– కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒక విధానమంటూ లేకుండా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతోనూ, కాంగ్రెస్‌తోనూ సర్దుబాట్లు చేసుకుందని విమర్శించారు. ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఆ పార్టీల నాయకులు దుర్భాషలాడుకుంటూ ప్రచారం చేశారని ఆమె ఆరోపించారు. ఓవైసీ బ్రదర్స్ పొద్దు తిరుగుడు పువ్వుల లాంటివారనీ, అధికారం ఎక్కడుంటే అక్కడే ఉంటారని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు ప్రచారం చేసిన మహబూబ్‌నగర్‌లో ఇప్పటికీ రెండు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా అవుతుందని తెలిపారు. సింహం గుర్తు పై పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 1.89 లక్షల ఉద్యోగాల భర్తీకి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. బీసీలకు రూ.20 వేల కోట్లు, బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించాలని కోరారు. ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదనీ, ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు తగ్గుతున్నారనీ, బస్తీ దవాఖానాల్లో మందులు, డాక్టర్ల కొరత ఉన్నా కనీసం సమీక్షించడం లేదనీ, పురపాలికల్లో చెత్త పేరుకుపోయినా ఎమ్మెల్యేలకు పట్టడం లేదని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలుంటే గుంపు మేస్త్రి, గుంటనక్క స్నేహం కారణంగా సిద్ధిపేటకు మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మంజూరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.7 వేల కోట్ల భూములు అమ్మారనీ, రెవెన్యూ డిఫిసిట్ రూ.9 వేల కోట్లు ఉందనీ, అప్పులు 122 శాతం ఎక్కువగా చేశారనీ, గత బడ్జెట్లో ఫించన్ల కోసం రూ.లక్షా 21 వేల కోట్లు కేటాయించి రూ.51 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే బడ్జెట్ రూ.3.25 లక్షల కోట్లు పెట్టే అవకాశమున్నందున బీసీ,ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. అదే విధంగా వివిధ వర్గాలకు ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించాలని కోరారు. రైతులకు రుణమాఫీ వందశాతం చేయలేదనీ, దీనిపై తాను ఎక్కడైనా సరే చర్చించేందుకు సిద్ధమని ఆమె సవాల్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
సార్వత్రిక సమ్మెకు మద్దతు
ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె-గ్రామీణ బంద్‌కు కవిత మద్దతు ప్రకటించారు. అదే రోజు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సహకరిస్తున్నారని ఆమె విమర్శించారు. కులగణనకు సంబంధించి ఓబీసీ కాలం పెట్టకపోయినా స్పందించలేదనీ, ఉపాధి హామీకి సంబంధించి రాష్ట్రాలకు 40 శాతం వాటా నిర్ణయిస్తూ కొత్త చట్టం తెస్తున్నా ఆందోళన చేయలేదని ఆమె గుర్తుచేశారు. మైనార్టీల బడ్జెట్ విషయంలోనూ కాంగ్రెస్ కేటాయించిన నిధులు ఖర్చు చేయలేదని ఆమె విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను ఎన్నుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



