday, February 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅమెరికాతో ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందే

అమెరికాతో ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందే

- Advertisement -

అప్పటివరకూ ఐక్యంగా పోరాడుతాం : సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘాల నేతలు
గోల్కొండ క్రాస్‌రోడ్స్‌ వద్ద ట్రంప్‌, మోడీ దిష్టిబొమ్మ దహనం
12న సమ్మెను జయప్రదం చేయాలి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసే వరకూ ఐక్య పోరాటాన్ని నిర్వహి స్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు ప్రకటించారు. 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌లోని గోల్కొండ క్రాస్‌రోడ్స్‌ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మోడీ, ట్రంప్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టే పనిలో మోడీ పడ్డారని విమర్శించారు.

అందులో భాగంగానే వచ్చే ఐదేండ్లలో 500 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేలా ఒప్పందం చేసుకున్నార న్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలని అమెరికా ఆదేశిస్తే మోడీ సర్కారు అంగీకరించ డమేంటని ప్రశ్నించారు. ట్రంప్‌ జూనియర్‌ భాగస్వామిగా మోడీ తయారయ్యారని విమర్శించారు. ఆత్మనిర్భర భారత్‌, స్వదేశీ జపం చేస్తూనే అమెరికా వస్తువులు విచ్చలవిడిగా దిగుమతి అయ్యేలా ద్వారాలు తెరవడం సిగ్గుచేటన్నారు. అలా చేయడమంటే దేశంలోని కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజల జీవితాలను విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టడమే నని అన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే అమెరికా నుంచి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్‌ తదితర పంటలు, పాలు, పాల పదార్థాలు ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా పెద్ద ఎత్తున మన దేశంలోకి దిగుమతి అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా తమ రైతులకు వ్యవసాయ సబ్సిడీలను 50 శాతం ఇస్తుండగా…మన దేశంలో మోడీ సర్కారు మూడు శాతమే ఇస్తున్న విషయాన్ని ఎత్తిచూపారు. మన దేశ వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులతో పోల్చితే అమెరికా వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు చాలా చౌకనీ, అవి మన దేశంలోకి వస్తే మన రైతులు దివాలా తీస్తారని హెచ్చరించారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధర ఇవ్వకపోవడం, ఎరువుల మీద సబ్సిడీలు తగ్గించడం, సాగుబోర్లకు స్మార్ట్‌మీటర్లు బిగించడం లాంటివన్నీ వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడంలో భాగమేనని విమర్శించారు. విత్తన చట్టంతో ప్రపంచంలోని నాలుగు బడా కార్పొరేట్ల చేతుల్లోకి విత్తనం పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం -2005ను రద్దుచేసి, పేదలకు ఉపాధి లేకుండా చేసే 2025 వీబీజీఆర్‌ఏఎమ్‌జీ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమన్నారు. కేంద్రం తన వాటాను 90 నుంచి 60 శాతానికి తగ్గించుకోవడం, రాష్ట్రాలు 40 శాతం ఖర్చుపెడితేనే నిధులు విడుదల చేస్తామని మెలిక పెట్టడం దారుణమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ గ్రామ గ్రామాన నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.

లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ కార్మిక వర్గం ఈ నెల 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ అధ్యక్షులు కోట రమేశ్‌, పీఎన్‌ఎమ్‌ రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య, ఎస్వీ.రమ, ఈశ్వర్‌రావు, రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్‌, వెంకటేశ్‌, రాష్ట్ర నాయకులు ప్రసాద్‌, సోమన్న, ఎం.శ్రీనివాస్‌, ఎం వెంకటేష్‌, కుమార్‌, దశరథ్‌ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, నాయకులు ఆర్‌ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -