Wednesday, February 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమొక్కజొన్న పంట ఎండుతోంది

మొక్కజొన్న పంట ఎండుతోంది

- Advertisement -

నీరు విడుదల చేసి బీబీసీ
కింద పంటలను కాపాడాలి
ఏపీ, తెలంగాణ రైతుల పోటాపోటీ ఆందోళనలు
ఖమ్మం సీఈవో రమేశ్‌ బాబు హామీతో ఆందోళన విరమణ
జాతీయ రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు
నవతెలంగాణ-బోనకల్‌
బోనకల్‌ బ్రాంచ్‌ కెనాల్‌(బీబీసీ) కింద సాగుచేసిన సుమారు 3000 ఎకరాలలో మొక్కజొన్న పంట ఎండిపోతుందని కెనాల్‌ పరిధికి చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల రైతులు తమ సరిహద్దుల ప్రాంతాల్లో విడివిడిగా రాస్తారోకో నిర్వహించారు. చివరికి ఖమ్మం సీఈవో రమేష్‌ బాబు రైతులతో మాట్లాడి ఆందోళన విరమించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌, మధిర మండలాలకు చెందిన మోటమర్రి, గోవిందాపురం(ఏ), మడుపల్లి, అల్లినగరం గ్రామాల రైతులు వైరా- జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. బోనకల్‌ సబ్‌ డివిజన్‌ డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లు ఉద్దేశపూర్వకంగానే దాములూరు మేజర్‌కు సాగర్‌ నీటిని విడుదల చేయటం లేదని ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వత్సవాయి, పోలంపల్లి, ఖమ్మంపాడు, వేముల నర్వ, వేములగడ్డ తదితర గ్రామాల రైతులు వైరా – జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. వీరి ఆందోళనతో వత్సవాయి ఎస్సై పి. ఉమా మహేష్‌, జగ్గయ్యపేట ఎన్‌ఎస్పీ డీఈ చంద్రశేఖర్‌, ఏఈ ప్రసన్నలక్ష్మి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులు వడ్లమూడి రాంబాబు, వత్సవాయి సాగునీటి డీసీ అధ్యక్షుడు చిట్టూరి సుభాష్‌, రైతు సంఘం ఎన్టీఆర్‌ జిల్లా నాయకులు చిరుమామిళ్ల హనుమంతురావు, మండేపూడి చంద్రశేఖర రావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బొడ్డు రాముతో వారు చర్చలు జరిపారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. డీఈ చంద్రశేఖర్‌, బోనకల్‌ సబ్‌ డివిజన్‌ డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లుకు, కల్లూరు ఎస్‌ఈ వాసంతికి ఫోన్లో రైతుల సమస్యను వివరించారు.

తాము దాములూరి మేజర్‌కు నీటిని విడుదల చేయబోమని, పదేపదే డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లుకు చెబుతున్నా తమ మాటను లెక్కచేయడం లేదని వాసంతి సమాధానం చెప్పారు. దీంతో రైతులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఆంధ్ర ప్రాంత రైతులం కావడం వల్లే డీఈ ఉద్దేశపూర్వకంగానే నీటిని విడుదల చేయడం లేదని, తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని అన్నారు. కృష్ణా జిల్లా ఎస్‌ఈతో ఫోన్లో మాట్లాడారు. దీంతో ఆయన ఖమ్మం సీఈఓతో మాట్లాడి సాగర్‌ నీరు వచ్చే విధంగా ప్రయత్నిస్తానని ఆందోళన విరమించాలని రైతులను కోరడంతో అందుకు రైతులు అంగీకరించారు. వత్సవాయి ఎస్‌ఐ ఉమా మహేశ్‌ కృషితో రైతులు తమ ఆందోళన విరమించారు. తెలంగాణ రైతులు రెండు గంటలపాటు ఆందోళన చేసినా బోనకల్‌ సబ్‌ డివిజన్‌ డీఈ గానీ, ఇతరులు గానీ సంఘటనా స్థలానికి రాలేదు. చివరకు ఆంధ్ర రైతులు ఆందోళన విరమించిన తర్వాత తెలంగాణ రైతులకు మద్దతుగా నిలిచారు. తెలంగాణ రైతుల ఆందోళన విషయాన్ని ఖమ్మం ఈఈ మధు, ఎస్‌ఈలు వాసంతి, వెంకటేశ్వర్లు దృష్ట్టికి ఫోన్‌ ద్వారా ఆంధ్ర రైతులు తీసుకెళ్లారు. అయితే వీరి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. తాము 3000 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశామని 15 రోజుల నుంచి సాగర్‌ నీరు రాక పంటలు ఎండిపో తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బోనకల్‌ ఎస్సై పొదిలి వెంకన్న రైతులతో ఫోన్లో మాట్లాడారు. సుమారు రెండున్నర గంటల పాటు రైతుల ఆందోళన కొనసాగుతున్నా నీటిపారుదల శాఖ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో అల్లినగరం గ్రామానికి చెందిన రైతు శాఖమూరి కోటేశ్వరరావు పురుగుల మందు తాగే యత్నం చేయగా సహచర రైతులు వారిం చారు. మండుటెండలో పంటలను కాపాడాలని తాము ఆందోళన చేస్తుంటే అధికారులు పట్టించుకోరా అంటూ ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో బోనకల్‌ బ్రాంచ్‌ కెనాల్‌కు 1300 క్యూసెక్కుల నీటిని సాయంత్రం వరకు విడుదల చేయిస్తానని రైతులు తమ ఆందోళన విరమించాలని ఖమ్మం సీఈవో రమేష్‌ బాబు కోరారు. రైతుల పంటలు పూర్తిగా తడిసే వరకు నీటిని కొనసా గిస్తామని హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణ అన్నదాతలు తమ ఆందోళన విరమించారు. ఈ ఆందోళనతో వత్సవాయి వరకు సుమారు రెండు కిలోమీటర్లు, బోనకల్‌ వైపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు భారీగా నిలవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -