– దిక్కుతోచని స్థితిలో 10 కోట్ల మంది రవాణా కార్మికులు
– కార్పొరేట్ల చేతిలోకి వెళ్తున్న రవాణా వ్యవస్థ
– ఆందోళన కలిగిస్తున్న కొత్త చట్టాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన రవాణా రంగం ఇప్పుడు సంక్షోభం అంచున నిలబడింది. ప్రజలను, వస్తువులను గమ్యస్థానాలకు చేరవేస్తూ, సమాజ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రంగం, దానిని నమ్ముకున్న 10 కోట్ల మంది డ్రైవర్ల పాలిట మాత్రం శాపంగా మారుతోంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం వాహనాల సంఖ్య ఏటా 9శాతం పెరుగుతున్నప్పటికీ, కార్మికుల సంక్షేమం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
అసంఘటితమే శాపం.. అటకెక్కిన వీవీ గిరి నివేదిక!
రవాణా రంగంలో పనిచేస్తున్న వారిలో 90 శాతానికి పైగా అసంఘటిత కార్మికులే. వీరికి పీఎఫ్, ఈఎస్‌ఐ, కనీసం వారపు సెలవు వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు లేవు. వాతావరణం ఎలా ఉన్నా 24 గంటలూ చక్రం తిప్పాల్సిందే. 2006లోనే వీవీ గిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ కార్మికుల స్థితిగతులపై అధ్యయనం చేసి, ఒక్క కార్మికుడు ఉన్నా చట్టాలు వర్తింపజేయాలని సిఫార్సు చేసినా, ఆ నివేదిక నేటికీ కోల్డ్ స్టోరేజీలోనే మగ్గుతుండటం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనం.
రంగాల వారీగా దోపిడీ..
హైవేలపై రోజుల తరబడి ప్రయాణించే ట్రక్ డ్రైవర్లకు కనీస సౌకర్యాలు (తిండి, విశ్రాంతి, టాయిలెట్లు) లేవు. పైగా పోలీసులు, ఆర్టీఏ అధికారుల వేధింపులు, దొంగల దాడులు నిత్యకృత్యమయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనైతే డ్రైవర్లు ప్రాణాలకు తెగించి వాహనాలు నడపాల్సి వస్తోంది. ఇక ఎఫ్‌సీఐ గోడౌన్‌లలో స్థానిక లారీలను పక్కనపెట్టి, బడా కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఎఫ్‌సీఐ గోడౌన్ల నుంచి వివిధ ప్రదేశాలకు సామాగ్రిని రవాణా చేసే ట్రక్కులు స్థానిక ట్రక్కులు.. ఇటీవల స్థానిక ట్రక్కులను పంపిణీ చేసి పెద్ద కంపెనీలకు అప్పగించాలని భారత ప్రభుత్వం కేరళ రాష్ట్ర ఎఫ్‌సీఐ అధికారులను ఆదేశించింది. దాంతో కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కేరళలో పెద్ద పోరాటం జరుగుతోంది. చిన్న యజమానులను తొలగించి ఈ రంగాన్ని పెద్ద సంస్థలకు అప్పగించడం. అటు ఆయిల్ ట్యాంకర్ల విషయంలోనూ, 8 ఏండ్ల ఈఎంఐ ఉండగా.. కేవలం 5 ఏండ్ల లోపు వాహనాలనే అనుమతిస్తామన్న నిబంధనతో చిన్న యజమానులను రోడ్డున పడేసి, కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఇక ఆటో ట్రాలీలు, టాటా ఏస్ వంటి చిన్న వాహన యజమానులను కూడా ‘పోర్టర్’ వంటి యాప్ ఆధారిత సంస్థలు దెబ్బతీస్తున్నాయి. ఓలా, ఉబర్ డ్రైవర్ల మాదిరిగానే వీరు కూడా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.
కొత్త చట్టాలతో ఉచ్చు..
ఓవైపు రవాణా రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేలా ‘మోటార్ వెహికల్ యాక్ట్-2019’లో సెక్షన్ 93ని చొప్పించిన కేంద్రం, మరోవైపు ‘భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్)-2023’ పేరుతో డ్రైవర్లపై కఠిన శిక్షలను ప్రవేశపెట్టింది. పాత ఐపీసీ సెక్షన్ 304ఏ ప్రకారం ప్రమాదాలకు రెండేండ్ల శిక్ష ఉంటే, కొత్త బీఎన్‌ఎస్ సెక్షన్ 106(1) అండ్ (2) ప్రకారం 10 ఏండ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల జరిమానా విధించడం డ్రైవర్లను భయాందోళనలకు గురిచేస్తోంది. ‘ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వారిని కాపాడబోతే జనం కొట్టి చంపుతారు.. పారిపోతే చట్టం జైల్లో పెడుతుంది. అందుకే కార్మిక హక్కులు, కార్మిక ఉద్యమాలను, మన రవాణారంగాన్ని, మన బతుకులను, భద్రతను కాపాడుకోవడానికి రవాణా రంగ కార్మికులకు పోరాటం తప్ప మరో మార్గం లేదు. కావునా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్-సీఐటీయూ) పిలుపు మేరకు 12న జరిగే సమ్మెలో రవాణా కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్-సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ పిలుపునిచ్చారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక.. బతుకు బండికి లేదు భరోసా!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



