– మోడీని విమర్శిస్తూ కార్టూన్ వేశారని…
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీపై వ్యంగ్య కార్టూన్ ప్రచురించారన్న కారణంతో ‘ది వైర్’ పోర్టల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను సోమవారం సాయంత్రం సుమారు రెండు గంటల పాటు నిలిపివేశారు. ఈ అకౌంట్‌కు 13 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆన్‌లైన్ వార్తలు, అభిప్రాయాలు, విశ్లేషణలు, హాస్యోక్తులు, వ్యంగ్యాస్త్రాలను అందిస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ‘ది వైర్’ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అత్యంత ప్రజాదరణ పొందింది.
దీనిని గణనీయమైన సంఖ్యలో పాఠకులు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ పేజీని సోమవారం సాయంత్రం తెరిచిన పాఠకులు దానిపై కన్పించిన మెసేజ్ చూసి దిగ్భ్రాంతి చెందారు. ‘భారతదేశంలో అందుబాటులో లేదు… ఇందులోని కంటెంట్‌పై ఆంక్షలు విధించాల్సిందిగా మాకు న్యాయపరమైన అభ్యర్థన అందింది. దానిని అనుగుణంగా ఈ పేజీని నిలిపివేశాం’ అని అందులో పేర్కొన్నారు. అయితే వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్)లో, దేశం వెలుపల అందుబాటులో ఉన్న ఈ *-పేజీని పాఠకులు చూడగలిగారు.
ఈ పరిణామంపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులను సంప్రదించగా తాము ఏ ఖాతానూ నిలిపివేయలేదని తెలిపారు.
అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న 52 సెకన్ల వ్యంగ కార్టూన్‌ను తొలగించాలంటూ మంత్రిత్వ శాఖ నుంచి మెటాకు ఆదేశాలు అందాయని ‘ది వైర్’కు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌నే మెగా బ్లాక్ చేసింది. రాత్రి 8.30 గంటలకు ప్రధాన అకౌంట్‌ను పునరుద్ధరించినప్పటికీ కార్టూన్ మాత్రం కన్పించలేదు. ఫేస్‌బుక్‌లో కూడా కార్టూన్‌ను పోస్ట్ చేయగా దానిని కూడా తొలగించారు. ఐటీ చట్టం ప్రకారం…ఒక వ్యాసాన్ని లేదా పేజీని తొలగించే ముందు మంత్రిత్వ శాఖ ముందుగా ప్రచురణకర్తకు సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్‌లో ఈ నెల 7వ తేదీన ఈ కార్టూన్‌ను పోస్ట్ చేయగా ఇప్పటి వరకూ ‘ది వైర్’ పోర్టల్‌కు ఎలాంటి లిఖితపూర్వక సమాచారం ఇవ్వలేదు. మంగళవారం కూడా ఈ కార్టూన్‌ను బ్లాక్ చేశారు. అయితే యూట్యూబ్, బ్లూస్కైలో ఇప్పటికీ కార్టూన్ కన్పిస్తోంది.
వైర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నిలిపివేత
- Advertisement -
- Advertisement -



