Wednesday, February 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునేడే పోలింగ్‌

నేడే పోలింగ్‌

- Advertisement -

116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలో సర్వం సిద్ధం
2,983 స్థానాల్లో 12,652 మంది పోటీ
100 శాతం పోలింగ్‌ స్లిప్పులు పంచాం-ఎస్‌ఈసీ
పోలింగ్‌ కేంద్రాల వద్ద ఆంక్షలు
విద్యాసంస్థలకు సెలవు..ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల్లోని 2,983 వార్డులకు బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవుతోంది. సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పోలింగ్‌లో ఆ సమయానికి క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పిస్తారు. జరగనున్న పోలింగ్‌కు సర్వం సిద్దం చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘కార్పొరేషన్లలో 414 వార్డులకు 2,225 మంది పోటీలో ఉన్నారు. 2 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మున్సిపాల్టీల్లో 2,582 స్థానాలకు 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికల కోసం 8,188 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామనీ, 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఓటర్లలో 25,49,750 మంది పురుషులు, 26,67,025 మంది మహిళలు, 638 మంది ఇతరులు ఉన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 8,191 పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. 1,379 మంది రిటర్నింగ్‌ అధికారులు, 41,773 మంది పోలింగ్‌ సిబ్బందిని ఈ ఎన్నికల నిర్వహణ కోసం నియమించారు. మంగళవారం డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాల నుంచి ఎన్నికల సామాగ్రి తీసుకుని సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఫిబ్రవరి 16న వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం అదే రోజు మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ ఎన్నికలు నిర్వహిస్తారు. ఏదైనా కారణం చేత ఎన్నిక వీలు కాకుంటే మరుసటి రోజు ఫిబ్రవరి 17న నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లు ఓటరు గుర్తింపు కార్డుతో పాటు ఆధార్‌, రేషన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ సహా ఎన్నికల సంఘం గుర్తించిన 18 రకాల ఐడీ కార్డులను ఉపయోగించి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పోలింగ్‌ జరిగే స్టేషన్ల పరిధిలో బీఎన్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లందరూ స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటేయ్యండి” అని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుల కోసం 92400 212456 టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేశారు. ఓటు ఆవశ్యకతను తెలిపే వీడియో, ఆడియో సందేశాలను ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది.

‘పెయిడ్‌ హాలిడే’
ఎన్నికలు జరగనున్న మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ రోజును ‘పెయిడ్‌ హాలిడే’ (వేతనంతో కూడిన సెలవు)గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్యాక్టరీలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక వాడల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులందరికీ సెలవు వర్తిస్తుందని తెలిపింది. తెలంగాణ ఫ్యాక్టరీస్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌ (1974), తెలంగాణ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌ (1988) ప్రకారం ప్రభుత్వం పెయిడ్‌ హాలీడేను ప్రకటించినట్టు వివరించింది. పోలింగ్‌ సజావుగా సాగేందుకు ఉద్యోగులకు సెలవు అమలయ్యేలా చూడాలని లేబర్‌ కమిషనర్‌, ఫ్యాక్టరీల డైరెక్టర్‌, అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. పోలింగ్‌ రోజున ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో ఉన్న స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఆ క్రమంలో పోలింగ్‌ జరగనున్న ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రయివేట్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్‌ క్యాజ్‌వల్‌ లీవ్‌ మంజూరు చేసింది.

కార్పొరేషన్లలో…
పోలింగ్‌ జరిగే కార్పొరేషన్లు : 07
మొత్తం వార్డులు: 414
ఏకగ్రీవమైన వార్డులు: 2
పోటీ జరగనున్న వార్డులు: 412
పోటీలో ఉన్న అభ్యర్థులు: 2,225
పోలింగ్‌ స్టేషన్లు : 2,174

మున్సిపాల్టీల్లో…
పోలింగ్‌ జరిగే మున్సిపాల్టీలు : 116
మొత్తం వార్డులు : 2,582
ఏకగ్రీవమైన వార్డులు: 12
వాయిదాపడ్డవి : 01
పోలింగ్‌ జరిగే వార్డులు : 2,569
పోటీలో ఉన్న అభ్యర్థులు: 10,719
పోలింగ్‌ స్టేషన్లు : 6,017

ఓటర్ల సంఖ్య ఇలా…
పురుషులు: 25,49,750
మహిళలు: 26,67,025
ఇతరులు: 638

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -