Wednesday, February 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబంగ్లాదేశీయులు, రోహింగ్యాల తరలింపు చర్యలు తీసుకోవట్లేదు

బంగ్లాదేశీయులు, రోహింగ్యాల తరలింపు చర్యలు తీసుకోవట్లేదు

- Advertisement -

హైకోర్టులో పిటిషన్‌ దాఖలు
నవతెలంగాణ-హైదరాబాద్‌

రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల తరలింపునకు పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను జస్టిస్‌ ఈవీ.వేణుగోపాల్‌ మంగళవారం ఆదేశాలను జారీ చేశారు. విచారణను మార్చి మూడో తేదీకి వాయిదా వేశారు. కరుణసాగర్‌ వేసిన పిటిషన్‌లో వాళ్లంతా ఓటర్‌, రేషన్‌, ఆధార్‌ కార్డులు కూడా పొందారనీ, దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. బాలాపూర్‌లో 7 వేల మందికి పైగా ఉన్నట్లుగా ప్రభుత్వమే కోర్టుకు చెప్పిందని ప్రస్తావించారు.

బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలు
తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు గత నెల 30 జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం మొదలైంది. ఉదయం లెక్కింపు ప్రారంభించగా సాయంత్రానికి 500 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. బాక్స్‌-1లో 262, బాక్స్‌-2లో 236.. మొత్తం 498 ఓట్లు ఉండగా వాటిలో 294 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. మిగిలిన సుమారు 40 శాతం అంటే 204 ఓట్లు చెల్లలేదు. 23 మంది సభ్యుల పదవుల్లో ఐదుగురు మహిళలు ఉంటారు. పోటీ పడిన లాయర్లు 203 మందిలో 55 మంది మహిళా న్యాయవాదులు ఉన్నారు.

కౌంటర్‌ వేయకపోతే జరిమానా చెల్లించండి
హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల రక్షణకు తీసుకున్న చర్యలపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్రానికి హైకోర్టు మరోసారి నోటీసులిచ్చింది. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయకపోతే రూ.5 వేలను స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి చెల్లించాలంది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌ ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ మంగళవారం ఆదేశాలిచ్చింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులకు ఎఫ్‌టీఎల్‌ నిర్ణయించాలనీ, చెరువుల రక్షణకు ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పలు పిటిషన్లల్లో ప్రభుత్వం కౌంటర్‌ వేశాక పిటిషనర్లు రిప్లై కౌంటర్లు దాఖలు చేయాలంది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. మల్కం చెరువు, కింది కుంట, అమీన్‌పూర్‌ చెరువు, చిన్నచెరువు ఇతర చెరువుల ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ, చెరువుల రక్షణకు తీసుకున్న చర్యలపై కౌంటర్లు వేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరడంతో హైకోర్టు పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది.

ట్రాఫికింగ్‌పై పిటిషన్‌
వ్యభిచార కూపంలో పట్టుబడిన వాళ్లను హోమ్స్‌కు తరలింపు విషయంలో పాటించాల్సిన గైడ్‌లైన్స్‌ రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రజ్వల అనే స్వచ్ఛంద సంస్థ సూచనలను కూడా పరిశీలించాలంది. అక్రమ లైంగిక కార్యకలాపాల్లో పట్టుబడిన బాధితుల తరలింపులో పాటించే విధానాలను ప్రజ్వల సంస్థ ప్రశ్నిస్తూ వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారించింది. బాధితులను, నిర్వాహకులను ఒక హోంలో ఉంచడం అన్యాయమని పిటిషనర్‌ వాదన.

అక్రిడేషన్‌ జీవోపై స్టేకు హైకోర్టు నిరాకరణ
తెలంగాణ రాష్ట్ర మీడియా అక్రిడేషన్‌ విధానాన్ని నిర్ణయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ జీఏడీ ముఖ్యకార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్‌, మీడియా అకాడమీ చైర్మెన్‌లకు ఉత్తర్వులు జారీ చేసింది. అక్రిడేషన్‌ పొందే అర్హతలను నిర్ణయిస్తూ ప్రభుత్వ జీవో 22ను కొట్టేయాలంటూ హైటెక్‌ ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా అసోసియేషన్‌ పిటిషన్‌ వేసింది. తీర్పు ఇచ్చేలోగా జీవో అమలును నిలిపివేయాలని పిటిషనర్‌ లాయర్‌ వాదనను చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తిరస్కరించింది. ‘కేబుల్‌ ఛానల్స్‌, డిజిటల్‌ జర్నలిస్టులకు అక్రిడేషన్ల నిబంధనల జీవో తీవ్ర నష్టం కలిగిస్తోంది. వివక్షపూరితంగా ఉంది. రాజ్యాంగ కల్పించిన హక్కులను భంగం కలిగిస్తోంది.
ఇప్పటికే అక్రిడేషన్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి జీవో అమలును నిలిపివేస్తూ స్టే ఆదేశాలు ఇవ్వాలి’ అని పిటిషనర్‌ న్యాయవాది వాదించారు. ప్రభుత్వ వాదనలు విన్నాకే స్టే అభ్యర్థనపై నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణను మార్చి 12కు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -