నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రభుత్వ దవాఖానాలలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండల కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిని వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రుల్లో పేదలకు సరైన అందాలని అన్నారు. ప్రజలకు అన్ని రకాల వైద్యం అందే విధంగా ప్రభుత్వ దవాఖానాలు ఉపయోగపడాలని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ విభాగాలకు వైద్యులను నియమించాలని సూచించారు. అన్ని రకాల మందులు ఫార్మసీలలో అందుబాటులో ఉంచాలని కోరారు.
నియోజకవర్గ కేంద్రంగా ఉన్న తుంగతుర్తి ప్రభుత్వ వైద్యశాలలో 26 మంది స్టాఫ్ నర్స్ అవసరమవగా.. కేవలం కొద్దిమంది సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనివల్ల ప్రజలకు తగిన వైద్యం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఐదుగురు డాక్టర్లలో ముగ్గురు డిప్యుటేషన్ మీద, ఇద్దరు కాంట్రాక్టు వైద్యులు ఉన్నందువల్ల రోగులకు సరైన వైద్యం అందడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడా సిబ్బందిని వెంటనే సర్కారువారు నియమించానలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎక్స్రేరే మిషన్ పనిచేయడం లేదని, చిన్నపిల్లల డాక్టర్, గైనకాలజిస్ట్ లు లేరని గుర్తు చేశారు. దీంతో చిన్నారులు, గర్భీణీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
వెంటనే ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసి, పేద ప్రజలకు 24/7 సేవలందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాసు, మండల కమిటీ సభ్యులు వల్ల సుదర్శన్, ఉప్పుల సోమయ్య, జాజుగాల్ల ముత్తయ్య, గడ్డం ఎల్లయ్య, యాదగిరి, కందుకూరి చంద్రయ్య, వైద్యులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.



